జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో .. హెచ్‌సీఏ తీరుపై దుమారం

భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో గురువారం జరిగిన తొక్కిసలాటలో పలువురు  పలువురు యువతులు స్పృహ తప్పి పడిపోవడంతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. మాజీ టీం ఇండియా కెప్టెన్ హాజారుద్దిన్ అధ్యక్షునిగా ఉన్న దీని పనితీరుపై కొంతకాలంగా తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

ఈ నెల 25న జరుగనున్న భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాలకు జింఖానా గ్రౌండ్ లో ఒకటే కౌంటర్ ఏర్పాటు చేశారని, టికెట్ల విక్రయం విషయంలో హెచ్‌సీఏ ప్రణాళిక లేకుండా వ్యవహరించిందని, మ్యాచ్‌కు సంబంధించిన పాస్‌ల జారీ కూడా గందరగోళంగా మారినదని హెచ్‌సీఏపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  హెచ్సీఏ తప్పిదం వల్లే తొక్కిసలాట జరిగిందని, సరైన ఏర్పాట్లు చేయలేదని అడిషనల్ కమిషనర్ చౌహాన్ స్పష్టం చేశారు.

జింఖానా గ్రౌండ్స్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. క్రికెట్ టికెట్ల గందరగోళంపై హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ సహా అధికారులు తన కార్యాలయానికి రావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. అసలు ఎన్ని టికెట్లు ఉన్నాయి..? ఎన్ని ఆన్లైన్లో పెట్టారు..? ఎంతమందికి కాంప్లిమెంటరీ పాసులు ఇచ్చారు..? అనే సమాచారంతో రావాలని ఆదేశించారు. టిక్కెట్ల అమ్మకాలపై నిఘా పెట్టామని చెప్పారు.

 
ఉదయం నుంచే టికెట్స్ అమ్ముతున్నప్పటికీ బాగా ఆలస్యం జరుగుతుండటంతో అభిమానలు ఆగ్రహంతో ఊగిపోయారు. టికెట్స్ దొరుకుతాయో లేదోననే టెన్షన్.. కౌంటర్ బంద్ చేస్తారంటూ జరిగిన ప్రచారం, కేవలం రూ. 800, రూ. 1200 టికెట్స్ మాత్రమే అమ్మడంతో.. అభిమానుల్లో ఆందోళన పెరిగింది. దీంతో అంతా ఒక్కసారిగా కౌంటర్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి లాఠీ ఛార్జ్ దాకా వెళ్లింది.
 
దాదాపు ఐదు రోజులుగా ఫ్యాన్స్ టికెట్స్ కోసం జింఖానా, ఉప్పల్ స్టేడియం చుట్టూ తిరుగుతున్నారు. మొదట్లో ఆన్ లైన్ లో అమ్మినా.. ఆ తర్వాత బుక్ చేసుకున్నవాళ్లకు కూడా డబ్బులు వెనక్కి వచ్చాయి. అటు ఆన్ లైన్ లో, ఇటు ఆఫ్ లైన్ లో టికెట్స్ దొరక్కపోవడంతో ఫ్యాన్స్ లో అసహనం పెరిగిపోయింది.
 
ఆన్ లైన్, కాంప్లిమెంటరీ పేర్లతో అజారుద్దీన్ బృందం బ్లాక్ టిక్కెట్ల అమ్మకానికి తెరలేపి, సాధారణ క్రికెట్ అభిమానులకు కనీసం 2,000 టిక్కెట్లు కూడా కౌంటర్లలో అందుబాటులో పెట్టక పోవడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగినదని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రావినూతల శశిధర్ ధ్వజమెత్తారు. ఈ సంఘటనకు కారణమైన అజారుద్దీన్ తో పాటు, ఇతర  హెచ్‌సీఏసభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
 
అజారుద్దీన్‌తో పాటు హెచ్‌సిఎ నిర్వాహకులపై బేగంపేట పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. అదితి ఆలియా ఎస్‌ఐ ప్రమోద్ ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ యాక్ట్ తో పాటు 420, 21,22/76 పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
 
సోషల్ మీడియా వేదికగా హెచ్సీఏపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా మారేందుకు హెచ్సీఏ వైఖరే కారణమంటూ ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల విక్రయం విషయంలో దారుణంగా విఫలమైన హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కాగా,  జింఖానా గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధాకరమని అజారుద్దీన్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.