అస్సాం సీఎం  శర్మపై దాడి యత్నంపై భగ్గుమన్న బీజేపీ నేతలు 

గణపతి నిమజ్జనం సందర్భంగా శోభాయాత్రలు చూడడానికి హైదరాబాద్ వచ్చిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మపై దాడికి ఓ టిఆర్ఎస్  కార్యకర్త ప్రయత్నించడంపై బిజెపి నేతలు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరో రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే గౌరవించ  వలసిందిపోయి అవమానించే కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పోలీసింగ్ గురించి గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి కెసిఆర్, అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రికి సరైన భద్రత కల్పించలేక పోవడం సిగ్గుచేటని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 
 
గణేష్ నిమజ్జన కార్యక్రమానికి అతిథిగా వచ్చిన హిమంత బిశ్వ శర్మ వద్దకు తెరాస నాయకుడు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తుంటే , పోలీసులు చోద్యం చూస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు.  ఇది కచ్చితంగా ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగిందని స్పష్టంగా అర్ధం అవుతుందని అరుణ ఆరోపించారు. అస్సాం ముఖ్యమంత్రిపై ధాడికి యత్నించిన తెరాస నాయకుల పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అత్యంత అద్భుతంగా హైదరాబాద్లో జరిగే శోభాయాత్రను తిలకించడానికి వచ్చిన అతిధిని గౌరవించాలనే కనీసం సోయి కూడా లేకుండా టిఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు సిగ్గుచేటని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. మెడలో టిఆర్ఎస్ కండువా వేసుకున్న టీఆర్ఎస్ నాయకులను ప్రోటోకాల్ లేకుండా పోలీసులు స్టేజిపైకి ఎలా రానిచ్చారు అని ప్రశ్నించిన సంజయ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చే భద్రత ఇదేనా అంటూ ప్రశ్నించారు.

గణేశ్ నిమజ్జనం కోసం హైదరాబాద్ వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సభలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలు చూస్తే తెలంగాణలో ఎంత అరాచక వ్యవస్థ నడుస్తోందో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణకు వచ్చిన మరో రాష్ట్ర సీఎంని ప్రభుత్వ అతిథిగా, వీవీఐపీగా గౌరవించాల్సింది పోయి కనీస భద్రత కూడా కల్పించలేని దుస్థితిలో కేసీఆర్ సర్కారు ఉంది. హిమంతగారు పాల్గొన్న సభలో వేదిక మీదికి ఒక టీఆరెస్ కార్యకర్త వచ్చి మైక్ విరగ్గొట్టడం, అతన్ని ఆపడానికి అక్కడి పోలీసులు ముందుకు రాకపోవడం చూస్తుంటే ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిన సంఘటనేనని అని అర్ధమవుతని ఆమె స్పష్టం చేశారు