40 శాతం కమీషన్‌ అంటూ తెలంగాణాలో బ్యానర్… బొమ్మై ఆగ్రహం

కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టులపై 40 శాతం కమీషన్‌ తీసుకుంటోందని ఆరోపిస్తూ తెలంగాణలో బ్యానరు ఏర్పాటు చేయడాన్ని కుట్రగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అభివర్ణించారు.  తెలంగాణలో సాగుతున్న అవినీతిపై కర్ణాటకలో హోర్డింగ్‌లు పెడితే తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవం కార్యక్రమంకు హాజరు కాగలరని ఉద్దేశ్యంతో “40 శాతం కమీషన్ ముఖ్యమంత్రికి స్వాగతం” అంటూ హైదరాబాద్ లో అధికార పక్షంకు చెందిన వారు బ్యానర్లు పెట్టడం గురించి తెలుసుకొని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.  తెలంగాణలో హోర్డింగ్‌ ఏర్పాటు చేశారనే విషయమే తనకు తెలియదని చెబుతూ ఇటువంటి చర్యలు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను దెబ్బ తీస్తాయని బొమ్మై హెచ్చరించారు.
 
“నేను అక్కడ లేనందున వాటి గురించి (తెలంగాణలో 40% కమీషన్‌కు వ్యతిరేకంగా బిల్‌బోర్డ్‌లు) నాకు తెలియదు, కానీ అది నిజమైతే, అది క్రమబద్ధమైన కుట్”ర అని బొమ్మై విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.   కర్నాటకలో కూడా తెలంగాణలోని అవినీతి గురించి ఇలాంటి బోర్డులు పెడితే ఎంతవరకు సముచితమని బొమ్మై  ప్రశ్నించారు.
 
“ఇది ప్రైవేట్ బోర్డు లేదా ప్రభుత్వ బోర్డు అని నాకు తెలియదు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో అలాంటి బోర్డులు పెట్టడానికి అనుమతించకూడదు. ఇది రాష్ట్రాల మధ్య సంబంధాలను చెడగొడుతుంది” అంటూ పరోక్షంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన హెచ్చరించారు.
 
ఇట్లా ఉండగా, కొంత కాలంగా బిజెపి ప్రభుత్వం ప్రతి పనికి 40 శాతం కమీషన్ చెల్లించామని తమపై వత్తిడి చేస్తున్నట్లు రాష్ట్ర కాంట్రాక్టర సంఘం ఆరోపిస్తున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 శాతం మాత్రమే చెల్లించే వారిని చెబుతున్నారు.  అయితే ఆ విధంగా తమ ప్రభుత్వం ముడుపులు వసూళ్లు చేస్తున్నది అనడం నిరాధారమని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్ గత నెలలోనే తీవ్రంగా ఖండించారు.
 
విపక్ష నేతలతో సమావేశమైన తర్వాత రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం ఆరోపణలు చేసిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఏదైనా నిర్దిష్ట ఆధారాలు ఉంటే లోకాయుక్తకు ఫిర్యాదు ఇవ్వాలని అసోసియేషన్‌కు ఆయన సలహా ఇచ్చారు.  “మొదట, డి కెంపన్న నేతృత్వంలోని సంఘం కాంట్రాక్టర్ల సంఘం మాత్రమే కాదు. అలాంటి అనేక ఇతర సంఘాలలో ఇది ఒకటి. రెండవది, అతని ఆరోపణలలో అర్థం లేదు. అతను సిద్దరామయ్య వంటి ప్రతిపక్ష నాయకులతో సమావేశం తర్వాత ఆ విధంగా మాట్లాడటం  గమనించాలి” అని బొమ్మై తెలిపారు.
 
గతసారి సంఘం ఆరోపణలు లేవనెత్తడంతో ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్ స్క్రూటినీ కమిటీని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. “వారికి ఏదైనా నిర్దిష్ట ఫిర్యాదు ఉంటే, వారు లోకాయుక్త ముందు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. లోకాయుక్తకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అది దర్యాప్తు చేస్తుంది.  దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని ఆయన భరోసా ఇచ్చారు.