కర్ణాటక ఎన్నికలపై ప్రధాని మోదీ దృష్టి… నెలకొకసారి పర్యటన!

మంగళూరులో రూ 3,800 కోట్ల వ్యయం కాగల పలు మౌలిక సదుపాయాల  ప్రాజెక్ట్ లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రధానంగా వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో రెండు రోజుల క్రితం మంగళూరు పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా సమావేశంపై ఆయన ఎన్నికల  సన్నాహాలు గురించి చర్చించారు. 
 
“డబల్ ఇంజిన్” అభివృద్ధి అజెండాతో ప్రజలోకి వెళ్లాలని సూచించారు. ప్రాంతాల వారీగా పార్టీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తే తాను పాల్గొంటానని హామీ ఇచ్చారు. కనీసం నెలకు ఒకసారి కర్ణాటకలో పర్యటించి, ఎక్కడో ఒక  చోట బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించాలని ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, పార్టీ పార్లమెంటరీ  బోర్డు సభ్యుడు బి ఎస్ యడ్డియూరప్పా ప్రధానిని కోరారు. 
 
మంగళూరులో తన అధికారిక కార్యక్రమం సందర్భంగా జరిగిన బహిరంగసభలో పెద్దఎత్తున ప్రజలు హాజరుకావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ ఓ ప్రభుత్వ కార్యక్రమంపై ఆ విధంగా హాజరు కావడం గొప్ప విషయమే అని చెప్పారు. కర్ణాటక ప్రజలు ఇంకా బిజెపి పట్ల సానుకూలంగా ఉన్నట్లు సంకేతం అని కూడా తెలిపారు. 
 
జులై 26న యువమోర్చ కార్యకర్త ప్రవీణ్ నెట్టారు హత్య తర్వాత పార్టీ కార్యకర్తలలో ఆగ్రవేశాలు చెలరేగిన అనంతరం మంగళూరులో ప్రధాని కార్యక్రమం విజయవంతం కావడం కోస్తాప్రాంతంలో బిజెపి పట్ల ప్రజలలో లభిస్తున్న ఆదరణకు నిదర్శనం అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహితం సంతృప్తి వ్యక్తం చేశారు. 
 
“అభివృద్ధి” అజెండాతో వచ్చే ఎన్నికలలో గెలుపొందవచ్చని భరోసా ఇస్తూ, అభివృద్ధి పధకాలు నిర్ధేశిత వర్గాలకు చేరుకొనే విధంగా ఒక వంక ప్రభుత్వ యంత్రాంగం, మరోవంక పార్టీ కార్యకర్తలు జాగురత వహించాలని ప్రధాని పార్టీ నేతలకు సూచించారు. పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేయవద్దని, వారు  క్రియాశీలకంగా ఉండేవిధంగా ప్రోత్సహించాలని కూడా చెప్పారు. 
 2023 ప్రారంభంలో జరుగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికలు ఒక విధంగా 2024 లోక్ సభ ఎన్నికల ప్రయాణంలో మొదటి మజిలీ కానున్నాయి. దక్షిణాదిన బీజేపీకి పట్టు కలిగిన ఏకైక రాష్ట్రం కావడంతో ఇక్కడ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా 2024  ఫలితాలపై దేశ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలలో, ప్రజలలో భరోసా నింపాలని బిజెపి నాయకత్వం భావిస్తున్నది.
అందుకనే ప్రధానితో పాటు పార్టీ ఇతర అగ్రనేతలు సహితం తరచూ రాష్ట్రంలో పర్యటిస్తూ,  భారీ ప్రాజెక్టులు ప్రకటించడం, బహిరంగసభల ద్వారా ప్రజలకు దగ్గర అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాని మోదీ యోగా దినోత్సవంలో ప ల్గొనేందుకు మైసూరుకు రావడం తెలిసిందే. బెంగళూరుకు సబర్బన్‌ రైలు ప్రాజెక్టును ప్రకటించారు.
ఆగస్టు 4న కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్‌షా బెంగళూరుకు వచ్చారు. చిత్రదుర్గలో సహకార సదస్సులో పాల్గొన్నారు.  ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ బెంగళూరులో  ధర్మస్థళ సంస్థ నిర్వహిస్తున్న ప్రకృతి చికిత్సా కేంద్రాన్ని సందర్శించారు. ఇదే సందర్భంలోనే రాష్ట్ర నేతలతో రాజకీయ పరిణామాలపై ఆయన ఆరా తీశారు.
ఈనెల 8న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగళూరుకు రానున్నారు. దొడ్డబళ్లాపురలో నిర్వహించే బీజేపీ జనోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇలా వరుసగా అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చే కార్యక్రమాలను ఇటు రాష్ట్ర పార్టీ, అటు జాతీయ నేతల పర్యటనలను రూపొందిస్తున్నారు.