కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టడానికే మళ్లీ రాజీనామా ఉద్యమం

తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడానికి ఆనాడు రాజీనామా ఉద్యమాన్నిఏవిధంగా రగిలించామో, ఇప్పుడు కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టడానికి మళ్లీ రాజీనామా ఉద్యమానికి శ్రీకారం చుట్టామని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్యెల్యే ఈటల రాజేందర్ వెల్లడించారు.  మునుగోడులో ఆదివారం బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ  సీఎం కేసీఆర్ ని వచ్చే ఎన్నికలలో ఓడగొట్టడమే తమ ధ్యేయం అని స్పష్టం చేశారు.
 రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం పోయేది ఉంటే ఆనాడు కాంగ్రెస్ నుంచి 12 మంది పోయినప్పుడే పొయ్యేవాడని పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ ది దింపుడుకళ్లెం కాడి ఆశలాగా ఉందని తెలిపారు. “భారతదేశంలో జాతీయ పార్టీ పెడతానని అనుకుంటున్నావ్..  యూపీ, బీహార్ కి పొయ్యి సత్తా ఉందా కేసీఆర్” అంటూ ఈటెల ప్రశ్నించారు.
ఇతర దేశాల్లో ఉన్న భారతీయులంతా మునుగోడు ప్రజల వైపే ఉన్నారని అంటూ ఆరు నూరైనా మునుగోడు ఎన్నికలలో బిజెపి గెలవడం ఖాయమని  రాజేందర్ స్పష్టం చేశారు.   రాజగోపాల్ రెడ్డి రాజీనామా యాదృచ్చికంగా చేయలేదని.. బీజేపీ పార్టీ ఎక్కడ ఉంది అన్న వాళ్లకు ఈ నల్లగొండ ప్రజలు త్వరలో చూపిస్తారని ఈటల  ధీమా వ్యక్తం చేశారు. 
 
ఏ ఆశయం కోసం తెలంగాణ రాష్టాన్ని సాధించుకున్నామో  అదంతా 8 సంవత్సరాల్లో కనుమరుగైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణలో బాగుపడ్డది ఒక కేసీఆర్ కుటుంబమేనని పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని కేసీఆర్ చెప్పిండు.. కానీ జనం గుద్దుడు గుద్దితే కేసీఆర్ దిమ్మ తిరిగిందని గుర్తు చేశారు.
 
. వెయ్యి మందికి పైగా ఆత్మ బలిదానం చేసుకుంటే రాష్ట్రం వచ్చిందే తప్ప.. కేసీఆర్ వల్ల కాదని .. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.సిద్ధిపేట, సిరిసిల్లా, మెదక్ జిల్లాలను మాత్రమే కేసీఆర్ పట్టించుకుంటున్నారని.. ప్రగతి భవన్, ఫాం హౌజ్ కు వెళ్లే రోడ్లతో పోల్చితే మునుగోడు రోడ్లు ఎలా ఉన్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏనాడు కనపడని వ్యక్తులు ఈరోజు అధికారాన్ని వెలగబెడుతున్నారని అన్నారు.
 
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఫైనల్ గా బీజేపీదే విజయమని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు.
 
 ‘‘అమిత్ షా సభ తర్వాత కేసీఆర్ కు గుబులు పుట్టింది.. 2 లక్షల మందికి జనం వచ్చారు.. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని డిసైడ్ అయిపోయారు.. కేసీఆర్ పచ్చి అబద్దాల కోరు.. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది… కరోనా సమయంలో సొంత డబ్బులతో పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సీఎం కేసీఆర్ స్కాములు చేసి సొంత ఆస్తులు పెంచుకుండు’’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. 
 
కేసీఆర్ హైదరాబాదులో 20 వేల ఎకరాలు, కాళేశ్వరం మీద రూ. 60 వేల కోట్లు.. మిషన్ భగీరథ మీద రూ. 30 వేల కోట్లు దోచుకున్నాడని ఆయన ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనేది ఒక త్యాగం, ఈ రాజీనామా మునుగుడు ప్రజలకు లాభం మాత్రమే రాజగోపాల్ రెడ్డికి కాదని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.
 మునుగోడులో సంక్షేమ పధకాల ద్వారా లబ్ది పొందితే అది రాజగోపాల్ రెడ్డి పుణ్యమే అవుతుందని తెలిపారు.ష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేస్తూ అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.