అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీపై కొనసాగుతున్న ప్రకంపనలు

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో విందు సందర్భంగా భేటీ జరిపి రెండు వారాలవుతున్నా అది  సృష్టించిన రాజకీయ ప్రకంపనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ భేటీ గురించి మర్యాదపూర్వకంగా అమిత్ షా ఓ  ట్వీట్ ఇవ్వడం, అందుకు  ధన్యవాదాలు తెలుపుతూ ఎన్టీఆర్ మరో ట్వీట్ ఇవ్వడం మినహా వారిద్దరూ ఇంతవరకు మరెటువంటి వాఖ్యలు చేయలేదు. 

అయితే, తాజాగా రానున్న ఎన్నికలలో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడంతో ఎన్నికల్లో ఏపీలో జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లయింది.

వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసే తాము ముందుకెళ్తామని చెబుతూ  జూనియర్‌ ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువని, అతని సేవలను వినియోగించుకుంటామని చెప్పడం ద్వారా కొన్ని రోజులుగా బిజెపి, టిడిపి తిరిగి కలసి ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు వస్తున్న కథనాలకు ఆయన చెక్ పెట్టిన్నట్లయింది. 

ఇప్పటికే బిజెపి ఏపీ సహా ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు బిజెపి,  టిడిపి తిరిగి కలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. గత నెలలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో  సమావేశం కావడంతో బీజేపీ అధిష్ఠానం జూనియర్ ఎన్టీఆర్‌పై దృష్టి సారిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 

ఆ భేటీలో అమిత్‌షా- జూనియర్‌ ఎన్టీఆర్‌ సుమారు అరగంట పాటు ముఖాముఖి మాట్లాడుకున్నట్లు తెలిసింది. తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలకు జగన్ వెళ్లనున్నారన్న సంకేతాల నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.

వారిద్దరూ కేవలం సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకొన్నారని అమిత్ షా ఆ తర్వాత ఇచ్చిన ట్వీట్, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మీడియాతో చెప్పిన విషయాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే  వారిద్దరి మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయని, వచ్చే ఎన్నికలలో బిజెపికి ప్రచారం చేయడానికి ఎన్టీఆర్ సుముఖంగా ఉన్నారని బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె లక్ష్మణ్ ఆ మరుసటి రోజుననే చెప్పడం గమనార్హం. 

స్థానిక నేతలతో సంబంధం లేకుండా ఢిల్లీ నుండే అమిత్ షా ఈ భేటీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తున్నది.  రెండు తెలుగు రాష్టాలలో వచ్చే ఎన్నికలలో తమ సత్తా చూపించడం కోసం స్వయంగా అమిత్ షా  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకనే వీరి సమావేశం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపింది.

ఇటీవలనే బిజెపి రాజ్యసభకు నామినేట్ చేసిన ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ కుమారుడు, జాతీయ స్థాయిలో బాహుబలి వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళికి ఎన్టీఆర్ సన్నిహిత మిత్రుడు కావడం గమనార్హం. పైగా, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి డి. పురందేశ్వరి ఎన్టీఆర్ కు మేనత్త. అమిత్ షాను కలవడానికి ముందు ఆమెను కూడా ఎన్టీఆర్ కలిసినట్లు చెబుతున్నారు. 

ఏదేమైనా అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్ భేటీ యధాలాపంగా జరిగింది కాదని, లోతైన రాజకీయ వ్యూహంలో భాగంగా జరిగినదని పలువురు భావిస్తున్నారు. ఈ భేటీ రెండు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తుంది.