వెయ్యి రోజులకు చేరిన చారిత్రాత్మక అమరావతి ఉద్యమం

మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని అమరావతి రైతులు చేపట్టిన చారిత్రాత్మక ఉద్యమం సోమవారం నాటికి వెయ్యి రోజులకు చేరింది. ఈ నేపథ్యంలో రెండో విడత పాదయాత్రకు రైతులు నేటి నుంచి సన్నద్ధమయ్యారు. రాజధానిలోని వెంకటపాలెం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి ఈ పాదయాత్ర తలపెట్టారు. 
 
గత ఏడాది నవంబరు ఒకటి నుంచి డిసెంబరు 15 వరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించారు. మూడు రాజధానుల ఏర్పాటు, సిఆర్‌డిఎ రద్దుకు వ్యతిరేకంగా దాదాపు రెండున్నర ఏళ్ల పాటు రైతులు న్యాయపోరాటం చేశారు. 
 
రైతుల పిటిషన్లపై విచారణ చేసిన హైకోర్టు ఈ ఏడాది మార్చి మూడున సిఆర్‌డిఎ చట్టం రద్దు చేయాలనే నిర్ణయం చెల్లదని హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఉన్న రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యం కాదని ప్రభుత్వం ఇటీవల హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. 
 
ఇందుకు రూ.2 లక్షల కోట్ల వరకు ఖర్చవుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. తీర్పు అమలు చేయడం లేదని రైతులు కోర్టు ధిక్కారం కింద మళ్లీ కేసులు దాఖలు చేశారు. దీంతో సిఆర్‌డిఎ ద్వారా ప్రభుత్వం కొన్ని పనులు చేసింది. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడి మూడు రాజధానుల ప్రకటనతో రైతులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 
 
వేయి రోజులుగా పట్టుదలతో ఆ ప్రాంత రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నా వారి ఉద్యమంపై ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు ముప్పేట దాడులు జరపడమే గాని కనీసం వారితో చర్చలకు కూడా సుముఖత వ్యక్తం చేయక  పోవడం విస్మయం కలిగిస్తున్నది. పైగా, ఉద్యమిస్తున్న రైతులపై ఎన్నెన్నో అభాండాలు వేయడం, పలు పర్యాయాలు పోలీసులను ప్రయోగించడం, పలు అణచివేత చర్యలకు పాల్పడటం చేశారు. 
 
రైతులపై ఎన్నో సార్లు లాఠీ చార్జీలు చేశారు. వందల కొద్దీ కేసులు పెట్టారు. దళితులపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. మరోవంక,  అమరావతి వద్దు అంటూ పోటీ ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. ఇన్ని అవమానాలు, అణచివేతలను సహిస్తూ, భరిస్తూ  అమరావతి రైతులు ఎంతో సంయమనంతో ఉద్యమాన్ని కొనసాగిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా అమరావతి ప్రాంతంలో వందల మంది అన్నదాతలు అశువులుబాశారు. అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 214 మంది మరణించారు. ఈ మూడేళ్లలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 82 మంది చనిపోగా, 42 మంది రైతు కూలీలు ఉన్నారు. వీరితోపాటు కౌలుదారులు, అనుబంధ వృత్తులవారూ అనేకమంది బలైపోయారు. రాజధాని కేవలం ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమన్న ప్రభుత్వ వాదన సరికాదని రైతుల మరణాలు స్పష్టం చేస్తున్నాయి.
టిడిపి ప్రభుత్వ హయాంలో ప్రపంచంలో మరెక్కడా ఎరుగని విధంగా 33,700 ఎకరాల భూమిని భూ సమీకరణ ద్వారా రైతులు సిఆర్‌డిఎకు స్వచ్ఛందంగా ఇచ్చారు. అందుకు ప్రతిగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని సిఆర్‌డిఎ చట్టంలో పేర్కొన్నారు. టిడిపి హయాంలో ఈ రైతులకు ప్లాట్లు ఇచ్చినా, వాటిని అభివృద్ధి చేయలేదు. 
 
2019 మే 30న అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం రాజధాని అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. పైగా, ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన 29 గ్రామాల్లో కలకలం రేపింది. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు కల్పించినా, ఉద్యమంపై ఎన్ని వ్యాఖ్యలు చేసినా రైతులు వెనక్కి తగ్గలేదు. 
 
ఉద్యమం కేవలం 29 గ్రామాలకే పరిమితమైందని, రాష్ట్రంలో ఎక్కడా వీరికి స్పందన లేదని పలువురు మంత్రులు, వైసిపి నాయకులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గత ఏడాది నవంబరు ఒకటి నుంచి డిసెంబరు 15 వరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహించారు. 
 
కరోనా నేపథ్యంలో సుదీర్ఘ విరామం తరువాత గత నవంబరులో హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. గతేడాది నవంబరు 22న సిఎం జగన్‌ అసెంబ్లీలో మూడు రాజధానులు, సిఆర్‌డిఎ చట్టం బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. అడ్వకేట్‌ జనరల్‌ ఈ అంశాన్ని హైకోర్టుకు తెలిపారు. 
 
అయితే, మళ్లీ న్యాయనిపుణుల సలహాతో మెరుగైన పద్ధతిలో మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని ప్రభుత్వం ఆ తర్వాత చేసిన ప్రకటన రైతుల్లో మరింత ఆగ్రహాన్ని కలిగించింది. వైసిపి మినహా మిగతా అన్ని పార్టీలూ రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు. 
 
కాగా, అమరావతి రాజధాని విషయంలో తమ ప్రమేయం లేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వ అంశమని హైకోర్టులో మూడు దఫాలుగా కేంద్ర హోం శాఖ అఫిడవిట్‌ లో స్పష్టం చేసింది. అయితే, రాజధాని రైతులకు మాత్రం బిజెపి మద్దతు ప్రకటించింది. హైకోర్టు తీర్పు అమలుకు రాజధాని రైతులు పోరాడుతూనే బిల్ట్‌ అమరావతి, సేవ్‌ అమరావతి పేరుతో ఉద్యమం కొనసాగిస్తున్నారు.