ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు అర్ధాంతరంగా వైఎస్ఆర్ గా మార్పు!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు అర్ధాంతరంగా వైఎస్ఆర్ గా మార్పు!
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును అర్ధాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా మార్చింది. మంగళవారం సాయంత్రం ఇంటర్ నెట్ ద్వారా మంత్రుల ఆమోదం తీసుకొని, బుధవారం ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలను పట్టించుకోకుండా రాష్ట్ర శాసనసభలో ఆమోదింప చేశారు.
 
ఎన్టీఆర్ వ‌ర్సిటీ పేరు మార్పుపై టిడిపి స‌భ్యులు ఉభ‌య‌స‌భ‌ల్లో ఆందోళ‌న నిర్వ‌హించారు. అసెంబ్లీలో స్పీకర్‌, మండలిలో పోడియం పొడియం వద్దకు దూసు కొచ్చిన సభ్యులు ప్లక్లార్డులతో నిరసన తెలిపారు. పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయడంతో స్పీకర్‌ ఆగ్ర హం వ్యక్తం చేశారు. స్పీకర్‌ రక్షణగా వైసీపీ మంత్రులు పోడియం వద్దకు రావడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.
 
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు చివరిరోజు అధికార వైసీపీ తీసుకొచ్చిన బిల్లుపై శాసనసభ, మండలి సమావేశాల్లో గందరగోళం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలోని ఎన్టీఆర్‌ ఆరోగ్యవర్సిటీ పేరుమార్పు చేసే ఆలోచన పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
మంత్రి విడుదల రజనీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేశారు. మంత్రి సభలో మాట్లాడుతూ… ప్రతిపక్షంలో ఉన్నవారికి ఎన్టీఆర్ పేరు గుర్తోస్తోందని, అధికారం ఉంటే ఓ లాగా అధికారం లేకపోతే మరోలా చెబుతారన్నారు. 8 మెడికల్ కాలేజీలను వైఎస్సార్ 11కు చేశారని…దానిని జగన్ 28 మెడికల్ కాలేజీలకు చేర్చారని చెప్పుకొచ్చారు. అందుకే ఆ క్రెడిట్ మనం తీసుకోవాలనే .. వైఎస్ఆర్ పేరు పెట్టామని తెలిపారు. అయితే ఎన్టీఆర్ మీద జగన్‌ కు గౌరవం ఉందని ఆమె స్పష్టం చేశారు.
 
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళలన్లు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును.. ‘వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్సిటీ’గా మార్చడం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..వైస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం తుగ్లక్‌ చర్యలను అవలంభిస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపిం చారు. ఎన్టీఆర్‌ తెలుగు వారి ఆత్మగౌరవమని పేర్కొంటూ ఎన్టీఆర్‌ మహానుభావుడి పేరు తొలగించాలని ఎలా అనిపిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇక ఎవరి పేరు అవసరం లేదనుకుంటున్నారా? అని నిలదీశారు.  ఇలానే చూస్తూపోతే ఆంధ్రప్రదేశ్‌ను జగనాంధ్రప్రదేశ్‌ అని కూడా మారుస్తారని ఎద్దేవా చేశారు.
 
ఎన్టీఆర్ పైన తనకు ఎనలేని గౌరవం

ఎన్టీఆర్ పైన తనకు ఎనలేని గౌరవం ఉందని ముఖ్యమంత్రి వై  ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పేరు ఎత్తితే నచ్చని వ్యక్తి చంద్రబాబు అని చెబుతూ చంద్రబాబు పేరు ఎత్తినే ఇష్టపడని వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. నాడు ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఆయన రెండో సారి పూర్తి కాలం సీఎంగా కొనసాగేవారని తెలిపారు.

అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని అంటూ ఎన్టీఆర్‌ కూతుర్ని గిఫ్ట్‌గా ఇస్తే.. చంద్రబాబు వెన్నుపోటు రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకుంటారని, ఎంతోమందిని ప్రధానులను, రాష్ట్రపతులు చేశానని చెప్పుకుంటారని  అలాంటి చంద్రబాబు ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా ఎందుకు ప్రయత్నించలేదని ప్రశ్నించారు.

యూనివర్సిటీ పేరు మార్చడానికి ముందు తనను తాను ప్రశ్నించుకుని చెబుతూ  బాగా ఆలోచించిన తర్వాతే హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నామని జగన్ తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాకే రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. పథకాల సృష్టికర్త ఎవరు అంటే అందరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారని చెప్పారు.

1983 టీడీపీ పుట్టుక ముందే 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, మరో మూడు కాలేజీలను వైఎస్సార్ తీసుకురాగా, ఇప్పుడు మరో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టని టీడీపీ.. వాళ్లకు కావాల్సిన పేర్లను బలవంతంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు.

నాడు ఎన్టీఆర్ సమయంలో వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నా తమ పార్టీ ఏనాడు ఎన్టీఆర్ పైన ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదని జగన్ స్పష్టం చేశారు. తన పాదయాత్ర సమయంలో క్రిష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టమని ఎవరూ అడగకుండానే హామీ ఇచ్చానని, అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసామని ముఖ్యమంత్రి చెుప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఎన్టీఆర్ పేరు ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని జగన్ తెలిపారు..