స్వామి వివేకానంద విశ్వసించినట్లుగా భారత్ విశ్వగురువు కాబోతోందని, ఆ దిశగా అడుగులు పడటం ప్రారంభమైందని తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో అంతర్భాగమైన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 23వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఆధ్యాత్మికత, సిద్ధాంతాలు, విలువలు, సౌమ్యత, ప్రేమలకు నిలయమైన భారత్‌ను స్వామి వివేకానంద ప్రపంచానికి పరిచయం చేశారని గుర్తు చేశారు.
వందేళ్ల క్రితమే స్వామి వివేకానంద సోదరత్వం, ఐకమత్యాన్ని ప్రపంచానికి నేర్పారని గవర్నర్ తెలిపారు. ప్రపంచాన్ని భారత్ మాత్రమే ఏకం చేయగలదని నమ్మిన స్వామి వివేకానంద అది నాడే చేసి చూపారని, నేడు కొందరు తాము భారత్‌ను ఐక్యం చేస్తున్నామని చెప్పుకుంటున్నారని తమిళసై తెలిపారు.
చిన్నప్పుడు తన తండ్రి బహుకరించిన స్వామి వివేకానంద పుస్తకం చదివి తాను స్ఫూర్తి పొందానని పేర్కొంటూ స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఘటనను గవర్నర్ వివరించారు. వారణాసిలో స్వామి వివేకానందను ఓ జంతువు వెంటాడగా తొలుత పరుగుతీసిన ఆయన తర్వాత ధైర్యంగా వెనక్కు తిరిగారని, దాంతో ఆ జంతువు తోకముడిచిందని గవర్నర్ చెప్పారు.
ఆత్మవిశ్వాసాన్ని నింపే స్వామి వివేకానంద సాహిత్యం చదివితే ఆత్మహత్యలే ఉండవని తెలంగాణ గవర్నర్ డా. . బలహీనులమని అనుకోవడం నేరమని, స్వామి వివేకానంద ఇదే చెప్పారని గవర్నర్ తెలిపారు. సమస్యలకు, కష్టాలను చూసి భయపడవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలనే విషయాన్ని వివేకానంద జీవితం నుంచి నేర్చుకోవాలని తమిళిసై సూచించారు.
విదేశాలకు వెళ్లక ముందు భారత్‌ను ప్రేమించేవాడినని, విదేశాల నుంచి తిరిగి వచ్చాక భారత్‌ను ఆరాధిస్తున్నానంటూ స్వామి వివేకానంద చెప్పిన మాటలను గవర్నర్ గుర్తు చేశారు. స్వామి వివేకానంద సాహిత్యంలో తనకు ఎంగ్ ఇండియా అరైజ్ అనే పుస్తకం బాగా నచ్చిందని ఆమె పేర్కొన్నారు. యువతరం సమస్యలకు ఈ పుస్తకంలో ఎన్నో సమాధానాలున్నాయని ఆమె తెలిపారు.
సత్యం ఒక్కటే అని, అయితే దాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలున్నాయని స్వామి వివేకానంద చాటి చెప్పారని కార్యక్రమానికి వక్తగా హాజరైన లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డా. జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. దేశభక్తి అంటే పక్కవాళ్లను తూలనాడటం కాదని చెప్పారు. ఆత్మన్యూనత ఉన్న భారత సమాజానికి స్వామి వివేకానంద ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్నిచ్చారని తెలిపారు.
భారతీయులంతా ఒక్కటే అనే జాతీయతకు స్వామి వివేకానంద పునాదులు వేశారని జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. రామకృష్ణ మఠం భారతీయ సంప్రదాయంలో ఒక అసాధారణమైనదని ఆయన కొనియాడారు.
హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మాట్లాడుతూ వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా గడచిన 23 ఏళ్లలో 20 లక్షల మందికిపైగా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దామని తెలిపారు. దేశభక్తిని, సేవను ఆచరణాత్మకంగా చూపుతున్న హైదరాబాద్ రామకృష్ణ మఠం కార్యక్రమాల్లో వాలంటీర్లుగా పాల్గొనాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ మఠం పూర్వ అధ్యక్షులు స్వామి రంగనాథానంద జీవితంపై రచించిన మై లైఫ్ ఈజ్ మై వర్క్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
More Stories
అమెరికన్లకు ఇక స్వర్ణయుగమే
తెలుగు వారి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు
ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం