ఢిల్లీ మద్యం స్కాంలో కవిత పాత్రపై కోర్టులోనే చెబుతాం.. బీజేపీ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం గురించి అన్ని ఆధారాలను ఢిల్లీ కోర్టుకే సమర్పిస్తామని మాజీ ఎమ్మెల్యే, ఢిల్లీ బీజేపీ నేత మంజీందర్‌సింగ్‌ సిర్సా వెల్లడించారు. ఈ అంశంపై  మాట్లాడడంపై కోర్టు నిషేధం విధించడంతో తాము ఇప్పుడేమి చెప్పలేమని తెలిపారు. 
 
ఎవరెవరు, ఎప్పుడు వచ్చారు? ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి ఎవరు ఎప్పుడు ఎవరిని కలిశారు?  అనే అన్ని ఆధారాలను, వివరాలను కోర్టులోనే చెప్తాం అని  స్పష్టం చేశారు.  గురువారం బీజేపీ జాతీయ కార్యాలయంలో జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తాతో కలిసి సిర్సా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
‘‘ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితతో పాటు హైదరాబాద్‌కు చెందినవారి పేర్లున్నాయని గతంలో చెప్పారు. కానీ, మీరు విడుదల చేసిన స్టింగ్‌ వీడియోలో కవిత గురించి ప్రస్తావన లేదు. ఆమె మీద చేసిన ఆరోపణలపై కోర్టు నోటీసులు జారీ చేసింది. అవి మీకు అందాయా?’’ అని విలేకరులు ప్రశ్నించగా మంజీందర్‌ సింగ్‌ ఈ సమాధానం ఇచ్చారు.
కాగా, ఈ సమావేశంలోనే ఢిల్లీ మద్యం కుంభ కోణానికి సంబంధించిన మరో స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోను బీజేపీ నేతలు విడుదల చేశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో 9వ నిందితుడిగా ఉన్న అమిత్‌ అరోరా ఇందులో పలు విషయాలను ప్రస్తావించాడు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం  మద్యం విధానంలో చిన్న వ్యాపారులను దూరం పెట్టిందని పేర్కొన్నారు.
అరుణ్‌ పిళ్లై, జస్దీ్‌పకౌర్‌ చద్దా, సమీరా మహేంద్ర, అమండల్‌తో పాటు మరికొందరు వ్యక్తులు ఒబెరాయ్‌, లోధి హోటల్‌లో ఢిల్లీ మద్యం విధానాన్ని తయారు చేశారని వెల్లడించాడు. నల్లధనాన్ని బయటకు తేవడం కోసం కొంతమంది పెద్దలు ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టారని చెప్పాడు.
కొంతమందికి లాభం చేకూర్చేందుకుకే దీనిని తయారు చేశారని వివరించాడు. గుజరాత్‌, పంజాబ్‌లో అమ్ముతున్న మద్యం ఢిల్లీ నుంచే సరఫరా అవుతోందని అమిత్‌ అరోరా ఆరోపించాడు. స్టింగ్‌  వీడియో ప్రదర్శన తర్వాత సంబిత్‌ పాత్ర మాట్లాడుతూ కొద్దిమంది వ్యక్తులకు లాభం చేకూర్చేలా మద్యం విధానాన్ని రూపొందించారని స్పష్టం చేశారు.
ఈ విధంగా వచ్చిన డబ్బును ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌, గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిందని ఆయన ఆరోపించారు. కమీషన్ల కోసమే రాజకీయాలనేది ఆప్‌ విధానమని ధ్వజమెత్తారు. మద్యం విధానంలో లబ్ధి పొందినవారు కూడా ఇదే విషయం చెప్పారని పేర్కొన్నారు.
అవినీతిని అంతం చేస్తానని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్‌ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.  స్టింగ్‌ ఆపరేషన్‌లో అన్ని విషయాలు బయట టపడ్డాయని, దీనికి ప్రజలకు క్షమపణ చెప్తారా? పదవికి రాజీనామా చేస్తారా? అనేది కేజ్రీ తేల్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదేశ్‌ గుప్తా మట్లాడుతూ  మద్యం అక్రమ వ్యాపారులకు ఢిల్లీ అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు.
 
కాగా, బీజేపీ నేతలు విడుదల చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌ వీడియోలో నిందితుడు చెప్పినవి వాస్తవాలైతే. సీబీఐ నాలుగు రోజుల్లో (సోమవారం లోగా) తనను అరెస్టు చేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా సవాల్‌ విసిరారు. ఒకవేళ అరెస్టు చేయలేకపోతే,  ఈ వీడియో మరో అబద్ధమని, కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రధాని మోదీ, బీజేపీ కేంద్ర కార్యాలయం చేసిన కుట్రగా ఒప్పుకొన్నట్లేనని పేర్కొన్నారు.