కెనడాలో హిందూ దేవాలయంపై దాడి పట్ల ఆగ్రవేశాలు

కెనడాలో ప్రఖ్యాత స్వామి నారాయణ్ హిందూ దేవాలయాన్ని కెనడా ఖలీస్థాన్ తీవ్రవాదులు అపవిత్రం చేసి ధ్వంసం చేయడం పట్ల ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. టొరంటోలో జరిగిన ఘటనను కెనడాలోని భారత దౌత్య కార్యాలయ వర్గాలు తీవ్రంగా గర్హించాయి. ఈ చర్యకు పాల్పడిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను దౌత్యాధికారులు కోరారు. 
 
 టొరంటోలోని బిఎపిఎస్ స్వామినారాయణ్ మందిర్‌పై ఎప్పుడు దాడి జరిగిందనేది నిర్థిష్టంగా తెలియలేదు. అయితే ఈ ఘటనపై భారత హైకమిషన్ ట్వీటు వెలువరించింది. ఈ అంశంపై స్థానిక ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపింది. ఈ సంఘటన తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా డిమాండ్ చేశారు. 
విద్వేషాన్ని వ్యాపింపజేయడం కోసమే ఇటువంటి దురాగతానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ సంఘటనను భారత హై కమీషన్
కెనడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది, దోషులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మందిరాన్ని అపవిత్రం చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఓ ట్వీట్‌లో తెలిపింది. దోషులపై తగిన చర్య తీసుకోవాలని కెనడా ప్రభుత్వాధికారులను కోరినట్లు తెలిపింది.
ఇదిలావుండగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఈ దేవాలయం గోడలపై రాసిన భారత వ్యతిరేక, ఖలిస్థాన్ అనుకూల నినాదాలు కనిపిస్తున్నాయి.
మరో వైపు కెనడా పార్లమెంట్ సభ్యులు చంద్ర ఆర్య ఈ ఘటన పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టొరంటో ఆలయంలో ఖలీస్థానీయులు జరిపిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఇటీవలి కాలంలో కెనడాలోని హిందూ ఆలయాలపై ఇటువంటి ద్వేషపూరిత చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇది హిందూ సామాజిక వర్గంలో ఆందోళనకు దారితీస్తోందని తెలిపారు.
దీనిపై బ్రంప్టన్ సౌత్ ఎంపీ సోనియా సిద్ధూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ‘‘మనం బహుళ సంస్కృతుల, బహుళ మతాల సమాజంలో జీవిస్తున్నాం. సురక్షితంగా ఉన్నామనే భావన కలిగి ఉండటానికి ప్రతి ఒక్కరూ అర్హులే. బాధ్యులైన వారిని గుర్తించి, వారి చర్యలకు పర్యవసానాలను ఎదుర్కొనేలా చేయాలి’’ అని స్పష్టం చేశారు.
బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థాన్ ఓ ఆధ్యాత్మిక, కార్యకర్తల నిర్వహణతో కూడిన సంస్థ. విశ్వాసం, ఐక్యత, నిస్వార్థ సేవలతో కూడిన హిందూ ఆదర్శాలను పెంపొందింప చేయడం ద్వారా వ్యక్తిగత సమున్నతిని సాధించి సమాజాన్ని మెరుగుపర్చేందుకు యత్నిస్తోందని , ఇక్కడ జరిగిన దాడి సమాజంలపై దాడిగా భావించాల్సి ఉంటుందని ఈ మహిళా ఎంపి తెలిపారు.
 
ఈ నేపథ్యంలో మంజిందర్ సింగ్ సిర్సాఓ వార్తా సంస్థతో  మాట్లాడుతూ,  పాకిస్థాన్ ఈ పనులను నిరంతరం కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి విషయాల్లో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోందని, అయితే  కెనడా మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు.