అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 8 శాతం

ప్రపంచ స్థాయిలో సాగుతోన్న అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పోటీలో భారతదేశం గణనీయ ఫలితాల దిశలో ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం ప్రారంభించడం, ప్రైవేటు రంగం కఠోర పరిశ్రమతో గ్లోబల్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా 8 శాతానికి చేరుకుంటుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యున్నత అధికారి ఒకరు తెలిపారు. 

ఇప్పటి వరకు ప్రపంచ స్థాయి అంతరిక్ష ఆర్థిక రంగంలో భారత్ వాటా కేవలం రెండు శాతంగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఇస్రో పలు రకాలుగా వాణిజ్యపరమైన అంతరిక్ష ప్రయోగాలకు దిగడం, విదేశీ శాటిలైట్లను కక్షల్లోకి పంపించడం వంటి పరిణామాలతో, ఇందుకు ప్రైవేటు రంగ సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. 

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రపంచ స్థాయిలో అంతరిక్ష వ్యాపార ఆర్థిక వ్యవస్థల పోటీలో ప్రైవేటు రంగ తోడ్పాటుకు ఉన్న ప్రతిబంధకాలను తొలిగించుకునేందుకు ఇస్రో అన్ని యత్నాలకు దిగింది. ఈ క్రమంలో త్వరలోనే నూతన స్పేస్ పాలసీ అందుబాటులోకి వస్తుంది. ప్రైవేటు రంగ సంస్థలను విరివిగా అంతరిక్ష బిజినెస్‌లోకి తీసుకురావడం వల్లనే త్వరిగతగతిన నిర్ణీత లక్షాల మేరకు స్పేస్ ప్రయోగాలు విజయవంతం అవుతాయని ఇస్రో భావిస్తోంది.

ప్రత్యేకించి నిర్ణీత కాలంలో శాటిలైట్ల రూపకల్పన, ట్రాన్సపాండర్ల లీజు , వాహక నౌకల తయారీ, స్పేస్ బేస్డ్ యాప్‌ల రూపకల్పన వంటి విషయాలకు ఎక్కువగా ప్రైవేటు రంగాన్ని రంగంలోకి దింపాలని, ఈ క్రమంలో వారు ముందుకు వచ్చేందుకు ఉన్న ప్రతిబంధకాలను తొలిగించాలని ఇస్రో సంకల్పించింది. ఈ విధంగా నూతన అంతరిక్ష పాలసీ ఆవిష్కృతం కానుంది. 

ఇస్రో ఇటీవలి కాలంలో అంతరిక్ష ప్రయోగాల వాణిజ్యసరళి వేగవంతానికి ప్రత్యేక విభాగాలను కూడా రూపొందించింది. స్పేస్ రంగంలోకి ప్రైవేటు సంస్థలు ఎక్కువగా ప్రవేశించేలా చేయడమే కొత్త విధాన అంతర్లీన లక్షణం అని భారత జాతీయ అంతరిక్ష రంగ ప్రోత్సాహక విషయాల అధీకృత సంస్థ (ఇన్‌స్పేస్) ఛైర్మన్ పవన్‌కుమార్ గోయంకా ఓ వార్తాసంస్థకు తెలిపారు. ప్రైవేటు రంగ తోడ్పాటును తీసుకుంటే ఇస్రో మరింతగా నిర్ణీత లక్షాలను ఛేదిస్తుంది.

ప్రత్యేకించి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం, ఎకోసిస్టమ్, అంతరిక్ష రంగానికి అవసరం అయిన వాణిజ్య హంగులను కల్పించేందుకు ఇస్రో పాటుపడుతుందని గోయంకా తెలిపారు. అంతరిక్ష పరిశోధనల క్రమంలో భారతదేశం ఇప్పటికే కీలకమైన ప్రగతిని సాధించింది. అంతరిక్ష పోటీ తత్వాన్ని రంగరించుకుంది.

దేశంలో ఇటీవలి కాలంలో ఏర్పాటు అయిన 100 స్టార్టప్‌లలో అత్యధికం అంతరిక్ష వ్యాపార పోటీకి తమ ప్రతిభకు పదునుపెడుతున్నాయని వివరించారు. ఇన్ స్పేస్ విభాగాన్ని 2020లో ఏర్పాటు చేశారు. ప్రైవేటు రంగం ఎక్కువగా అంతరిక్ష రంగంలోకి వచ్చేందుకు వీలుగా పరిస్థితిని కల్పించేందుకు, వారికి తగ్గ ప్రోత్సాహకాలను ఖరారు చేసేందుకు సింగిల్ విండో ఏర్పాటుగా దీనిని తీసుకువచ్చారు.