ఎస్‌సిఒ దేశాల మధ్య మరింత మెరుగైన సహకారం… మోదీ పిలుపు

మెరుగైన సరఫరా ద్వారా దేశాల మధ్య అనుసంధానతను సాధించవచ్చని షాంఘై సహకార సంఘం (ఎస్‌సిఒ) సభ్య దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో 22వ షాంఘై సహకార సదస్సులో శుక్రవారం ప్రధాని  సభ్యదేశాలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రపంచంలో ఈ దేశాల పాత్ర, ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పారు.
కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ సరఫరా గొలుసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయని చెబుతూ దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం సంక్షోభం ఏర్పడిందని తెలిపారు. ఈ సంక్షోభాలను ఎదుర్కొనేందుకు సభ్యదేశాలు అనుసంధానతను సాధించేందుకు మెరుగైన సరఫరా కలిగి ఉండాలని ఆయన సూచించారు.
 
ఎస్‌సీఓ సభ్య దేశాల్లో ప్రపంచ జనాభాలో 40 శాతం నివసిస్తోందని చెబుతూ  ప్రపంచ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)లో 30 శాతం వాటా ఈ దేశాలదేనని ప్రధాని చెప్పారు.  సభ్య దేశాల మధ్య సహకారానికి, పరస్పర విశ్వాసానికి భారత్‌ మద్దతునిస్తుందని హామీ ఇచ్చారు.
ఆహార భద్రతకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయంగా, చౌకగా లభించే చిరుధాన్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు భారత్‌ కృషి చేస్తోందని చెప్పారు. సాంప్రదాయక వైద్యంలో కూడా సభ్య దేశాలు సహకరించాలని కోరారు.
ప్రజాభివృద్ధి కోసం సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న వినియోగంపై దృష్టి సారించామని, ఎస్‌సిఒ దేశాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.5 శాతానికి చేరుకుంటుందని అంచనావేస్తున్నామని ప్రయూ పంచ ఆర్థికవ్యవస్థలలో ప్రధానంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రజల కేంద్రంగా అభివృద్ధి విధానాన్ని అమలు చేయడంపై తాము దృష్టి  పెట్టామని తెలిపారు. ప్రతి రంగంలోనూ సృజనాత్మకత, నవకల్పనలకు మద్దతిస్తున్నామని, సహకరిస్తున్నామని చెప్పారు.  భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చేదిశగా కృషి చేస్తున్నామని, ప్రతిరంగంలో ఆవిష్కరణకు మద్దతు ఇస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  ప్రస్తుతం భారత్‌లో 70వేల కంటే అధిక స్టార్టప్‌లు, 100యునికార్న్‌లు ఉన్నాయని వివరించారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఎస్‌సీఓ సభ్య దేశాల అధినేతలతో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. అంశాలవారీగా, ప్రాంతీయ, జాతీయ సమస్యలపై ఈ చర్చలు జరిగాయి. ప్రాంతీయ శాంతి, భద్రతలు, వ్యాపారం, వాణిజ్యం, అనుసంధానం, సంస్కృతి, పర్యాటక రంగాలపై చర్చలు జరిగాయి.
ఎస్‌సిఒ అధ్యక్ష పదవికై భారత్ కు చైనా మద్దతు 
కాగా, వచ్చే ఏడాది షాంఘై సహకార సంఘం అధ్యక్ష పదవిలో భారత దేశాన్ని నియమించడానికి మద్దతిస్తామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్  చెప్పారు. ఎస్‌సీఓ సదస్సులో శుక్రవారం ప్రధాని మోదీ ప్రసంగించిన అనంతరం జిన్‌పింగ్ తన మద్దతును ప్రకటించారు. 
‘‘వచ్చే ఏడాది ఎస్‌సీఓకు అధ్యక్షత వహిస్తున్నందుకు భారత దేశానికి అభినందనలు. వచ్చే ఏడాది ఎస్‌సీఓ ప్రెసిడెన్సీకోసం భారత దేశానికి మేం మద్దతిస్తాం’’ అని జిన్‌పింగ్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ కూడా భారత దేశానికి అభినందనలు తెలిపారు.
అంతర్జాతీయ వ్యవస్థ మరింత న్యాయంగా, హేతుబద్ధంగా అభివృద్ధి చెందే విధంగా ప్రపంచ నేతలు కలిసికట్టుగా కృషి చేయాలని ఈ సందర్భంగా  జిన్‌పింగ్ సూచించారు. నిష్ప్రయోజనకరమైన పనులను, కూటమి రాజకీయాలను వదిలిపెట్టాలని చెబుతూ ఐక్యరాజ్య సమితిని ఆసరాగా తీసుకుని అంతర్జాతీయ వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొన్నారు.