పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రైవేటు రంగానికి భాగస్వామ్యం

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేసే విధంగా ‘జాతీయ పర్యాటక విధానం’రూపొందిస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
 
 హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరుగుతున్న రాష్ట్ర పర్యాటక మంత్రుల సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘వికాస్ – విరాసత్’ నినాదంతో దేశంలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ పర్యాటకులతో పాటు దేశీయంగానూ పర్యాటకులను ఆకర్షించడం లక్ష్యంగా పర్యాటక రంగానికి సంబంధించిన అనేకాంశాలపై మూడ్రోజుల పాటు చర్చించనున్నట్లు చెప్పారు.
 
ఉత్తరాదిన జమ్ము-కాశ్మీర్‌లో ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో స్థానికంగా నెలకొన్న సాయుధ తిరుగుబాటు వంటి అంశాల కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి కుంటుపడిందని, కానీ 2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మిగతా ప్రపంచానికి అనుసంధానం చేసే విమాన, రైలు, రోడ్డు సదుపాయాలతో పాటు అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టినట్టు కిషన్ రెడ్డి గుర్తుచేశారు.ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పే దిశగా అనేక తిరుగుబాటు గ్రూపులతో చర్చలు జరిపడం, జమ్ము-కాశ్మీర్‌లో అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు వంటి చర్యలతో ఈ రాష్ట్రాల్లో పర్యాటకం ఊపందుకుంటోందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము – కాశ్మీర్ రాష్ట్రాల్లో పర్యాటక రంగాన్ని రానున్న 40 ఏళ్ల పాటు పునరుద్ధరించేలా ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించారు.

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో మెరుగైన ప్రయాణ, రవాణా సదుపాయాలు అత్యంత కీలకమని చెబుతూ ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లుగా విశేష ప్రగతి సాధించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2014 నాటికి దేశంలో మొత్తం 74 విమానాశ్రయాలుండగా, ఎనిమిదేళ్లలో ఆ సంఖ్య రెట్టింపైందని, 2025 నాటికి ఈ సంఖ్య 220కి చేరుతుందని వెల్లడించారు.

 జాతీయ రహదారులు గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా దేశంలో నిర్మాణం జరుపుకుంటున్నాయని చెప్పారు. కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎమర్జెన్సీ క్రెడిల్ లైన్ స్కీం ద్వారా పర్యాటక రంగం కూడా ప్రయోజనం పొందవచ్చని చెప్పారు.

దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే క్రమంలో టూరిజం సర్క్యూట్లను ఏర్పాట్లు చేశామని, ఆ క్రమంలో శ్రీరాముడు నడయాడిన ప్రదేశాలను కలుపుతూ రామాయణ్ సర్క్యూట్, గౌతమ బుద్ధుడు నడయానికి ప్రదేశాలను కలుపుతూ బుద్ధిస్ట్ సర్క్యూట్, హిమాలయ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ హిమాలయన్ సర్క్యూట్, డా. బీఆర్ అంబేద్కర్‌కు సంబంధించిన ప్రదేశాలను కలుపుతూ పంచ్ తీర్థ్ సర్క్యూట్ వంటివాటి గురించి వివరించారు.

విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే క్రమంలో ఆయా దేశాల్లో నివాసించే భారతీయులు, భారత సంతతి ప్రజలు చొరవ చూపాలని కోరారు. ప్రతి ఎన్ఆర్ఐ కనీసం 5 కుటుంబాలను భారతదేశాన్ని సందర్శించేందుకు తీసుకురావాలన్న ప్రధాని పిలుపును ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అలాగే దేశీయంగా ప్రతి ఒక్కరూ కనీసం 15 పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అలాగే దేశంలో పర్యటకాభివృద్ధికి, పర్యాటక ప్రాంతాల గురించి ప్రచారం చేయడం గురించి సదస్సుల్లో చర్చించనున్నట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఎకో టూరిజం, గ్రీన్ టూరిజం, మెడికల్ టూరిజం, వైల్డ్ లైఫ్ టూరిజం, స్పిరిచ్యువల్ టూరిజం వంటి వివిధ రకాల పర్యాటకాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశాలపై కూడా మంత్రుల సదస్సులో చర్చించనున్నట్టు తెలిపారు. విదేశీ టూరిస్టులను భారతదేశానికి ఆకట్టుకునేందుకు సైతం కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందించింది.

160 దేశాలకు 5 లక్షల వీసాలను భారత్ మంజూరు చేసింది. 20 దేశాల్లో రాయబార కార్యాలయాల్లో పర్యాటక విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.
జీ-20 దేశాల సమావేశాల్లో సైతం జీడీపీ పెంపు అంశంతో పాటు పర్యాటక రంగ అభివృద్ధిపై కూడా ప్రణాళికలు రూపొందించింది. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో పలు అంశాలపై 250 సదస్సులను కేంద్రం రూపొందించింది. రాబోయే ఏడాది కాలంలో 250 సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసింది.