రష్యాలో మార్షల్‌ లా విధించవచ్చని మీడియా కథనాలు

ఉక్రెయిన్‌పై మరింతగా దాడి కోసం ప్రయత్నాలను పుతిన్‌ ముమ్మరం చేస్తున్నారు. దేశంలో మార్షల్‌ లా విధించవచ్చని మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో రష్యా నుంచి వెళ్లి పోయేందుకు ఆ దేశ ప్రజలు భారీగా రైల్‌, ఎయిర్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధికారుల ఆదేశాలతో 18-65 ఏళ్ల పురుషులకు టిక్కెట్ల అమ్మకాలను రష్యన్‌ రైల్వే, ఎయిర్‌లైన్స్‌ సంస్థలు నిలిపివేశాయి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతించిన యువకులను మాత్రమే దేశం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు.

కాగా, రష్యా సమీప దేశాలైన అర్మేనియా, జార్జియా, అజర్‌బైజాన్, కజాఖస్తాన్‌ దేశాలకు వెళ్లే అన్ని విమానాల టిక్కెట్లు అమ్ముడైనట్లు రష్యాకు చెందిన ప్రముఖ ఏవియాసేల్స్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. అలాగే రష్యా నుంచి ఇస్తాంబుల్‌కు వెళ్లే అన్ని విమానాల టిక్కెట్లు శనివారం వరకు బుక్‌ అయినట్లు టర్కీ ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది.

మరోవైపు ఉక్రెయిన్‌పై దాడి కోసం జైల్లో ఖైదీలుగా మగ్గుతున్న కిరాతక దొంగలు, కరుడుగట్టిన హంతకులను సైన్యంలోకి రిక్రూట్‌ చేసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశించారు. అలాగే భారీగా సైనిక నియామకాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

దీంతో ఖైదీల రిక్రూట్‌మెంట్‌ను వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ చేపడుతున్నట్లు గార్డియన్‌ తెలిపింది. నర హంతకులతోపాటు నరమాంస భక్షకులు కూడా ఇందులో ఉంటారని పేర్కొంది. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రిక్రూట్‌ చేసే ఖైదీలకు ఆరు నెలల తర్వాత అధ్యక్షుడి క్షమాభిక్షతోపాటు నెలకు లక్ష రూబెల్స్‌ వేతనంగా ఇస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది.

 పుతిన్‌ ఆదేశాలతో మూడు లక్షల మందిని సైన్యంలోకి తీసుకుంటామని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు బుధవారం తెలిపారు. మరోవంక, ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాను శిక్షించాల్సిందే అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రీ రికార్డింగ్‌ వీడియోను  ప్లే చేశారు.

రష్యా అధ్యక్షులు తాజాగా చేసిన టీవీ ప్రసంగం ప్రపంచానికి ఆ దేశ అసలు స్వరూపాన్ని మరింతగా వెలుగులోకి తీసుకువచ్చిందని చెబుతూ ఉక్రెయిన్‌పై యుద్ధం నిలిపివేసే ఆలోచన రష్యాకు ఏ కోశానా లేదని మరోసారి స్పష్టం అయిందని ఆయన నిప్పులు చెరిగారు. రష్యా దాడులను తిప్పి కొట్టేందుకు, రష్యా సేనలను తరిమివేసేందుకు తమ దేశం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రత్యేక యుద్ధ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని, యుద్ధ నేరాలకు పాల్పడిన రష్యాపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తమకు మరింత సైనిక సహాయాన్ని అందించాలని, ప్రపంచం ముందు రష్యాకు శిక్ష వేయాలని కోరారు. జెలెన్‌స్కీ ప్రసంగం ప్లే అవుతున్న సమయంలో.. జనరల్‌ అసెంబ్లీలో ఉన్న చాలా మంది సభ్యులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.

అనైతిక పద్ధతిలో యుద్ధానికి దిగిన రష్యా వినాశకర పరిస్థితుల్ని సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. పుతిన్‌ చేసిన ప్రకటన చూస్తే వాళ్లు శాంతి చర్చల పట్ల కట్టుబడి లేరని తెలుస్తోందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.