అస్సాం సీఎం శర్మపై హైదరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్త దాడి యత్నం

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ గణేష్  శోభాయాత్ర సందర్భంగా ఎంజే  మార్కెట్ వద్ద  పాల్గొన్న బహిరంగసభలో ఆయనపై ఓ టిఆర్ఎస్ కార్యకర్త నంద కిషోర్ వ్యాస్ దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.  గణేశ్​ ఉత్సవాల విశిష్టతను భక్తులకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు వివరిస్తుండగా టీఆర్‌ఎస్ కార్యకర్త ఒకరు సమీపం దాకా రావడంతో పాటు మైక్ విరిచేశాడు.

శర్మను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేశాడు. ఇది సరైన పద్దతి కాదని  అక్కడున్నవారు  వారించినా వినిపించుకోలేదు. అప్రమత్తమైన భాగ్యనగర్ ఉత్సవ్ సమితి నాయకులు వెంటనే టీఆర్‌ఎస్ కార్యకర్తను స్టేజీపై నుంచి కిందకు దించేశారు. ఇంతలో వచ్చిన పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తను అక్కడ నుంచి తరలించారు. భద్రతా వైఫల్యంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో హైదరాబాద్ పోలీసులు ఉలిక్కిపడ్డారు.

అంతకు ముందు హిమంత బిశ్వా శర్మ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం నిజాం పాలనని కొనసాగిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. కుటుంబ పాలన నుండి విముక్తి కలిగాలని భాగ్యలక్ష్మీ అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. 

కేవలం ఒక కుటుంబానికే పరిమితమైన అధికారం తెలంగాణ ప్రజలందరికీ రావాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో అందరి ఇండ్లలోకి మహాలక్ష్మి రావాలని వేడుకున్నానని శర్మ తెలిపారు.

అసోం  సీఎం హిమంత బిశ్వ శర్మ పై దాడిని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  ఈటల రాజేందర్​ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేనే రాజు నేనే మంత్రి అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాలకు వెళ్తానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఇలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హితవు చెప్పారు. 

ముఖ్యమంత్రి ప్లాన్ ప్రకారమే హిమంతపై దాడి చేయించారని ఈటెల  ఆరోపించారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారు మాత్రమే ఇలాంటి దాడులకు పాల్పడతారని మండిపడ్డారు. 

అసోం సీఎం మాట్లాడుతుండగా టీఆర్ఎస్​కార్యకర్త దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని ఈటల రాజేందర్​ పేర్కొన్నారు.  పక్క రాష్టం సీఎం తెలంగాణకు వచ్చినప్పుడు వారికి రక్షణ, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత  ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. గణేశ్ ​ఉత్సవాలకు వచ్చిన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిపై టీఆర్ఎస్​ నాయకులు ప్లాన్ ప్రకారమే దాడి చేశారని ధ్వజమెత్తారు.