యూనివర్సిటీ పేరు మార్పుపై బిజెపి అభ్యంతరం

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. ఇది ముమ్మాటికీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటకలపడమేనని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చిన ఎన్టీఆర్ ఆ మేరకు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
 
ఆయన సేవలకు గుర్తింపుగా హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరును అప్పటి ప్రభుత్వం ఖరారు చేసిందని, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ పేరును తొలగించడం సరికాదని సోము వీర్రాజు హితవు చెప్పారు. ప్రభుత్వం ఒక దురుద్దేశ్యంతో కేవలం ఒక సింగిల్ లైన్‌లో ప్రతిపాదన చేసి శాసన సభలో తీసుకురావడం అంటే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
 
దొడ్డిదోవన ఎన్టీఆర్‌కు ద్రోహం తెచ్చేవిధంగా వ్యవహరించిందనే  పరిస్థితులు కనపడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్టీ రామారావు పేరును తొలగించి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరును ఎలా పెడతారని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని వీర్రాజు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అబద్ధాలు చెప్తుందని అంటూ ఎన్టీఆర్ పేరును ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తొలగించడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ  పేరు వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చడం ఏపీ ప్రభుత్వ అనైతిక, అనారోగ్య రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ మాజీ ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డికు తన తండ్రిపై అంత ప్రేముంటే ఏదైనా కొత్త సంస్థను స్థాపించి దానికి ఆయన పేరు పెట్టుకుంటే ఎవరూ తప్పు పట్టరని  చెప్పారు.

ఇలాంటి చర్యలు రాబోయే రోజుల్లో అనేక అనర్ధాలకు దారి తీసే అవకాశం ఉందని అంటూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అధికార మదం తలకు ఎక్కి పేర్లు మార్పు చేస్తున్నారని బిజెపి నేత సీఎం రమేష్  మండిపడ్డారు. ఎన్టీఆర్‌ ఆభిమానులమని చెప్పుకునే వైసీపీ నేతల చర్య సిగ్గుచేటని అంటూ ఎన్టీఆర్‌ పేరు తొలగింపుపై ప్రతి తెలుగువాడు తిరగబడాలని, ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం చేయాలని పిలుపిచ్చారు.

లక్ష్మి ప్రసాద్ రాజీనామా
కాగా,  ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది చాలా బాధకరమైన విషయమని, ని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనపై మనస్థాపం చెందానన్నారు. వైఎస్ఆర్ పేరు పెట్టడం చాలా బాధగా ఉందని పేర్కొన్నారు.