రాజధాని రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి

అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు చేపట్టిన రాజధాని రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.  ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగాలని డిమాండ్ చేస్తూ రాజధానికోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు ప్రారంభించిన నిరసన దీక్షలు 1,000 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ  నెల 12న మహా పాదయాత్ర తలపెట్టగా, గతంలో జరిపిన పాదయాత్ర సందర్భంగా రైతులు నిబంధనలు ఉల్లంఘించారంటూ డీజీపీ తాజా మహా పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. 

రైతులకు అనుమతి నిరాకరిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గత అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పాదయాత్రలో 200 మంది పాల్గొంటారని చెప్పారని, ఒకవేళ సంఖ్య పెరిగితే ఒక్కో బృందంలో 200 మంది చొప్పున వేర్వేరుగా యాత్ర చేపడతామని చెప్పినప్పటికీ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతో అనుమతి నిరాకరిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు.

 యాత్ర సాగే జిల్లాల పోలీసుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న మీదటే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు డీజీపీ అందులో పేర్కొన్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందని, కాబట్టి భద్రత కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఉత్తర్వుల ప్రతిని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతి రావుకు పంపించారు.

ఈ నేపథ్యంలో, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మహా పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ పాద‌యాత్ర ఈనెల 12వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 11వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. అయితే 600 మంది పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. 

పాదయాత్రలో పాల్గొనే వారి పేర్లు తీసుకుని, వారికి ఐడీ కార్డులు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని  ఆదేశించింది. పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా పాదయాత్ర ముగింపు రోజు బహిరంగ సభ అనుమతి కోసం  ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని రైతులకు కోర్టు సూచిస్తూ, ఆ దరఖాస్తు పరిశీలించాలని పోలీసులను ఆదేశించింది.

రైతుల పిటిషన్ ను నేటి మొదటి కేసుగా తీసుకుని విచారణ చేపట్టింది. రైతుల మహాపాదయాత్రకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై  హైకోర్టు సీరియస్ అయింది. రాజకీయ నాయకులు వేల మందితో పాదయాత్ర చేయవచ్చు గానీ.. 600 మంది రైతులు పాదయాత్ర చేయకూడదా? అని ప్రశ్నించింది.

 ‘‘600 మంది రైతులు పాదయాత్రకు మీరెందుకు బందోబస్తు కల్పించలేరు?.. జోడో యాత్ర రాష్ట్రాల మీదుగా జరుగుతుంటే అనుమతి ఇచ్చారు.. ఢిల్లీలో సమస్యలపై వేలాది మంది ర్యాలీలు చేస్తుంటే అనుమతులు ఇచ్చి.. అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు..35 వేల మంది రైతుల్లో 600 మంది రైతులు పాదయాత్రలు చేస్తుంటే.. మీరు బందోబస్తు కల్పించలేరా?’’ అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.