ఎనిమిదేళ్ల సోదాల్లో రూ. 100 కోట్లు సీజ్ చేసిన ఈడీ

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇటీవలికాలంలో మనీలాండరింగ్‌కు సంబంధించి రాజకీయ నాయకులు, వ్యాపారులు, బ్యూరోక్రాట్లపై జరుపుతున్న దాడులు కలకలం రేపుతున్నాయి.  గడిచిన ఎనిమిదేళ్లలో ఈడీ అధికారులు 3,010 దాడులు చేసి రూ. లక్ష కోట్ల విలువైన సొత్తును సీజ్‌ చేశారు.
2004-14తో పోలిస్తే ఇది 27 రెట్లు ఎక్కువ. అప్పట్లో 112 ఈడీ దాడులు జరగ్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 18 ఏళ్లలో మొత్తం 5,422 కేసులను నమోదు చేసింది. కాగా,  గత మూడు నెలల్లో దేశంలో పలు కేసులకు సంబంధించి జరిపిన సోదాల్లో దాదాపు రూ. 100 కోట్లు స్వాధీనం చేసుకుంది.
తాజాగా, కోల్‌కతాలో ఓ మొబైల్ గేమింగ్ అప్లికేషన్ నిర్వాహకుడి ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 17 కోట్లు స్వాధీనం చేసుకుంది.  ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును 8 మంది బ్యాంకు అధికారులను కౌంటింగ్ మిషన్లతో లెక్కించారు. పశ్చిమ బెంగాల్ బహిష్కృత మంత్రి పార్థా ఛటర్జీ  సన్నిహితులు అర్పితా ముఖర్జీ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న రూ.50 కోట్లు ఈడీ చరిత్రలోనే అత్యధికం.
టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణానికి సంబంధించి కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ సోదాలు నిర్వహించి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. కొండలా గుట్టలుగా పడివున్న ఈ సొమ్మును లెక్కించేందుకు అధికారులకు 24 గంటలు పట్టింది. అంతకుముందు జార్ఖండ్ మైనింగ్ స్కామ్‌కు సంబంధించి రూ. 20 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది.  
 
నిజానికి స్వాధీనం చేసుకున్న సొమ్మును ఈడీ తన వద్ద ఉంచుకోదు. ప్రోటోకాల్ ప్రకారం.. సొమ్మును ఈడీ స్వాధీనం చేసుకున్న తర్వాత అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పేందుకు నిందితుడికి అవకాశం ఇస్తారు. దీనికి అతడు సరైన సమాధానం చెప్పడంలో విఫలమైనా, అతడు చెప్పిన సమాధానంతో అధికారులు సంతృప్తి చెందకున్నా అది అక్రమ సంపాదనగానే భావిస్తారు.
 
మనీలాండరింగ్ చట్టం కింద నగదును స్వాధీనం చేసుకున్న వెంటనే ఈడీ అధికారులు ఆ విషయాన్ని భారతీయ స్టేట్‌బ్యాంకు అధికారులకు తెలియజేసి డబ్బులు లెక్కించమని కోరుతారు. డబ్బు లెక్కింపు పూర్తయ్యాక బ్యాంకు అధికారుల సమక్షంలోనే ఎంత స్వాధీనం చేసుకున్నదీ జాబితా తయారు చేస్తారు. 
 
ఇందులో స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం విలువ, రూ. 2000 నోట్లు ఎన్ని? రూ. 500  నోట్లు ఎన్ని? రూ. 100 నోట్లు ఎన్ని అన్న వివరాలను రాస్తారు. ఆ తర్వాత ఓ స్వతంత్ర సాక్షి సమక్షంలో ఓ పెట్టులో ఆ మొత్తాన్ని ఉంచి సీల్ వేస్తారు. ఆ తర్వాత స్టేట్ బ్యాంకుకు పంపి ఈడీ వ్యక్తి డిపాజిట్ కింద జమ చేస్తారు.
 
అంటే అది కేంద్ర ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. అయితే, ఈ డబ్బును ఈడీ కానీ, బ్యాంకు కానీ, ప్రభుత్వం కానీ ఉపయోగించకూడదు. అటాచ్‌మెంట్ నిర్ధారణ తర్వాత ఆయా కేసులో విచారణ ముగిసే వరకు డబ్బు బ్యాంకులోనే ఉంటుంది. నిందితుడు దోషిగా కనుక తేలితే ఆ సొమ్ము కేంద్రం ఆస్తిగా మారుతుంది. నిర్దోషిగా బయటపడితే మాత్రం ఆ సొమ్మును తిరిగి అతడికే అప్పగిస్తారు. 
 
అదే బ్యాంకు మోసాలకు సంబంధించిన కేసు అయితే సంబంధిత బ్యాంకు అధికారులకు నగదును బదిలీ చేస్తారు. ఇలా ఈ 18 ఏళ్లలో బ్యాంకర్లకు రూ. 8,441 కోట్లను అందజేశారు. విజయ్‌ మాల్యా, నీరవ్‌మోదీ, మెహుల్‌ ఛోక్సీకి సంబంధించిన రూ. 23 వేల కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసి.. వాటిని ఆయా బ్యాంకులకు అప్పగించారు.