సీబీఐకు ఢిల్లీ ప్రభుత్వ బస్సుల కొనుగోలు కుంభకోణం

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం బస్సుల కొనుగోళ్ళలో అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ చేత దర్యాప్తు చేయించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలిపారు. గతంలో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపించేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్ చేసిన విజ్ఞప్తిని లెఫ్టినెంట్ గవర్నర్‌ ఆమోదించారు. 
 
ఢిల్లీ రవాణా సంస్థ (డిటిసి) కోసం 1,000 ‘లో ఫ్లోర్’ బస్సుల కొనుగోలుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా ఢిల్లీ రవాణా శాఖ మంత్రిని చైర్మన్‌గా నియమించడంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలవడం, కొనడం వంటి కార్యకలాపాలను ఈ కమిటీ నిర్వహించినట్లు తెలిపారు.
 
అక్రమాలను ప్రోత్సహించడం కోసమే టెండర్ల ప్రక్రియకు మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్‌ ను నియమించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆగస్టులో సమర్పించిన నివేదికను  లెఫ్టినెంట్ గవర్నర్ పరిశీలించారు.
టెండర్ ప్రక్రియలో తీవ్రమైన లోపాలు జరిగాయని ఈ నివేదిక పేర్కొంది. సాధారణ ఆర్థిక నిబంధనలను, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తెలిపింది. టెండర్ల ప్రక్రియలో లోపాలను సమర్థించుకోవడానికే మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌ ను నియమించారని తెలిపింది. డీటీసీ కమిషనర్ నివేదికలో కూడా ఇవే లోపాలను ఎత్తి చూపారు. 
 
అయితే వీకే సక్సేనా తనపై వచ్చిన ఆరోపణల నుంచి దృష్టి మరల్చేందుకే ఆయన ఇటువంటి దర్యాప్తులను చేయిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ముగ్గురిపై (ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి) చేవలేని ఆరోపణలు చేసిన తర్వాత ఇక నాలుగో మంత్రిపై ఫిర్యాదు చేశారని మండిపడింది. మొదట తనపై వచ్చిన ఆరోపణలకు ఎల్‌జీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. 
 
అవినీతికి పర్యాయపదం కేజ్రీవాల్ 
 
కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పర్యాయపదాలుగా మారాయని, ఆ పదవిలో కొనసాగే హక్కు ఆయనకు లేదని బీజేపీ ఆదివారం ఆరోపించింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ 1,000 లోఫ్లోర్ బస్సుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆరోపించిన విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పష్టం చేశారు. 
 
ఆప్ ప్రభుత్వంలోని ప్రతి విభాగం అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కేజ్రీవాల్ స్నేహితులకు ప్రయోజనం చేకూరుస్తున్నారని ధ్వజమెత్తారు.

“మొదట, ఇది ఎక్సైజ్ పాలసీ, ఇప్పుడు బస్సుల కొనుగోలులో అక్రమాలు ఉన్నాయి… కేజ్రీవాల్, అవినీతి పర్యాయపదాలుగా మారాయి. మీరు ‘కఠినమైన నిజాయితీపరులు’ అని ఎలా చెప్పుకుంటారు? మీరు ‘కఠినమైన అవినీతిపరుడు’ అని ప్రజలు అర్థం చేసుకున్నారు… మీకు ముఖ్యమంత్రి కుర్చీలో ఉండే హక్కు లేదు,” అని ఆయన స్పష్టం చేశారు.

‘అక్రమాల ఆరోపణలపై’ ఆప్ స్పందించలేదని, దృష్టి మరల్చేందుకు సంబంధం లేని మరో అంశాన్ని లేవనెత్తిందని బీజేపీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

 
 ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం కొన్ని కంపెనీలకు అనుకూలంగా కేంద్ర విజిలెన్స్ కమిషన్  టెండర్ నియమాలు,  మార్గదర్శకాలను ఉల్లంఘించిందని ఆరోపించారు. “కేజ్రీవాల్‌కు సివిసిపై నమ్మకం లేదు. ఆయన ఏకైక ఉద్దేశ్యం డిసిసి – ప్రత్యక్ష నగదు సేకరణ” అని ఆయన ఆరోపించారు.