ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే రోడ్డు ప్రమాదంలో మరణించారని పోలీసులు చెపుతున్నారు. ఆదివారం ముంబై సమీపంలోని పాల్ఘర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ అజాగ్రత్తే ఆయన ప్రాణం తీసుకున్నట్టు స్పష్టం చేస్తున్నారు.
మిస్త్రీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశీయ వ్యాపార దిగ్గజాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్ నుంచి మెర్సిడెజ్ బెంజ్ కారులో ముంబై వస్తుండగా పాల్ఘార్ జిల్లాలోని సూర్య నదిపై ఉన్న బ్రిడ్జిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారు బ్రిడ్జిపై ఉన్న రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన దర్యాప్తు చేయగా కీలక విషయాలు బయటపడ్డాయి.
కారు వెనుక సీటులో కూర్చున్న సైరస్ మిస్త్రీ అసలు సీటు బెల్టే పెట్టుకోలేదని విచారణలో తెలిసింది. ఆయనతో పాటు పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా సీటు బెల్ట్ పెట్టుకోలేదని, సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని ఉండేవని దర్యాప్తు చేసిన పోలీసులు తెలిపారు. సీటు బెల్ట్ ధరించకపోవడం, మితిమీరిన వేగం ఈ ప్రమాదానికి కారణమని పోలీసు వర్గాలు చెప్పాయి.
రాంగ్ రూట్‌లో మరో వాహనాన్ని ఎడమ పక్క నుంచి ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కాగా, ముందు సీట్ లో ఉన్న కారును నడుపుతున్న ముంబైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ అనిహిత పండోలే, ఆమె భర్త డారియస్ పండోలే సీట్ బెల్ట్ లు పెట్టుకోవడంతో, గాయాలకు గురయినా ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.
మిస్ర్టీతో పాటు వెనుక సీట్ లో మృతి చెందిన డారియస్ పండోలే సోదరుడు జహంగీర్ పండోలే కూడా సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. ఆయన గతంలో టాటా గ్రూప్ కంపెనీల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో సూర్య నది వంతెనపై మిస్త్రీ కారు ఘోర ప్రమాదానికి గురైంది.
ప్రమాద సమయంలో కారు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కాలేదు. దీంతో సైరస్ మిస్త్రీ ఆయన పక్కనే ఉన్న జహంగీర్ పండోలేలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనిహిత పండోలే, ఆమె భర్త డారియస్ పండోలే తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుల్ని స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ‘కారు వెనుక సీటులో కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడూ నా సీటు బెల్ట్ ధరించాలని నిర్ణయించుకుంటున్నాను. మీ అందరూ కూడా ఇలాంటి ప్రతిజ్ఞ తీసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు.
More Stories
భారత్ బలం అద్భుతమైన ఏకీకృత స్ఫూర్తిలోనే ఉంది
మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు