ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బలమైన ప్రయత్నాలు చేస్తున్న భారత్ 

ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, అత్యధిక ఆదాయంగల దేశంగా మారడానికి భారత్ బలమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్  తెలిపారు. దీని కోసం దార్శనికత, వివేకంతో ఆర్థిక వనరుల నిర్వహణ అవసరమని చెప్పారు. 
 
మూడు రోజుల సౌదీ అరేబియా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం సాయంత్రం ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉక్రెయిన్ సంక్షోభం సవాళ్లు విసిరినప్పటికీ, ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత సంతతి ప్రజలతో సంభాషించడంతో తన సౌదీ అరేబియా పర్యటన ప్రారంభమైందని చెబుతూ . దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళపై భారత సంతతి ప్రజల స్పందనను ప్రశంసించానని తెలిపారు. కరోనా  మహమ్మారి సమయంలోనూ, జాతీయ స్థాయిలో జరుగుతున్న పరివర్తన సమయంలోనూ దేశం ఏ విధంగా కోలుకున్నదీ వారికి వివరించానని చెప్పారు.
భారత సంతతి ప్రజలతో శనివారం మాట్లాడుతూ, క్రెడిట్, బ్యాంకింగ్, విద్య, కార్మిక విధానాలను మార్చగలిగే మార్గాల గురించి భారత దేశం  ఆలోచిస్తోందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, అత్యధిక ఆదాయంగల దేశంగా మారడానికి బలమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దీని కోసం దార్శనికత, వివేకంతో ఆర్థిక వనరుల నిర్వహణ అవసరమని తెలిపారు.
చాలా కీలక సంస్కరణలు అమలవుతున్నాయని, వీటి ఫలితాలను స్పష్టంగా చూడవచ్చునని చెప్పారు. 2021 మార్చి 31తో ముగిసిన సంవత్సరంలో మునుపెన్నడూ లేనంత ఎక్కువ ఎగుమతులు చేశామని పేర్కొంటూ మొత్తం ఎగుమతుల విలువ 670 బిలియన్ డాలర్లు అని వివరించారు.
 ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ప్రపంచం ధరల పెరుగుదల సమస్యను ఎదుర్కొంటోందని, అయితే భారత దేశం ఈ సంవత్సరం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందనే నమ్మకం తమకు ఉందని భయోరసా వ్యక్తం చేశారు. కనీసం 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని చెప్పారు.
 పేదలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని జైశంకర్‌ తెలిపారు. ఈ దిశగా దేశంలోని రేషన్‌ షాపుల వ్యవస్థపై ప్రధాని ప్రత్యేక శ్రధ్ధ వహిస్తున్నారని చెప్పారు. కరోనా కాలంలో పేదల్లో ఏ ఒక్కరూ ఆకలితో మరణించకూడదనే కృతనిశ్చయంతో మోదీ సర్కారు పనిచేసిందని గుర్తు చేశారు. 
 
కరోనా ఉపద్రవం నుంచి ప్రజలను, దేశాన్ని బయటపడేయడమే కాకుండా  ప్రజలందరికీ స్వదేశీ వ్యాక్సిన్‌ను కూడా ఉచితంగా పంపిణీ చేసిన ఘనత మోదీకే దక్కుతుందని జైశంకర్‌ పేర్కొన్నారు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం జనధన్‌ యోజన తీసుకొచ్చిందని, కరోనా కాలంలో అందులో అత్యధికుల ఖాతాల్లో డబ్బును కూడా జమ చేసిందని మంత్రి తెలిపారు. 
 
ప్రతి ఇంటికి పైపులైన్‌ ద్వారా నీటి సరఫరాను చేసే బృహత్తర పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గల్ఫ్‌ దేశాలతో భారత్‌కు ఉన్న  సంబంధాలను మరింత పటిష్ఠం చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తోందని ఆయన చెప్పారు.