పట్టణాభివృద్ధికి రోడ్‌మ్యాప్ తయారీలో మేయర్ల కీలక పాత్ర

అభివృద్ధి మంచి ప్రణాళికాబద్ధంగా ఉండాలని  చెబుతూ స్వాతంత్ర్య అమృతోత్సవ కాలంలో రాబోయే 25 ఏళ్ళలో పట్టణాభివృద్ధికి రోడ్‌మ్యాప్ తయారీలో మేయర్లు కీలక పాత్ర పోషించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు.  గుజరాత్‌లోని గాంధీ నగర్‌లో మంగళవారం జరిగిన మేయర్లు, డిప్యూటీ మేయర్ల మండలి సమావేశాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడారు.
 
మన దేశం బీజేపీని నమ్ముతోందని పేర్కొంటూ క్షేత్ర స్థాయి నుంచి కృషి చేయవలసిన కర్తవ్యం, బాధ్యత మేయర్లందరికీ ఉన్నాయని చెప్పారు. మెరుగైన సదుపాయాలను కల్పించాలని, బీజేపీకి నినాదం ‘‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి కృషి’’ని అనుసరించాలని ఆ పార్టీ మేయర్లకు హితవు చెప్పారు. 
 
నగరాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని బిజెపి పాలిత పట్టణ సంస్థల మేయర్‌లను కోరుతూ కేవలం ఎన్నికల కేంద్రీకృత విధానంతో నగరాలను అభివృద్ధి చేయలేమని ప్రధాని స్పష్టం చేశారు. కాబట్టి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేవలం గెలుపే దృష్ట్యా ఆలోచించకూడదని చెబుతూ ప్రజాప్రతినిధులు పేద లబ్ధిదారులతో (ప్రభుత్వ పథకాల) వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారి సంబంధిత నగరాల సుందరీకరణపై కూడా వారితో సమయాన్ని వెచ్చించాలని ప్రధాని సూచించారు.
 
 ‘‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేవలం ఎన్నికల్లో గెలుపొందాలనే కోణంలో ఆలోచించకూడదు. ఎన్నికల కేంద్రీకృత విధానంతో మీరు మీ నగరాన్ని అభివృద్ధి చేయలేరు. చాలా సార్లు, నగరాలకు ప్రయోజనకరంగా ఉండే నిర్ణయాలు ఎన్నికలలో నష్టానికి దారితీస్తాయనే భయంతో మాత్రమే తీసుకోబడవు,” అని ప్రధాని స్పష్టం చేశారు. పట్టణ ప్రణాళిక “వికేంద్రీకరణ” జరగాలని పిలుపిస్తూ రాష్ట్ర స్థాయిలో ప్రణాళిక జరగాలని సూచించారు. ఉపగ్రహ పట్టణాల అభివృద్ధితో నగరాలపై ఒత్తిడి తగ్గుతుందని ప్రధాని పేర్కొన్నారు. 
 
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ మేయర్‌గానే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారని గుర్తు చేస్తూ మెరుగైన భారత దేశం కోసం, దాని అభివృద్ధి కోసం ఆయన అడుగుజాడల్లో నడవాలని మేయర్లకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 
 
నగరాల అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలతో తన ప్రభుత్వాన్ని పోల్చి చెబుతూ  2014 వరకు దేశంలో మెట్రో నెట్‌వర్క్ 250 కిలోమీటర్లు మాత్రమే ఉండేదని ప్రధాని గుర్తు చేశారు. కానీ నేడు ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 775 కిలోమీటర్లకు పెరిగిందని చెప్పారు. అట్లాగే, టైర్-2, టైర్-3 నగరాలు ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతున్నాయని వివరించారు
“నేడు, మేము దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తున్నాము.  ఇప్పటివరకు మనం రూ. 75,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను పూర్తి చేసాము. నగరాలకు అర్బన్ హౌసింగ్ అనేది పెద్ద సవాలు.  ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ) కింద, మనం ఇప్పటివరకు 1.25 కోట్ల ఇళ్లను పేదలకు కేటాయించాము,” అని ప్రధాని చెప్పారు. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు 2014లో రూ.20,000 కోట్లుగా ఉన్న బడ్జెట్ నేడు రూ.2,00,000 కోట్లకు పెరిగిందని వివరించారు. 
 
ఈ ప్రాంతాల్లో పారిశ్రామివాడలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని ప్రధాని మోదీ సూచించారు. డిజిటల్ పేమెంట్స్ సిస్టమ్స్‌ను ఉపయోగించడంలో చిన్న వ్యాపారులకు శిక్షణ ఇవ్వాలని అంటూ ఇటువంటి అంశాల్లో మేయర్లు చొరవ తీసుకోవాలని ప్రధాని చెప్పారు.  రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 118 మంది మేయర్‌లు, డిప్యూటీ మేయర్‌లు బీజేపీ పాలిత పట్టణ స్థానిక సంస్థల నుంచి పాల్గొంటున్నారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.