కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణంరాజు మృతి చెందడం బాధాకరమన్న ప్రధాని రాబోయే తరాలు ఆయన సినిమా తీపిని, సృజనాత్మకతను గుర్తుంచుకుంటాయని పేర్కొన్నారు. సమాజ సేవలోనూ ముందుండే ఆయన రాజకీయ నేతగానూ ముద్ర వేశారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. 
కృష్ణంరాజు పరమపదించడం అత్యంత విచారకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్‌ లో పేర్కొన్నారు.  ‘‘మంచితనానికి మారుపేరుగా అనేకమంది అభిమానాన్ని చూరగొన్న  కృష్ణంరాజు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను” అని తెలిపారు.
“కృష్ణంరాజు నాకు అత్యంత ఆత్మీయులు. వాజ్ పేయి హాయాంలో మంత్రిగా పని చేసిన ఆయన నన్ను ఎంతగానో అభిమానించే వారు. వారు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు ప్రజల అభిమానాన్ని సంపాదించిపెట్టాయి. వ్యక్తిగతంగా మంచి ఆప్తుణ్ని కోల్పోవడం బాధాకరం’’, అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు
 
ప్రముఖ నటులు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి,  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. నటునిగా విభిన్న పాత్రలలో మెప్పించిన కృష్ణంరాజు గారు, రాజకీయాలలో కూడా నిజాయితీతో ప్రజలకు సేవలు అందించారని తేలిపారు.  ఆయన మృతి తెలుగు నేలకు తీరని లోటని చెప్పారు.
 
కృష్ణంరాజు అనారోగ్యంతో మరణించిన వార్త తీవ్రంగా బాధించిందని మాజీ మహారాష్ట్ర  గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. వాజపేయిని ప్రధానమంత్రి చేయాలన్న ఉద్దేశంతో బిజెపిలో చేరి లోక్ సభ సభ్యుడిగా పోటీ చేసి గెలుపొందారని, వాజపేయి   ప్రభుత్వంలో వివిధ శాఖలలో పనిచేసి ప్రజలకు సేవలందించారని తెలిపారు. అనేక చిత్రాలలో నటించి తెలుగు ప్రజలను సినిమా ద్వారా చైతన్య పరిచిన వ్యక్తి అని నివాళులు అర్పించారు.
 
పాత్రికేయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నటుడిగా, బీజేపీ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, పారిశ్రామిక వేత్తగా అవకాశం వచ్చిన ప్రతిచోటా తనదైన ముద్రవేసుకున్న మహనీయుడు కృష్ణంరాజు అంటూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.  నిరంతరం ప్రజల శ్రేయస్సును ఆలోచించిన గొప్ప మనిషి వారని కొనియాడారు. నిజ జీవితంలో, రాజకీయ జీవితంలో నిబద్ధతో మెలిగిన కృష్ణంరాజు తెలుగు సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ గా వ్యవహరించారని గుర్తు చేశారు.
 
రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా అనేక సంవత్సరాలు పనిచేసినా, నీతి నిజాయితీతో సమర్థవంతంగా పనిచేశారని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఓబిసి మోర్చా  జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ నివాళులు అర్పించారు. సినీ ప్రేక్షకుల హృదయాల్లో ‘రెబల్ స్టార్’ గా చిరస్థాయిగా అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం బీజేపీకి, తెలుగు ప్రజలతోపాటు వెండితెరకు తీరని లోటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం తెలిపారు. 
 
కృష్ణంరాజు మృతి పట్ల సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు కృష్ణంరాజు రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారని గుర్తు చేశారు.
 
‘‘కృష్ణంరాజు ఇక లేరు అనే మాట ఎంతో విషాద‌క‌రం. మా ఊరి హీరో, చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నా తొలి రోజుల నుంచి పెద్ద‌న్న‌లా ఆప్యాయంగా ప్రోత్స‌హించిన కృష్ణంరాజుగారితో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయ‌మైంది. ఆయ‌న ‘రెబ‌ల్ స్టార్‌’కి నిజ‌మైన నిర్వ‌చ‌నం” అంటూ మెగాస్టార్ సంతాపం ప్రకటించారు.
ఉభయగోదావరి జిల్లాల నుంచి బిజెపి తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన కృష్ణంరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని, ఆయన మృతి తనను కలచివేసిందని బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.