నిజాం నిరంకుశ పాలనలో బానిసత్వంలో ప్రజలు

హైదరాబాద్‌ సంస్థానంలో దారుణాలు, విమోచనం- 1

అందేం రాంరెడ్డి, 

బిజెపి రాష్ట్ర మీడియా కమిటీ సహకన్వీనర్‌


17 సెప్టెంబర్‌ 1948  తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. తెలంగాణ ప్రజల పోరాటం, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చొరవతో యావత్‌
తెలంగాణవాసులు నిజాం నియంతృత్వం, రజాకార్ల అరాచకాల నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చిన సుదినం.

నాటి అమరవీరుల పోరాటాలను, త్యాగధనులను స్మరించుకుంటూ సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాలను (మహారాష్ట్ర,
కర్నాటకలో నిర్వహిస్తున్నారు) అధికారికంగా జరుపుకోవాల్సి ఉన్నప్పటికీ సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మనం ఆ భాగ్యానికి నోచుకోకపోవడం దురదృష్టకరం.

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి ఎన్నో పోరాటాలు, మరెన్నో ఉద్యమాలు చేసింది.. ఇంకా చేస్తూనే ఉంది.

సున్నీ అయిన ఔరంగజేబుకు షియాలైన గోల్కొండ సుల్తానులు అంటే మంట. తన సహజ పద్దతుల్లో కుట్ర చేసి గోల్కొండ మంత్రి అక్కన్నను, సేనాని మాదన్నను చంపించి బలహీనుడైన అబుల్‌ హనస్‌ కుతుబాషాను జయించి 1687లో ఔరంగజేబు గోల్కొండ కోటను ఆక్రమించాడు.

1707లో ఔరంగజేబు మరణానంతరం బహదూర్‌ షా జాఫర్‌`1, ఆ తర్వాత జహంధర్‌ షా, తర్వాత ఫరూక్కుస్సియార్‌ దిల్లీ సింహాసనాన్ని అధిష్టించారు. ఫరూక్కుస్సియార్‌ చింక్లిజ్‌ఖాన్‌కు నిజాం ఉల్‌ ముల్క్‌ బిరుదినిచ్చి దక్కన్‌కు రాజప్రతినిధిని చేశాడు. ఫకర్‌కేడా విజయం తర్వాత నిజాం ఉల్‌ ముల్క్‌ ఔరంగాబాద్‌ నుంచి రాజధానిని హైదరాబాద్‌కు మార్చాడు.

అక్కడి నుంచి వరుసగా నిజాం అలీ ఖాన్‌ (1762`1803), సికిందర్‌ జా (1803`29) నాసిరుద్దౌలా (1829`57), అబ్దుల్‌ ఉద్దౌలా (1857`69), మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ (1869`1911) హైదరాబాద్‌ సంస్థానాన్ని పరిపాలించారు. 1911లో చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అధికారం చేపట్టి 17 సెప్టెంబర్‌ 1948 వరకు పరిపాలన కొనసాగించాడు.

వరుస క్షామాలతో హైదరాబాద్‌ సంస్థాన ప్రజల జీవితం నరకప్రాయంగా మారింది. వేరు వేరు క్షామాలలో  ఒక రొట్టెకు ఒక మనిషిని, పడికెడు గింజలకు తల్లితండ్రులను అమ్ముకోవడం, కుక్క మాంసాన్ని మేక మాంసం అని అమ్మడం, మనుషులను మనుషులే తినడం ఇలాంటి ఘోర కృత్యాలు ఎన్నో దశాబ్దాలలో జరిగాయి.

1769-93లో వచ్చిన ఘోర క్షామంలో ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే 90వేల మంది చనిపోయారు. సంస్థానం అంతా చనిపోయినవారి పుర్రెలతో నిండిపోయింది. 1854లో వచ్చిన క్షామంలో హైదరాబాద్‌ నగర వీధులన్నీ పీనుగలతో నిండిపోయాయి. ఈ ఘోర కరవుల ఫలితంగా జనాలు అప్పుల పాలయ్యారు.

అప్పులతో పీల్చి పిప్పి చేసిన అరబ్బులు, రోహిలాలు

అరబ్బులు, రోహిలాలు హైదరాబాద్‌ సంస్థానంలో 250 సంవత్సరాల పాటు జనులకు అప్పులిచ్చి ప్రపంచంలో కనీవినీ ఎరుగని వడ్డీ వసూలు చేసి పీల్చిపిప్పి చేశారు. పఠానులు, అరబ్బులు జాగీర్దార్లకు అప్పులిచ్చి 80 లక్షల ఆదాయం గల జాగీరులను తమ వశంలోకి తెచ్చుకున్నారు. జనులు తమ పిల్లలను అమ్ముకొన్నారు. ఈ పిల్లల అమ్మకం వ్యాపారాన్ని 1856లో నిషేధించారు.

తెలంగాణలో భూములన్నీ గుత్తకిచ్చేవారు. గుత్తేదారులు రైతుల వద్ద ధాన్యభాగం తీసుకొని సర్కార్‌కు పన్ను రూపాయిల్లో చెల్లించేవారు. భూములకు నిర్దిష్టమైన పన్ను లేకపోయింది.  దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు పన్నులు వసూలు చేసే ఇతర అధికారులు వసూలు చేసిన పన్నులలో భూమి పన్నే కాక, మగ్గం పన్ను, గడప పన్ను, కలాలి, దన్గర్‌పట్టి, దేడ్‌పట్టి, కులాల పన్ను, పెండ్లి పన్ను, తోళ్ల పన్ను, కూరగాయల పన్ను, పీనుగుల పట్టి, తోక పన్ను, ఆదంపట్టి (హిందూ పారిశ్రామికులపై పన్ను) మొదలగు 27 రకాల పన్నులతో ప్రజలను దోచుకునేవారు.

ఇంకొకవైపున వెట్టి (నిర్బంధ చాకిరీ) విధానం ఒకటి తెలంగాణ అంతటా అమలులో ఉండేది. ప్రతి హరిజన కుటుంబం నుండి వెట్టి చాకిరీ చేసేందుకు ఒక వ్యక్తిని కేటాయించాల్సి ఉండేది. చిన్న పల్లెల్లో అయితే ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి పంపేవారు.

 హింస ద్వారా ముస్లిం మాత వ్యాప్తి 

విధిగా పటేల్‌, పట్వారీ, మాలీ పటేల్‌, దేశ్‌ముఖ్‌ల ఇండ్లల్లో ఇంటి పనులు చేసేందుకు, పోలీస్‌ స్టేషన్లకు, తాలూకా ఆఫీసులకు రిపోర్టులు మోసేందుకు, గ్రామచావిడికి బంజరు దొడ్డికి కాపలా కాసేందుకు వెట్టి చాకిరీ చేసేవాళ్లను ఈ పనులకు బానిసలుగా వాడుకునేవారు. బోయలు, బెస్తలు, చాకలి వాళ్లు భూస్వాముల కుటుంబ సభ్యులను పల్లకీల్లోను,  మేనాల్లోను ఎక్కించుకొని తమ భుజాలపై మోసేవారు.

ఈ శోషణ భరించలేక హిందువులు ఇస్లాం మతం స్వీకరించడం మొదలుపెట్టారు. నిరంకుశ నిజాం ప్రభుత్వం తమ తాబేదారుల ద్వారా బడుగు, బలహీన వర్గాల ప్రజలను పై విధంగా హింసించి ఇస్లాం మత వ్యాప్తికి ప్రోత్సహించేవారు.  పైగా అనల్‌ మాలిక్‌ (ముస్లింలే పాలకులు) సిద్ధాంతం ద్వారా ప్రజలకు ముస్లింలే పాలకులు అని బోధించేవారు.

ఇస్లాం మతం స్వీకరించిన వారికి ఈ బానిసత్వం నుంచి విముక్తి కలిగేది. కడవెండిలో హరిజనులు వెట్టి చేయలేక ఇస్లాం (కొత్త తురకలు ` తబ్లిక్‌) మతం స్వీకరించారు. నిజాం తర్వాత పెద్ద జాగీర్‌దారైన నవాబు బహదూర్‌ యార్‌జంగ్‌ ప్రభుత్వం అండతో హిందువులను ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారిని హింసలకు గురి చేస్తూ ఇస్లాం మత వ్యాప్తికి కృషి చేశారు. హరిజనులే కాకుండా అమరవీరుడైన దొడ్డి కొమరయ్య తోబుట్టువు దొడ్డి మల్లయ్య కూడా ఇస్లాం మతం స్వీకరించి ఖాదర్‌ అలీ అని పేరు పెట్టుకున్నారు.

హిందూ స్త్రీలను ఎత్తుకెళ్లి, చెరబట్టి మతం మార్చడం మరో ఎత్తుగడ.అలా మతం మార్చబడిన హరిజన యువతిని కాపాడినందుకే భాయి శ్యాంలాల్‌ను హత్య చేశారు. హైదరాబాద్‌ సంస్థానంలో హిందువుల జనాభా 1881 నుండి 1911 వరకు (ముప్పై సంవత్సరాల లోపే) 91 శాతం నుంచి 86 శాతానికి తగ్గింది. మహ్మదీయుల సంఖ్య, క్రైస్తవుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది.  హైదరాబాద్‌ సంస్థానంలో ఎక్కడా శాంతి భద్రతలు అన్న మాటే లేదు. ప్రజల ధన మానాలన్న పూచీ లేదు. అంతా  అరాచకమే. దౌర్జన్యవాదం, మత్స్యన్యాయమే.

శుద్ధి ప్రారంభించిన ఆర్యసమాజ్ 

స్వామి దయానంద సరస్వతి 10 ఏప్రిల్‌ 1875న ఆర్యసమాజ్‌ స్థాపించి శుద్ధిని ప్రారంభించారు. తరువాత స్వామి శ్రద్ధానంద శుద్ధిని ఒక ఉద్యమంలా నిర్వర్తించారు. లక్షల సంఖ్యలో స్వామిజీ ముస్లింలను శుద్ధి చేసి హిందువులను చేశారు.  ఇది సహించలేక ఖాజా హసన్‌ నిజామీ అనే ముస్లిం నాయకుడు హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ రషీద్‌తో స్వామి శ్రద్ధానంతను 23 డిసెంబర్‌ 1926న దిల్లీలో హత్య చేయించారు. అనగా హిందూ వ్యతిరేక ఉన్మాద హింసా కార్యక్రమాలకు హైదరాబాద్‌ దేశం మొత్తానికి అడ్డాగా బహిర్గతమైంది.

1892లో హైదరాబాద్‌లో ఆర్యసమాజ్‌ శాఖ ప్రారంభమైంది. తర్వాత్తర్వాత ఆర్య సమాజమే నిజాం వ్యతిరేక పోరాటానికి ఒక వేదికగా రూపొందింది. అలాగే లోకమాన్య తిలక్‌ ప్రారంభించిన సార్వజనీక గణేశ్‌ ఉత్సవాల సంప్రదాయం 1895లో హైదరాబాద్‌లో మొదలైంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో, సైన్యంలో 85 శాతం ఉన్న జనాభా ఉన్న హిందువులు 4.7 శాతం మంది ఉంటే 13 శాతం ఉన్న ముస్లింలు
95.3 శాతం మంది ఉండేవారు. (1931 గెజిట్‌)

ఇతర శాఖలలో హిందువులు 18.6 శాతం మంది ఉంటే ముస్లింలు 81.4 శాతం మంది ఉండేవారు. కింది స్థాయి ఉద్యోగాల్లో సైన్యంలో హిందువులు 10.7 శాతం మంది ఉంటే ముస్లింలు 89.3 శాతం మంది ఉన్నారు. ఇతర శాఖలలో హిందువులు 19.7 శాతం ఉంటే ముస్లింలు 80.3 శాతం ఉండేవారు. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందువులు తీవ్ర వివక్షకు గురయ్యారు.

మతోన్మాదానికి కేంద్రం నిజామే

హైదరాబాద్‌ సంస్థానంలో మతోన్మాదానికి కేంద్రం నిజామే. ఆయన నియంత కూడా. చివరి నిజాం (మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌) ప్రధానమంత్రిని ఇష్టం వచ్చినట్టు బర్తరఫ్‌ చేసేవారు. కొంతకాలం ‘‘ఆయనే రాజు, ఆయనే మంత్రి’’. నిజాం సంస్థానంలో నాన్‌ముస్లిం అనేవాడు యాంటీ ముస్లిం. యాంటీ ముస్లిం అనేవాడు యాంటీ స్టేట్‌. ఇవన్నీ సమానార్థకాలయ్యాయి.

బలహీనులు హిందువులే. మొహర్రం నెల నుండి 40 రోజుల వరకు హిందువుల ఇళ్లల్లో సైతం ఏ శుభకార్యం జరపడానికి వీల్లేదు. వేరే రోజుల్లో కూడా హిందువులు ఏ శుభకార్యాన్ని తలపెట్టినా ప్రభుత్వ అనుమతి తప్పనసరి. ఒక అఖాడా (వ్యాయంశాల) ఏర్పాటు
చేసుకోవాలనుకున్నా కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి. సంస్థానంలో హిందూ జాగృతి జరగకుండా ఉండేందుకే ఇదంతా.

ఎలాగైనా హైదరాబాద్‌ను ఇస్లామిస్తాన్‌ చేయాలన్నది నిజాం తాపత్రయం. దాని కోసం అతడు తొక్కని అడ్డదారి లేదు. అందులో దీన్‌దార్‌ ఉద్యమం ఒకటి. 1920లో సిద్ధిఖీ దీన్‌దార్‌ అనేవాడు తాను చెన్నబసవేశ్వరుడి అవతారాన్నని లింగాయత్‌ సంప్రదాయానికి ఆధునిక రూపమే ఇస్లాం అని చెప్పుకొంటూ రాముడిని, కృష్ణుడిని ఘోరంగా అవమానపరుస్తూ జనం అంతా ఇస్లాం స్వీకరించాలని పిలుపునిచ్చేవారు.

వేదాలలో, పురాణాలలో, హదీసులలో, ఖురాన్‌లలో కూడా నిజాం ప్రస్తావన ఉందని ఏడో నిజాం మరెవరో కాదు, పాండవ అగ్రజుడు ధర్మరాజు అని ప్రచారం చేసేవాడు. తెలుగు ప్రాంతాలలో తను కల్కి అవతారంగానే ప్రకటించుకున్నారు. వీరభోగవసంతరాయులు అని చెప్పుకున్నారు. మొదట హుబ్లీ, ధార్వాడ్‌, మైసూర్‌, గుల్బార్గ, రాయ్‌చూర్‌, బీదర్‌ వంటి ప్రాంతాల్లో ప్రచారం చేసుకొని అమాయక లింగాయత్‌లను ఇస్లాంలోకి మార్చారు.

నిజాం ప్రభుత్వంలోని దేవాదాయ శాఖ (ఉమర్‌ మజహబి) ఈ మతం మార్పిడికి నిధులు అందించింది. ఇలా సాగింది సిద్ధిఖి విష ప్రచారం. ఇంత విష ప్రచారం చేసినప్పటికీ నిజాం ప్రభుత్వం దీన్‌దార్‌ సాహిత్యాన్ని నిషేధించలేదు. ఎందుకంటే సిద్దిఖి వెనక ఉన్నది నిజామే
కాబట్టి. హైదరాబాద్‌ నగరంలోని అసిఫ్‌నగర్‌లో దీన్‌దార్‌కు కార్యాలయం ఉండేది.

హైదరాబాద్‌ సంస్థానాన్ని ముస్లింలు తమ బాహుబలంతోటి, సాహసంతోటి స్థాపించారని, హిందువులు ఈ నిజాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని ‘అల్‌ అజ్మ్‌’ అనే ఉర్దూ పత్రిక హెచ్చరించింది. ముస్లింలు పరిపాలకులు కాబట్టి హిందువులు అంతా వారికి లొంగి ఉండాలని బహదూర్‌ యార్‌జంగ్‌ పదేపదే చెప్పేవాడు.

ఈ బహదూర్‌ యార్‌జంగే ‘మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ముసల్మీన్‌’ సంస్థకు మొదటి నాయకుడు. ఈ సంస్థ 1927లో ‘అంజుమన్‌`ఎ`తబ్లిగ్‌`ఎ`ఇస్లాం’
పేరుతో స్థాపించబడి 1929లో ‘మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ముసల్మీన్‌’ సంస్థగా రూపాంతరం చెందింది. ‘ముస్లిం ఎక్తెదార్‌’ (ముస్లిం ఆధిక్యత) అనే నినాదంతో యార్‌జంగ్‌ విషం చిమ్మాడు. ముస్లింలు పుట్టింది హిందువులను పాలించడానికే అంటూ విషం కక్కారు.

ముస్లింల సంఖ్య పెంచడానికి తబ్లిక్‌ ఉద్యమం

ఇబ్బడి ముబ్బడిగా ముస్లింల సంఖ్య పెంచడానికి తబ్లిక్‌ ఉద్యమం ప్రారంభించారు. 1927 ` 44 (16 సంవత్సరాల కాలంలో) 20వేల మంది
హరిజనులను ఇస్లాం మతంలోకి మార్చారు. బహదూర్‌ యార్‌జంగ్‌ సంస్థానంలో ఉన్న ముస్లింలను బ్రిటిష్‌ ఇండియాలోనూ, స్వదేశ సంస్థానాల్లో ఉన్న కోట్లాదిమంది ముస్లింలు నాయకత్వం కోసం మీవైపు చూస్తున్నారని, ముస్లిం రాజ్య స్థాపనలో మీరు వారికి మార్గదర్శకులు కావాలని, ముస్లింల సర్వతోముఖాభివృద్ధికి మీ పైన బాధ్యత ఉందని చెప్తూ సంస్థాన ముస్లింలను మతపరంగా రెచ్చగొట్టాడు.

దీని కారణంగా సంస్థానంలో ఎన్నో మతకలహాలు జరిగాయి. ఇంతేకాకుండా ముస్లింలను దిగుమతి చేసుకొని వారి
సంఖ్యను పెంచే ఎత్తుగడలు ఎన్నో చేశారు. 1948 నాటికి ఇలా హైదరాబాద్‌ సంస్థానంలోకి దిగుమతి అయిన ముస్లింల సంఖ్య 8 లక్షలు ఉంటుందని, అందులో 10,400 మంది నిజాం ఆర్మీలో చేర్చుకోబడ్డారని నాటి ఉపప్రధాని, హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్వయంగా పార్లమెంటులో చెప్పారు.

ఇంకొక అడుగు ముందుకేసి ‘అనల్‌ మాలిక్‌’ అనే నినాదం ఇచ్చారు. ‘నేనే రాజు’ అని ప్రతి ముస్లిం భావించాలని దీని అర్థం. అంతదాకా ఉన్న నిజాంల ఆధిపత్యానికి ఇదొక పెద్దదెబ్బ. నిజాం ఒక్కడే కాదు రాష్ట్రంలోని ముస్లింలందరూ రాజులే అని దీని అర్థం. మొదటి నిజాం అసఫ్‌ జా విరిగిన కత్తి మాత్రమే గోల్కొండ దుర్గాన్ని గెలవలేదు, ఆ కత్తి వెనక 10వేల మంది ముస్లిం సిపాయిలు ఉన్నారు. కాబట్టి హైదరాబాద్‌ రాజ్యం అంతా ముస్లింలదే అన్నారు.

యార్‌జంగ్‌ హైదరాబాద్‌ రాష్ట్ర ముస్లిం లీగ్‌ అధ్యక్షుడు కూడా అయ్యాడు. జాతీయ స్థాయిలోని ముస్లిం లీగ్‌కు రాష్ట్రంలోని మజ్లిస్‌ను అనుబంధం చేశాడు. యార్‌జంగ్‌ను లీడర్‌ను చేసింది నిజామే అయినా రానురాను నిజామే యార్‌జంగ్‌కు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. యార్‌జంగ్‌కు ముస్లింలలో పెరుగుతున్న పలుకుబడిని పరిస్థితి చేయిజారకముందే అదుపు చేయాలని హైదరాబాద్‌ బ్రిటిష్‌ రెసిడెంట్‌ నిజాంను హెచ్చరించాడు.

దీంతో నిజాం జాగ్రత్తపడి 1943లో యార్‌జంగ్‌ ప్రసంగాలపై నిషేధం విధించారు. ఆ తర్వాత 1944లో బహదూర్‌ యార్‌జంగ్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. యార్‌జంగ్‌ అర్థాంతర మరణం మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లీమీన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే ఆ తర్వాత కాలంలో యార్‌జంగ్‌ స్థానాన్ని ఖాసీం రజ్వీ భర్తీ చేశాడు.