రూ.24.60లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు

బాలాపూర్‌ గణేశుడి లడ్డూ రికార్డు ధర పలికింది. ఈ ఏడాది ఏకంగా రూ.24.60లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి వేలాన్ని రూ.1,11,116ల నుంచి నిర్వాహకులు వేలంపాట ప్రారంభించగా అనేక మంది పోటీపడ్డారు. ఈ క్రమంలో పొంగులేటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి రూ.24.60లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
గతేడాది కంటే రూ.5.70లక్షల ఎక్కువగా లడ్డూకు ధర పలకడం విశేషం. గతేడాది కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్‌ యాదవ్‌తో కలసి నాదర్‌గుల్‌ వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను రూ.18.90 లక్షలకు దక్కించుకున్నారు. 2019లో కొలను రాంరెడ్డి 17.60లక్షలకు బాలాపూర్‌ గణేశుడి లడ్డూను దక్కించుకోగా 2020లో కరోనా కారణంగా వేలంపాట నిర్వహించలేదు. 2021లో లడ్డూను దక్కించుకున్న శశాంక్ రెడ్డి 2019లో కంటే రూ.1.30లక్షల ఎక్కువగా రూ.18.90 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.

హైదరాబాద్ గణేశ్ ఉత్సవాల చరిత్రలో బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. పరిమాణంలో ఖైరతాబాద్ గణపతి అందరికంటే మిన్న అనిపించుకుంటే, బాలాపూర్ లో గణేశుడి లడ్డూ వేలం పాటకు అదేస్థాయి విశిష్టత ఉంది. బాలాపూర్ లడ్డూకు రికార్డు స్థాయిలో ధర పలుకుతూ వస్తుంది. 1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం కొనసాగుతోంది. మొదట్లో ఇక్కడి లడ్డూ కేవలం రూ.450 ధర పలికింది. ఆ తర్వాత లక్షలకు చేరింది.

మహాగణపతి శోభాయాత్ర

కాగా, ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న మహా గణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. వెల్డింగ్ పనులు పూర్తి అవడంతో మహాగణపతికి ఉత్సవ సమితి నిర్వాహకులు హారతి ఇచ్చి శోభాయాత్రను మొదలుపెట్టారు. 

ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా  ఖైరతాబాద్ బడా గణేష్  భక్తులకు దర్శనమిచ్చారు. తొలిసారి 50 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్‌కు చేరుకుని మహాగణపతిని దర్శించుకున్నారు. ఈ ఏడాది మట్టి గణపతి కారణంగా నిర్వాహకులు నిమజ్జనానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ – 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరుగనుంది.

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కాస్త ఆలస్యంగా మొదలైంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పనులు పూర్తికాకపోవడమే ఇందుకు కారణం. వెల్డింగ్ పనులు పూర్తి అయిన వెంటనే శోభాయాత్రను నిర్వాహకులు ప్రారంభించారు. వేలాది మంది భక్తులతో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది.

 ఈ సందర్భంగా, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులకు- టాస్క్ ఫోర్స్ పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉత్సవ సమితి సభ్యులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దీంతో శోభాయాత్ర జరగదంటూ ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులు భీష్మించారు. పోలీసుల తీరు బాగా లేదని ఉత్సవ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 ట్యాంక్ బండ్ పై గణనాథుల నిమజ్జనాలు కోలహలంగా జరుగుతున్నాయి. ఈ సారి ఉదయం నుంచే నిమజ్జనాలు మొదలయ్యాయి. ఓల్డ్ సిటీ నుంచి కూడా విగ్రహాలు తొందరగానే మూవ్ అవుతున్నాయి. దీంతో మొహంజాహి మార్కెట్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గర భక్తుల సందడి కనబడుతోంది. మరోవైపు చార్మినార్ దగ్గర కేంద్ర బలగాలతో పహారా కాస్తున్నారు. ప్రశాంతంగా నిమజ్జనం ముగిసేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆట పాటలతో భక్తులు గణనాయకున్ని నిమజ్జనానికి తరలిస్తున్నారు.