వేయి రోజుల తర్వాత శతకం సాధించిన విరాట్ కోహ్లీ

టీమిండియా రన్‌మెషిన్‌ విరాట్‌ కోహ్లి ఎట్టకేలకు వెయ్యి రోజుల తర్వాత సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆసియా కప్‌లో గురువారం అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన కోహ్లి.. 53 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 

కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. మొత్తం మీద 61 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లి తన టి20 కెరీర్‌లో అత్యధిక పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి టీ20ల్లో వంద సిక్సర్ల మార్క్‌ను కూడా అందుకున్నాడు. ఇక టి20ల్లో 3500కు పైగా పరుగులను అందుకున్నాడు. 

టీమిండియా నుంచి రోహిత్‌ శర్మ తర్వాత ఈ రెండు ఫీట్‌లు అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. బౌలింగ్‌లో పేసర్‌ భువనేశ్వర్‌ (4-1-4-5) నిప్పులు చెరిగే బంతులతో తన ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు. వీరిద్దరి ధాటికి ఆసియాకప్ సూపర్4లో భాగంగా గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఇప్పటికే ఫైనల్‌కు చేరడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి అజేయ శతకంతో కదం తొక్కాడు. 

దీంతో టీమిండియా రికార్డు స్కోరును సాధించింది. విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లి 61 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లతో అజేయంగా 122 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఓపెనర్‌గా దిగడం విశేషం. ఇక కెఎల్ రాహుల్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. 

ఓపెనర్‌గా వచ్చిన కోహ్లీ తొలి 10 బంతుల్లో చేసింది పది పరుగులే. కానీ ఆరో ఓవర్‌లో ఒక్కసారిగా 4,4,6తో విరుచుకుపడడంతో దుబాయ్‌ మైదానంతో తుఫాన్‌కు తెర లేపినట్టయ్యింది. అతడి 32 రన్స్‌ వద్ద జద్రాన్‌ క్యాచ్‌ వదిలేయడంతో ఇక కోహ్లీ బ్యాట్‌ నుంచి పరుగుల వరదే పారింది. చకచకా బౌండరీలతో 32 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అటు రాహుల్‌ కూడా బ్యాట్‌ ఝుళిపిస్తూ ఫామ్‌ చాటుకుంటూ రెండు వరుస ఫోర్లతో 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.

తొలి వికెట్‌కు 118 పరుగులు అందాక 13వ ఓవర్‌లో రాహుల్‌, సూర్యకుమార్‌ (6)లను ఫరీద్‌ అవుట్‌ చేశాడు. ఆ తర్వాత పంత్‌ (20 నాటౌట్‌)తో కలిసి కోహ్లీ బాదుడుకు అఫ్ఘాన్‌ బౌలర్లు దిక్కులు చూడడమే మిగిలింది. 19వ ఓవర్‌లో 4,6తో కోహ్లీ సెంచరీ పూర్తి చేశాడు. 84 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల తర్వాత అతడు ఈ ఫీట్‌ సాధించడం గమనార్హం. ఇక ఆఖరి ఓవర్‌లో మరింతగా చెలరేగి 6,6,4తో 20 రన్స్‌ అందించి స్కోరును 200 దాటించాడు. తన చివరి 72 పరుగులను విరాట్‌ 21 బంతుల్లోనే చేయడం విశేషం.

కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. ఇక కోహ్లి శతకంతో ఆకట్టుకున్నాడు. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విరాట్ అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించడం గమనార్హం. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఇబ్రాహీం జర్దాన్ 64 (నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.