ఇరాన్ లో `హిజాబ్ యువతీ’ మరణం బయటపెట్టిన జర్నలిస్ట్ హమీది అరెస్ట్

హిజాబ్ సరిగా ధరించనందుకు ఇరాన్ నైతిక పోలీసులు నిర్బంధంలో మృతి చెందిన యువతీ  మెహ్సా అమినీ కధనాన్ని మొదటగా ప్రచురించిన సంఘటనకు సంబంధించి  కనీసం ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో షార్క్ వార్తాపత్రిక, వెబ్‌సైట్ జర్నలిస్టు నిలుఫర్ హమీదీ ఒకరు.
 
టెహ్రాన్‌లోని కస్రీ హాస్పిటల్‌లోని తన గది తలుపు వెనుక అమినీ కుటుంబం చిత్రాన్ని ఆమె ప్రచురించింది. పర్షియన్‌లో చేసిన ట్వీట్‌లో, కాంఫిరౌజీ ఇలా అన్నారు, “ఈ ఉదయం, సెక్యూరిటీ ఏజెంట్లు షార్గ్ వార్తాపత్రిక పాత్రికేయురాలు,  నా క్లయింట్ నీలోఫర్ హమేదీ ఇంటిపై దాడి చేసి, ఆమెను అరెస్టు చేశారు. ఆమె ఇంట్లో సోదాలు చేశారు. ఆమె వస్తువులను జప్తు చేశారు”.
 
 ఆమె ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొంటుందో స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు.  అంతేకాకుండా, ఆమె అరెస్టుకు ముందు ఆమె ట్విట్టర్ ఖాతా కూడా సస్పెండ్ చేశారు. చట్టపరమైన అభ్యర్థనను అనుసరించి ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేసిందా లేదా ప్లాట్‌ఫారమ్‌లో ఖాతాకు వ్యతిరేకంగా నివేదించినందున చేశారా అన్నది
 
అస్పష్టంగా ఉంది. మే 28న టెహ్రాన్‌లోని పార్డిసన్ పార్క్‌లో ఒక జంటపై పోలీసు అధికారి కాల్పులు జరిపిన వీడియోను ప్రచురించిన తర్వాత ఆమె ఇంతకు ముందే పోలీసుల ఆగ్రహం ఎదుర్కొంటున్నారు.
 
కాగా, కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజే) కధనం ప్రకారం ఫోటోగ్రాఫర్ యల్డా మీరీను కూడా అరెస్టు చేశారు. ఆమెను అరెస్టు చేసి జైలుకు తరలించిన వార్తలను ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఫోటోగ్రాఫర్‌ని అరెస్టు చేయడాన్ని దర్బయానీ జర్నలిస్ట్స్ ప్రొటెక్షన్ కమిటీ విమర్శించింది.  ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
 
టెహ్రాన్ మధ్యలో, హిజాబ్ స్ట్రీట్‌లో అమిని మరణానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్నప్పుడు ఆమెను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సిపిజే మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సభ్యుడు షరీఫ్ మన్సూర్ ఇలాతెలిపారు: “జర్నలిస్టులను జైలులో పెట్టడం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలను వారు దాచలేరని ఇరాన్ అధికారులు అర్థం చేసుకోవాలి.”
 
 “అధికారులు తక్షణమే, బేషరతుగా యల్డా మీరీని విడుదల చేయాలి.  ఇరాన్‌కు ఈ క్లిష్టమైన సమయంలో పాత్రికేయులను ఏకపక్షంగా జైలులో పెట్టడం ఆపాలి” అని డిమాండ్ చేశారు.
 
ఇలా ఉండగా, ఇరాన్‌లో ఎనిమిది రోజులుగా జరుగుతున్న నిరసనల్లో 140 మంది మహిళలు, యువకులు మరణించారు. మతాధికారుల పాలనలో భద్రతా దళాలు, అల్లర్ల నిరోధక విభాగాలలే  వారిని కాల్చి చంపాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ కూడా కనీసం 5,000 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
 
ఇరాన్‌లో హిజాబ్‌ వివాదం కార్చిచ్చులా వ్యాపిస్తోంది. దేశ రాజధాని టెహ్రాన్‌లో ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా 80 ప్రధాన పట్టణాలు, నగరాలకు చేరాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ ఆందోళనలు మరింత వ్యాపించకుండా ఇరాన్‌ ప్రభుత్వం ఇంటర్నెట్‌పై కఠిన ఆంక్షలు విధిస్తోంది.