ప్రమాదకర కరోనా కేసులకు యోగా, ఆయుర్వేదం 

ప్రమాదకర కరోనా కేసులకు యోగా, ఆయుర్వేదం 

అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న కరోనా కేసుల చికిత్సకు యోగా, ఆయుర్వేదం ఉపయోగపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆందోళన నుంచి రోగులు విముక్తి పొందడానికి, చికిత్స అనంతరం వేగంగా కోలుకోవడానికి ఇవి దోహదపడతాయని పేర్కొంది. 

ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం, హై రిస్క్ కోవిడ్-19 రోగులు తీవ్రమైన ఆందోళనతో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల వారి పరిస్థితి మరింత దయనీయం అవుతుంది. 

కరోనా చికిత్సతో పాటు యోగా, ఆయుర్వేదాలను కూడా వినియోగించడం వల్ల రోగులు ఆందోళన, చికిత్స అనంతరం వేగంగా  కోలుకునే అవకాశం ఉంది. ఈ అధ్యయన నివేదిక ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ లో  ప్రచురించారు. 

ఈ పరిశోధక బృందంలో పాల్గొన్నవారిలో, డాక్టర్ సుమిత్ర ఏ బెంటూర్ (పశ్చిమ గ్రేటర్ నోయిడాలో ప్రైవేట్ ప్రాక్టీషనర్), డాక్టర్ అల్కా మిశ్రా (హరిద్వార్‌లోని దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయం), డాక్టర్ యోగీశ్ కుమార్ (ఢిల్లీలోని అద్వైత్ క్లినిక్), డాక్టర్ సోనిక ఠక్రాల్ (ఐఐటీ-ఢిల్లీ), సంజీవ్ (ఐఐటీ-ఢిల్లీ, షహీద్ సుఖ్‌దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్, ఢిల్లీ విశ్వవిద్యాలయం), ప్రొఫెసర్ రాహుల్ గార్గ్ (ఐఐటీ-ఢిల్లీ) ఉన్నారు.

ఐఐటీ-ఢిల్లీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పరిశోధనలో భాగంగా ఆయుర్వేద మందులు, యోగాసనాలను రోగులకు సూచించారు. ఈ రోగులంతా హై రిస్క్ కేటగిరీలోనివారే. 60 ఏళ్ళ వయసు పైబడినవారికి/కోవిడ్-19తో బాధపడేవారికి డయాబెటిస్ మెలిటస్, హైపర్‌టెన్షన్, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, కరొనరీ ఆర్టరీ డిసీజ్ సోకితే పరిస్థితి విషమంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. 

ఇటువంటి బహుళ రోగాలు సోకినవారిని ఈ పరిశోధన కోసం ఎంపిక చేశారు. వారికి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా యోగా కార్యక్రమాలను నిర్దేశించారు. అదేవిధంగా ఆయుర్వేద మందులను టెలిమెడిసిన్ ద్వారా నిర్దేశించారు. ప్రాచీన గ్రంథాలు చెప్పినట్లుగా వ్యక్తిగతంగా రోగులకు చికిత్స అందించారు. 

ప్రతి రోగి మెడికల్ హిస్టరీ, లక్షణాలను పరిశీలించి, అందుకు తగిన చికిత్సను అందించారు. నిర్ణీత ప్రామాణిక చికిత్స ప్రణాళికతో చికిత్స చేయడంతో పోల్చితే ఈ పద్ధతిలో ఎక్కువ సత్ఫలితాలు కనిపించాయి. ఆయుర్వేద మందులను ఇవ్వడంతోపాటు ప్రతి రోజూ యోగాసనాలు వేయించారు. ప్రాణాయామం, చిన్న చిన్న ఆసనాలు, జీవన శైలిలో మార్పుల వల్ల ప్రయోజనం కనిపించింది. 

రోగులను రొటీన్ ఫాలోఅప్ చేసిన డాక్టర్ సోనిక ఠక్రాల్ మాట్లాడుతూ, తాము కోలుకోవడానికి ఈ థెరపీ బాగా ఉపయోగపడిందని ఎక్కువ మంది రోగులు చెప్పారని తెలిపారు. తమకుగల ఇతర రోగాల నుంచి కూడా తాము ఉపశమనం పొందుతున్నామని చెప్పినట్లు వివరించారు. 

యోగాను తమ జీవనంలో భాగం చేసుకోవాలని చాలా మంది రోగులు ఈ చికిత్స పూర్తయ్యేనాటికి నిర్ణయించుకున్నారని తెలిపారు. తమకుగల ఇతర రోగాలను నయం చేసుకోవడం కోసం వీరు తమ బృందంలోని ఆయుర్వేద వైద్యులను సంప్రదించారని చెప్పారు.