ఆధునిక భారత్ వైపుకు బానిసత్వ ప్రతీకల నుంచి విముక్తి

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని బానిసత్వ ప్రతీకల నుంచి విముక్తి చేసి ఆధునిక భారతాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అందులో భాగంగానే రూ.477 కోట్లతో పునర్నిర్మించినరాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా పేరు మార్చుతున్నట్టు తెలిపారు.  

న్యూఢిల్లీలోని ఇండియాగేట్‌ నుంచి రాష్ట్రపతిభవన్‌ వరకు ఉన్న రాజ్‌పథ్‌ (కింగ్స్‌ వే) బ్రిటిష్‌ రాజరికాన్ని మాత్రమే కాక మన బానిసత్వాన్ని గుర్తు చేసేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన నూతనంగా రూపొందించిన కర్తవ్యపథ్‌ను ప్రారంభించడంతో పాటు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 28 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

ఇదొక చరిత్రాత్మక ఘట్టమని ఆయన అభివర్ణిస్తూ గతంలో నేతాజీ విగ్రహం ఉన్న స్థానంలో బ్రిటిష్‌ చక్రవర్తి అయిదో జార్జి విగ్రహం ఉండేదని గుర్తు చేశారు. ‘‘గతాన్ని, వలసవాద శకలాలను తొలగించాం. కొత్త చరిత్ర ప్రవేశించింది. కర్తవ్యపథ్‌లో ఆధునిక భారత భవిష్యత్‌ రూపురేఖల్ని మీరు చూస్తారు. ఇది దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకే కాక, రాజకీయ నాయకులకు, మంత్రులకు, అధికారులకు కర్తవ్యబోధను చేస్తుంది’’ అని మోదీ తెలిపారు.  

గత ఎనిమిదేళ్లలో ఎన్నో వలసవాద చిహ్నాల్ని తొలగించామని, వలసవాద చట్టాలను రద్దు చేశామని ప్రధాని గుర్తు చేశారు. నేతాజీ విముక్తి చేసిన అండమాన్‌లో బ్రిటిష్‌ కాలం నాటి పేర్లను రద్దు చేశామని చెప్పారు. ఆధునికంగా, అన్ని శక్తులను పుంజుకున్న భారత దేశానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామని వివరించారు. 

నేతాజీని విస్మరించడం దౌర్భాగ్యం

భారత వారసత్వం పట్ల  నేతాజీ గర్వించేవారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన కనుక స్వాతంత్య్రం తర్వాత అధికారాన్ని చేపట్టి ఉంటే భారత దేశం ఆధునికంగా ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ మహానాయకుడిని మరిచిపోవడం, ఆయన ఆలోచనలను, ఆయన ప్రతీకలను కించపరచడం దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేశారు.

గత 8 ఏళ్లలో నేతాజీ స్వప్నాల్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాని చెప్పారు. నావికాదళానికి కూడా బానిసత్వాన్ని ప్రతిబింబించే పేర్లు ఉండేవని వాటిని మార్చేశామని గుర్తు చేశారు. గణతంత్ర పరేడ్‌లో సంప్రదాయ సంగీతాలకు, కళలకు ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. బీటింగ్‌ రిట్రీట్‌లో భారతీయ సంగీతాన్ని, దేశ భక్తిని ప్రతిబింబించే గీతాల్ని ఆలపిస్తున్నామని చెప్పారు.

విదేశీ విద్యావిధానాన్ని తొలగించి భారతీయతను ప్రతిబింబించే  నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టామని ప్రధాని తెలిపారు. కర్తవ్యపథ్‌ కేవలం రాతితో నిర్మించిన మార్గం కాదని, బానిసత్వ మానసికతను తొలగించి కర్తవ్యాన్ని, సర్వకాలిక ఆదర్శాల్ని, ప్రతిబింబించే మార్గమని ప్రధాని వెల్లడించాయిరు. కర్తవ్య పథ్‌ను నిర్మించిన కూలీలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

రానున్న రిపబ్లిక్‌ దినోత్సవానికి తన అతిథులుగా ఈ కూలీలను ఆహ్వానిస్తామని ప్రధాని ప్రకటించారు. పార్లమెంటు నిర్మాణంలో పాల్గొన్న కూలీలను కూడా ఆహ్వానించి ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్‌‌‌‌దీప్ సింగ్ పురి, జి.కిషన్‌‌రెడ్డి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు.

కాగా, నేతాజీ విగ్రహం తయారీకి తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి గ్రానైట్‌ రాయిని సేకరించారు. 280 టన్నుల బరువు ఉన్న ఏకశిలను ఢిల్లీకి తరలించారు. రెండు నెలలపాటు శిల్పులు దాన్ని విగ్రహంగా మలిచారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సెంట్రల్‌ విస్టా పనుల్లో భాగంగానే దీన్ని ఏర్పాటు చేశారు.