రష్యా డ్రోన్‌ను కూల్చేసిన ఉక్రెయిన్.. వెనుతిరిగిన రష్యా సేనలు 

రష్యా డ్రోన్‌ను కూల్చేసిన ఉక్రెయిన్.. వెనుతిరిగిన రష్యా సేనలు 

ఇరాన్ సరఫరా చేసిన సూసైడ్ డ్రోన్‌లను రష్యా తమపై ప్రయోగిస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా ప్రయోగించిన ఇరాన్ డ్రోన్‌ను కూల్చివేశామని తొలిసారి మంగళవారం ఉక్రెయిన్ ప్రకటించింది. యుద్ధరంగంలో ఇరాన్ డ్రోన్‌లను ఉపయోగించడం మాస్కోటెహ్రాన్ మధ్య ఉన్న బంధాన్ని తెలుపుతుందని ఉక్రెయిన్ సైనిక అధికారులు ఆరోపించారు. 

నిఘావర్గాలు జులైలోనే ఈ విషయంపై బహిరంగ ప్రకటన చేశాయి. బాంబులను మోసుకెళ్లే వందలాది డ్రోన్‌లను టెహ్రాన్ రష్యా పంపేందుకు సన్నాహాలు చేస్తోందని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సహాయం చేసేందుకు డ్రోన్‌లను పంపుతుందని నిఘా అధికారులు తెలిపారు. తొలుత ఇరాన్ ఆ ఆరోపణలను తిరస్కరించింది. 

అనంతరం తమ దేశ సైన్యం రివల్యూషనరీ గార్డ్ ఇటీవల రోజుల్లో అగ్ర దేశాలకు దీటుగా తయారైందని టెహ్రాన్ ప్రకటించింది. కాగా ఉక్రెయిన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో ఇరాన్ డ్రోన్ శకలాల ఫొటోలను ప్రచురించారు. త్రికోణపు ఆకారంలో ఉన్న ఈ డ్రోన్‌ను ఇరాన్ షాహెద్‌గా పేర్కొంటుంది.  ఉక్రెయిన్ దళాలు డ్రోన్‌ను కీవ్ మధ్యభాగంలోని కుపియాన్‌స్క్ సమీపంలో అడ్డుకుని కూల్చివేశాయని సైనికాధికారులు ఆర్మీ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. 

ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో చతికిలపడిపోయిన  రష్యా సేనలు క్రమంగా ఉక్రెయిన్‌లో ఆక్రమించిన ప్రాంతాలను ఒక్కొక్కటిగా వీడుతూ వెనుదిరుగుతున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి అపార ఆయుధ సంపత్తితో ఉక్రెయిన్‌ ఎదురుదాడిని తీవ్రం చేసింది. దాంతో.. రష్యా సేనలు వెనుదిరగడం ప్రారంభించాయి.

‘‘ఈ నెల ఆరంభం నుంచి ఇప్పటి వరకు తూర్పు, ఈశాన్యం, దక్షిణ ప్రాంతాల్లోని అనేక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాం. ఇంతకాలం రష్యా అధీనంలో ఉన్న సుమారు 6 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి కైవసం చేసుకున్నాం’’ అని సోమవారం రాత్రి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటన చేశారు. 

మరోవంక, ఉక్రెయిన్‌లోని ఖర్కోవ్‌ ప్రాంతంలో పలు చోట్ల నుండి సైనిక బలగాలు వైదొలగడాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్‌ దాడుల నేపథ్యంలో ఈ పరిణామం సంభవించింది. ”ప్రత్యేక సైనిక చర్య లక్ష్యాలను సాధించడానికి గానూ, బలక్లేయా, ఇజియం ప్రాంతాల్లో బలగాలను తిరిగి సమూహపరచాలని నిర్ణయించాం. డాంటెస్క్‌ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసే క్రమంలో ఇదొక నిర్ణయం.”అని రష్యా సైన్యం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.  ఆ ప్రాంతంలోని బలగాలను గత మూడు రోజులుగా డాంటెస్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ భూభాగంలోకి మోహరిస్తున్నామని రక్షణ శాఖ తెలిపింది. 

డాన్‌బా్‌స (డోనెట్స్క్‌, లుహాన్స్క్‌ రీజియన్లు) ప్రాంతాన్ని స్వతంత్రంగా ప్రకటించి, వేరే దేశాలుగా మార్చాలనే ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టి 2014 నుంచి రష్యా అధీనంలో ఉన్న క్రిమియాను కూడా కోల్పోయే పరిస్థితి నెలకొంది.వారం రోజుల్లో ఉక్రెయిన్‌ను ఆక్రమించొచ్చనే ఉద్దేశంతో యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా నెలలు గడిచినా పైచేయి సాధించలేకపోయింది.