1991లో తెచ్చిన సంస్కరణలు అసంపూర్ణం… 2014 నుండే మార్పులు 

భారత్ 1991లో తెచ్చిన సంస్కరణలు అసంపూర్ణమైనవని కావడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే ప్రాథమిక వ్యవస్థాగత మార్పులు చేపట్టిందని, తద్వారా పేదలు, బలహీనవర్గాల వారిపై పూర్తి శ్రద్ధ తీసుకోవడం జరిగిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

ముంబైలో బిజెపి ఆధ్వర్యంలో ‘మోడీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ అని గ్రంధం గురించి జరిపిన సభలో ఆమె మాట్లాడుతూ 2014లో మొదలెట్టిన సంస్కరణల ఫలితంగానే నేడు దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆమె పేర్కొన్నారు. ఆమె హిందీలోనే ప్రసంగిస్తూ సోషలిజమ్ అన్నది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారని ఆమె  విమర్శించారు. తద్వారా ఆర్జించే వారిపై లైసెన్స్, రెగ్యులేషన్స్ విధానాలు అమలయ్యాయని చెప్పారు. 

“తప్పనిసరి పరిస్థితిలో 1991లో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. కానీ దానిని సక్రమంగా నెరవేర్చలేదు. తద్వారా చెల్లింపుల సమతూకం సంక్షోభం ఏర్పడింది. దాంతో మనం అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సాయం తీసుకోవలసి వచ్చింది. అప్పుడు వారు సామ్యవాదాన్ని(సోషలిజం) వదులుకునే షరతు పెట్టారు. అలా 1991లో మనం అసంపూర్ణ సంస్కరణలు మొదలెట్టాం” అని ఆమె వివరించారు. 

 “సంస్కరణల మీద శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం సామాన్యుల అవసరాల పట్ల జాగ్రత్త వహించింది” అని ఆర్ధిక మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తనకు తమిళ్, తెలుగులో ఉన్నంత పట్టు హిందీలో తనకు లేదని చెబుతూ తన హిందీ ప్రసంగాన్ని ఔదార్యంతో స్వీకరించాలని నిర్మలా సీతారామన్ కోరారు. 

మేనేజ్‌మెంట్ పాఠ్య పుస్తకంగా ఈ గ్రంధం 

ప్రధాని నరేంద్ర మోదీపై వ్రాసిన ‘మోడీ@20: డ్రీమ్స్ మీట్ డెలివరీ’ అనే ఈ గ్రంధాన్ని  మేనేజ్‌మెంట్ పాఠ్య పుస్తకంగా ఉపయోగించవచ్చని నిర్మలా సీతారామన్ సూచించారు. “భారతదేశం వంటి సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థలో ఆధునిక పాలన ఎలా జరుగుతుందో, అలాగే స్వీయ-నిర్మిత నాయకులు దేశానికి కట్టుబడి ఉన్నందున వారు ఎలా మార్పు తీసుకురాగలరో చెప్పే పుస్తకం ఇది” అని ఆమె తెలిపారు.

ప్రధాని మోదీ నాయకత్వం గురించి ఆమె మాట్లాడుతూ, పేదల కోసం అన్ని పథకాలు చివరి మైలు లబ్దిదారులకు పారదర్శకతతో అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.  “ప్రధానమంత్రి మోదీ  డైనమిక్ నాయకత్వంలో పథకాలు చివరి మైలుకు చేరుకుంటాయని నిర్ధారిస్తుంది” అని సీతారామన్ తెలిపారు. 

“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాంకేతికతను బాగా అర్థం చేసుకున్నారు.  దానిని వ్యవస్థలో ఇనుమడింప చేశారు. అందుకే ప్రత్యక్ష ప్రయోజన వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది” అని ఆమె చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్నది ఒకనాటి జన్‌సంఘ్ డిమాండ్‌గా ఉండేదని, దానిని మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని ఆమె గుర్తు చేశారు.

ఆర్టికల్ 370 అనేది శాశ్వతం ఏమి కాదని నెహ్రూ అన్నదాన్ని రాజకీయ పార్టీలు మరచిపోయాయని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా విషయంలో కూడా ప్రభుత్వం పెట్టుబడి ఉపసంహరణ అనే కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ప్రధాని మోదీకి సంబంధించిన ఈ పుస్తకాన్ని మే ప్రారంభంలో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ప్రధాని మోదీ 2021లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి భారత ప్రధానిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.  మొదట, ఆయన 2001 లో గుజరాత్ ముఖ్యమంత్రి కాగా, 2014 లో భారతదేశానికి ప్రధాన మంత్రి అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగారు. 2019 లో తిరిగి ప్రధానిగా ఎన్నికయ్యారు.

రూపా పబ్లికేషన్స్ ఇండియా ప్రచురించిన ఈ పుస్తకంలో వ్యాసాలు వ్రాసిన వారిలో  ప్రముఖ మేధావులు, రచయితలు నందన్ నీలేకని, సుధా మూర్తి, సద్గురు, పి.వి. సింధు, అమిష్ త్రిపాఠి తదితరులు ఉన్నారు. సమాజంలోని ప్రజల జీవితాలను స్పృశించిన మోదీ పాలనా నమూనా గురించి కూడా పుస్తకం వివరిస్తుంది.