* పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచన
దేశం బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ కరెన్సీ నోట్ల గుర్తింపు 2025-26లో 5.7 శాతం పెరిగిందని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) శుక్రవారం వెల్లడించింది. ప్రధానంగా ముఖ విలువ రూ.200, రూ.500 ఉన్న నోట్లే ఇందులో ఎక్కువగా వుంటున్నాయని తెలిపింది. 2025-26లో మొత్తంగా నకిలీ నోట్ల సంఖ్య 2,29,746కి పెరిగిందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2,17,396గా వుందని ఆర్‌బిఐ తన వార్షిక నివేదికలో పేర్కొంది.
2024-25లో నకిలీ రూ.500 నోట్లు 20.5 శాతం పెరిగాయి. అంతకుముందు 1,17,722 గుర్తించగా, తర్వాత ఆ సంఖ్య 1,41,907కి చేరింది. అలాగే రూ.20 ముఖ విలువ ఉండే నోట్లు నకిలీ చలామణి కూడా బాగా పెరిగిందని ఆ నివేదిక తెలిపింది. ఏడాది క్రితం 253 నోట్లు బయటపడగా అవి 47.4శాతం పెరిగి 373కి చేరాయి. కాగా, రూ.200 నకిలీ నోట్ల సంఖ్య తగ్గింది. 2024-25లో 32,600 వుండగా, 2025-26లో 30,591కి పడిపోయింది.
అలాగే వంద నోట్ల నకిలీ కూడా తగ్గింది. 51,069 నుండి 45,621కి పడిపోయింది. రూ.50నోట్లు నకిలీ కూడా 12,015 నుండి 10,274కి తగ్గింది. రూ.2 వేల నోట్లు చలామణి నుండి ఉపసంహరించడంతో వాటి నకిలీ దాదాపు పడిపోయిందని చెప్పవచ్చు. అంతకుముందు ఏడాదిలో 3508 బయటపడగా, 2025-26లో ఈ సంఖ్య 824కి తగ్గిపోయింది.
ఆర్‌బిఐలో 2.4శాతం అంటే 5,412 నకిలీ నోట్లు కనుగొనగా ఇతర బ్యాంకుల్లో మొత్తంగా 97.6శాతం అంటే 2,24,334 నోట్లు కనుగొన్నారని నివేదిక పేర్కొంది. ఇంకా పోలీసులు, ఇతర ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నవి ఇందులో కలపలేదని తెలిపింది. పాడైపోయిన నోట్లను తీసివేయడం బాగా తగ్గిందని నివేదిక పేర్కొంది. 2025-26లో ఈ సంఖ్య 1.72లక్షల నోట్లుగా వుండగా అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 2.38 లక్షలుగా వుంది.
కాగా, దేశంలో కరెన్సీ డిమాండ్ నిరంతరం గణనీయంగా పెరుగుతుండడంతో ఆర్‌బిఐ పాలిమర్ బ్యాంక్ నోట్లను ప్రవేశపెట్టే విషయమై మళ్లీ చర్చలు ప్రారంభించింది. పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే ఆలోచనపై పాట్నా, ముంబైలలో జరిగిన ఇటీవలి ఆర్‌బిఐ రెండు బోర్డు సమావేశాలలో చర్చ జరిగినట్టు ఈ విషయంతో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా తెలిసింది.
సంప్రదాయ కాగితపు నోట్లకంటే పాలిమర్ నోట్లు ఎక్కువకాలం మన్నుతాయని, అలాగే వీటి తయారీ వ్యయం కూడా తక్కువగా ఉంటుందని ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నారు. పాలిమర్ ఆధారిత నోట్లను ఏటీఎంల ద్వారా కూడా పంపిణీ చేయవచ్చు. కేంద్ర బ్యాంకు త్వరలోనే పాలిమర్ కరెన్సీ పైలట్ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నదని, ఇది త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.

More Stories
కరిగిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు
రూపాయి మారకం రేటు పతనాన్ని ఆర్బీఐ అడ్డుకోవద్దు
ప్రాంతీయ పార్టీలలో టిడిపికే అత్యధికంగా ఆదాయం