జరిగింది విమోచనమే; విలీనం పైపూత మాత్రమే

జరిగింది విమోచనమే; విలీనం పైపూత మాత్రమే
డా. వడ్డీ విజయ సారధి, 
ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త, `జాగృతి’ పూర్వ సంపాదకులు 
జమ్మూ కశ్మీర్ విలీనం విషయంలో పాకిస్తాన్ తో వ్యవహరించటంలో ప్రధానమంత్రి నెహ్రూ తీరు తెన్నులతో ఉప ప్రధానమంత్రి సర్దార్ పటేల్ విసిగిపోయారు. ఒకదశలో మంత్రివర్గం నుంచి బయటపడాలని అనుకున్నారు.
ఆ విషయం తెలిసి గాంధీగారు పటేల్ ను పిలిపించుకొని ఎట్టిపరిస్థితిలోనూ నెహ్రూను వదిలిపెట్టిపోనని మాట ఇవ్వవలసిందిగా కోరారు. పటేల్ కాదనలేకపోయారు.  హైదరాబాద్ సమస్యను పరిష్కరించవలసిన కీలక తరుణంలో నెహ్రూ కఠిన నిర్ణయాలు తీసుకోవటంలో వెనుకాడుతున్నట్లుగా పటేల్ గ్రహించారు.
ఆయనపై ఆధారపడితే, సమస్య ఎప్పటికీ తేలదని, ఈలోపల తిరిగి దారికి తెచ్చుకోజాలని విధంగా శాశ్వతమైన నష్టం జరిగిపోనున్నదనీ గ్రహించారు. మహమ్మద్ ఆలీ జిన్నా (పాకిస్తాన్ గవర్నర్ జనరల్) మరణము, మౌంట్ బాటెన్ భారతదేశపు గవర్నర్ జనరల్ పదవి నుంచి వైదొలగటమూ సంభవించిన ఆ తరుణాన్ని జారవిడుచుకోరాదని భావించారు.
 
 హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్ వలె దేశం సరిహద్దుల వద్ద లేదు. మన దేశాంతర్గత భాగంగా ఉంది. దీన్ని అవకాశంగా తీసుకొని గృహ మంత్రిత్వ శాఖ పరిధిలో వ్యవహారం నడిపించడానికి చొరవ చేశారు. ఉప ప్రధానమంత్రిగా తనకున్న అధికారాలతో సైనిక దళాలను సంసిద్ధ పరుచుకొని సకాలంలో ఆదేశాలిచ్చారు.
 
పోలీసు చర్య అనే పదం వాడటంలో పటేల్ గారి రాజనీతిజ్ఞత వ్యక్తమౌతుంది. ఆ పదం వాడకుంటే వ్యవహారం విదేశాంగ శాఖ మంత్రి (నెహ్రూ) గారి బల్ల మీద నిద్రపోతూ ఉండేది. లేదా జమ్ము కాశ్మీర్ వ్యవహారంలా కంపుకొట్టుతూ మిగిలి ఉండేది.
 
చివరగా, లొంగిపోయిన ఏడవ నిజాంకి రాజ ప్రముఖ్ హోదా ఎందుకు కట్టబెట్టారనే ప్రశ్న వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువలైనా, కొంత నష్టం జరిగినా, సమస్యను హోం మంత్రిత్వ శాఖ పరిధిలోనే పరిష్కరించాలి.
 
 ఆ పరిధిని దాటి పోతే ఎప్పటికీ అది పరిష్కరింపబడదనే విషయం బాగా తెలిసినవానిగా, నెహ్రూతో వ్యవహరించే విషయంలో తనకు స్వేచ్ఛ లేదని (గాంధీగారికి ఇచ్చిన మాటకు తాను బద్ధుడై ఉన్నాడు), నిజాంతో వ్యవహరించే సందర్భంలో అటువంటి అవరోధాలు లేవనీ అవగాహన ఉన్న వానిగా, నిజాంను రాజ ప్రముఖ్ వంటి నామమాత్రపు గౌరవమిచ్చే స్థానంలో నియుక్తిని చేశాడు. 
 
సెప్టెంబర్ 17 నాటికి ఈ ప్రక్రియ ఒక కొలిక్కి రాబట్టే తెలంగాణ భగత్ సింగ్ గా పిలువబడిన నారాయణరావ్ పవార్ కి విధింపబడిన ఉరిశిక్ష అమలు కాకుండా నిలువరించటం జరిగింది. నారాయణ పవార్ 21శతాబ్దపు తొలినాళ్ళ వరకు జీవించారు. విమోచనం విలీనం రూపానికి ఎందుకు వచ్చిందో ఈపాటికి మనకు అర్థమై ఉంటుంది. జరిగింది విమోచనమే. విలీనమనేది పైపూత మాత్రమే.