తెలంగాణాలో ఉగ్రవాదులు, అవినీతిపరులను జైల్లో వేస్తాం

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే  ఉగ్రవాదులను, ప్రజల సొమ్ము దోచిన పార్టీల నేతలను కూడా జైల్లో వేస్తామని కేంద్రం గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి స్పష్టం చేశారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాల్గో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా అంబర్ పెట్ లో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ యూపీ లో ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళ ఇండ్లను సీఎం యోగి బుల్డోజర్ల తో కూలగొట్టిండని ఆమె గుర్తు చేశారు.

 
తెలంగాణ లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తే  ప్రజా ధనాన్ని దోచుకున్న వాళ్ళ ఇండ్లను బుల్డోజర్లతో కూలగొడతామని ఆమె వెల్లడించారు. 2014 కు ముందు హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉగ్రవాద ముప్పు భయం ఉండేదని ఆమె గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ  ప్రభుత్వం వచ్చాకే.  హైదరాబాద్ లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని ఆమె తెలిపారు.
 
తెలంగాణలో కుటుంబ పాలన పోయి, ప్రజల కేంద్రంగా ఉండే ప్రభుత్వం ఏర్పడాలని  సాధ్వి నిరంజన్ జ్యోతి పిలుపిచ్చారు. ఉగ్రవాదుల ఇండ్లు కూలిస్  ఎంఐఎం లాంటి పార్టీలకు ఎందుకు బాధ కలుగుతోందని ఆమె ప్రశ్నించారు. 

తెలంగాణ విమోచన దినోత్సవం” ను ఎంఐఎం కు భయపడే… 8 ఏళ్లుగా కేసీఆర్ జరపలేదని ఆమె విమర్శించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని ఆమె గుర్తు చేశారు.
 
కేసీఆర్ ఓ వర్గాన్ని సంతృప్తి పరచడానికి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకపోతే  కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.  హైదరాబాద్ లో మతమార్పిడులు జరుగుతున్నట్టు తనకు సమాచారం ఉందని ఆమె విమర్శించారు.  గతంలో ఉత్తర్ ప్రదేశ్ లో 77 సీట్లు ఉంటే… అక్కడ ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని చెబుతూ  తెలంగాణ లో 3 అసెంబ్లీ స్థానాల్లో ఉంటే ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణాలో ప్రజలు మార్పు కోరుతున్నారని ఆమె చెప్పారు.
 
ప్రస్తుతం పిడి చట్టం క్రింద అరెస్ట్ అయి జైలులో ఉన్న బిజెపి ఎమ్యెల్యే ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మన దేవుళ్లను, దేవతలను కించపరిస్ మనం ఓర్చుకోగలమా? అని ఆమె ప్రశ్నించారు.  రామ భక్తులు జైలుకు వెళ్ళారు… వాళ్ళు త్వరలోనే బయటికి వస్తారని భరోసా వ్యక్తం చేశారు.
 
ఓవైసీ లాంటి విషపాములు దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ, బీజేపీ ని మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, రాహుల్ గాంధీ చేసేది భారత్ జోడో యాత్ర కాదని, భారత్ చోడో యాత్ర అని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.  ఇదే రాహుల్ గాంధీకి చివరి యాత్ర అవుతుందని, ఆ తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్లాల్సిందే అని ఆమె స్పష్టం చేశారు.
 
రాహుల్ గాంధీ దళితుల ఇంట్లో కూర్చుని రోటీ తింటే, దళితుల పేదరికం పోతుందా? అని సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రశ్నించారు.  మోదీ పేదలకు మరుగుదొడ్లు, ఇండ్లు కట్టించి, ఉచిత గ్యాస్ ఇచ్చి, రైతులకు కిసాన్ యోజన కింద డబ్బులు ఇచ్చి, పేదల ఆత్మగౌరవం ను నిలబెట్టారని ఆమె గుర్తు చేశారు.  2014 నుంచి బీజేపీ కేంద్రంలో అవినీతి రహిత పాలన అందిస్తోందని తెలిపారు.
 

టీఆర్ఎస్ వెంటిలేటర్పై ఉన్న పార్టీ

 
టీఆర్ఎస్ వెంటిలేటర్పై ఉన్న పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. మునుగోడులో ఓడిపోతారన్న విషయం కేసీఆర్ కు తెలుసని, అందులో ఉపఎన్నికలో గెలుపు కోసం అమలు కాని హామీలు ఇచ్చేందుకు సిద్ధమైతుండని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మునుగోడులో బీజేపీనే గెలుపు ఖాయమని, సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

ఉప ఎన్నికల్లో ఎస్సీ ఓట్ల కోసమే సెక్రటేరియెట్కు అంబేద్కర్ పేరు పెట్టిండని బండి ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కనీసం అంబేద్కర్ జయంతి, వర్థంతి కూడా నిర్వహించలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి హామీలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. 

గిరిజన, ఆదివాసీల విషయంలోనూ ముఖ్యమంత్రి మోసపూరితంగా వ్యవహరించారని సంజయ్ ధ్వజమెత్తారు. ఎస్టీ అభ్యర్థిని రాష్ట్రపతిగా నిలబెడితే ఓడించాలని చూసిండని విమర్శించారు. ప్రస్తుతం ఎస్టీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటూఆదివాసీ, గిరిజన మహిళలను జైలులో పెట్టించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చురకలంటించారు. 

కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో ఏడాది కష్టపడితే కాషాయ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా కేంద్రం ఆధ్వర్యంలో విమోచన దినం చేసుకుని గల్లీగల్లీలో జాతీయ జెండాలు రెపరెపలాడేలా చేశామని అంటూ  పాతబస్తీలో కూడా జాతీయ జెండాలు ఎగురవేసేలా చేసిన ఘటన బీజేపీకే దక్కుతుందని చెప్పారు.