కంటోన్మెంట్ అభివృద్ధి గాలికి వదిలేసిన కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ‘‘కంటోన్మెంట్ ప్రజలు ఏమైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళా? రోడ్లు, డ్రైనేజీ సమస్యలతోపాటు ఆఖరుకు మంచి నీళ్ల లేక అల్లాడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?’’ అని ప్రశ్నించారు.
 
 ‘‘కేంద్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా కంటోన్మెంట్ కు వర్తింపజేయడం లేదు. ఆ సంక్షేమ పథకాలను కంటోన్మెంట్ కు ఇవ్వకూడదని నీకేమైనా రాసిచ్చారా కేసీఆర్?’’అని నిలదీశారు. ఆర్మీ నుంచి కంటోన్మెంట్ కి రావలసిన రూ.700 కోట్ల నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. 
 
“ముందు నువ్వు కంటోన్మెంట్ కి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు’’అని సవాల్ విసిరారు. కంటోన్మెంట్తో తనకేమి సంబంధం అంటున్న కేసీఆర్ కి ప్రజలే బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సంజయ్ కుమార్ మారేడ్ పల్లిలోని డబుల్ బెడ్రూం హౌజింగ్ కాలనీ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 
 కంటోన్మెంట్ ఏరియాలో జాగాలు కబ్జా చేయడానికి లేదు కాబట్టే, కంటోన్మెంట్ ఏరియా కేంద్రానిది… తనది కాదని కేసీఆర్ అంటున్నాడని ధ్వజమెత్తారు.  రోడ్లు, డ్రైనేజీ సహా కనీస సౌకర్యాల్లేక ఇక్కడ జనం అల్లాడుతున్నరని చెబుతూ ఈ ప్రాంతానికి రోజూ 90 లక్షల గ్యాలన్ల మంచి నీళ్లు అవసరమైతే… అందులో సగం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కెసిఆర్ కూతురు ప్రమేయం ఉందన్న వీడియో బయటపడటంతోనే…. కేసీఆర్ అంబేద్కర్ నామస్మరణ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. అందుకే సచివాలయానికి ‘అంబేద్కర్’ పేరు అంటూ రాజకీయాలు చేస్తున్నాడని అంటూ దమ్ముంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు ముఖ్యమంత్రి సీటులో దళితుడిని కూర్చోబెట్టాలని సవాల్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. జీహెచ్ఎంసీ కార్మికులు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డు, పెన్షన్, ఉద్యోగాలు.. ఇలా ఏది కావాలన్నా…. కేసీఆర్ కుటుంబానికి లంచం ఇవ్వాల్సిందే అంటూ ఆరోపణలు గుప్పించారు.  దారుస్సలాం నిర్ణయాలను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్నాడని సంజయ్ ఆరోపించారు. సొంత నిర్ణయాలను అమలు చేసే దమ్ము, ధైర్యం కేసిఆర్ కు లేదని స్పష్టం చేశారు.