తెలంగాణ, ఏపీ, తమిళనాడులలో బీజేపీకే అధికారం 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,  తమిళనాడు రాష్ట్రాలలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. గణేశ్ ఉత్సవాలను చూడటానికే భాగ్యనగరానికి వచ్చానని ఆయన తెలిపారు. భారతదేశంలో హిందువులు ఉండటం వల్లనే సెక్యులరిజం ఉందని పేర్కొన్నారు. 

నరేంద్ర మోదీ ప్రధాని కాకపోతే రామ మందిర నిర్మాణం జరిగేది కాదని ఆయన స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ సర్కారు దేశ ప్రజల మనస్సులు గెల్చుకుందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలలో ఏ విధంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందో తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలలోనూ అదేవిధంగా అధికారంలోకి వస్తుందని ఆయన  భరోసా వ్యక్తం చేశారు.

‘‘సనాతన ధర్మం వల్లే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. హిందూ ధర్మం జీవన విధానాన్ని తెలియజేస్తుంది’’ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇక  హైదరాబాద్ లోని ఎం జె మార్కెట్ వద్దకు  అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ  వస్తుండడంతో  భాగ్య నగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అక్కడ వేదిక ఏర్పాటు చేశారు.  అదే సమయంలో ఎం జె మార్కెట్ చౌరస్తా లో మంత్రి తలసాని ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు టీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. 

వారిని గమనించిన భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు ఇక్కడ మంత్రి తలసాని ఫ్లెక్సీ ఏర్పాటు చేయొద్దని కోరారు. కాసేపట్లో అస్సాం సీఎం అక్కడికి చేరుకుంటారని చెప్పారు. అయితే అక్కడే ఫ్లెక్సీ పెట్టి తీరుతామని  టీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు. దీంతో టీఆర్ఎస్ నేతలు, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.   

ఘనంగా గణేష్ శోభాయాత్ర 

కాగా, హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలతో నగరం మార్మోగిపోతోంది. గణేశ్ నిమజ్జనానికి  సిటీ  నలుమూలల నుంచి వేల సంఖ్యంలో గణనాథుడి విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు క్యూ కట్టాయి. తొమ్మిది రోజులు పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేర్చేందుకు భక్తులు బయల్దేరారు.  

నిమజ్జనం సందర్భంగా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పై అడుగు అడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు ఏయే మార్గాల్లో ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలో తెలియజేస్తూ పోలీసులు రూట్ మ్యాప్ ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. అంతేకాదు నిమజ్జనం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

ట్యాంక్ బండ్ పై భక్తుల సందడితో కోలాహలంగా మారింది. గంగమ్మ చెంతకు గణనాథుడిని చేర్చేందుకు భారీగా తరలివచ్చారు. డప్పు సప్పులు, నృత్యాలు చేస్తూ  భక్త పరవశంలో మునిగిపోయారు.  భారీ గణనాథులు ట్యాంక్ బండ్ కు చేరుకోవంతో క్రేన్ల సాయంతో ప్రశాంతంగా నిమజ్జనంచేస్తున్నారు. బై బై గణేశా అంటూ నిమజ్జనం చేస్తూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.