ఇథనాల్ 20 శాతం కలిపిన ఈ20 పెట్రోల్ వల్ల వాహన రకం, తయారీ సంవత్సరాన్ని బట్టి ఇంధన సామర్థ్యం 2 నుంచి 6 శాతం వరకు తగ్గవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అయితే ఈ ఇంధనం వల్ల ఇంజిన్ వైఫల్యాలు సంభవించినట్లు పరీక్షల్లో తేలలేదని స్పష్టం చేశారు. గురువారం లోక్‌సభకు, బుధవారం రాజ్యసభకు వేర్వేరుగా లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు.
ప్రభుత్వ సంస్థలు, వాహన తయారీదారులు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం ఈ20 ఇంధనం వాహనాలకు సురక్షితమేనని తేలిందని ఆయన చెప్పారు. అయితే 2016కు ముందు తయారైన కొన్ని బీఎస్-3 వాహనాలకు సాధారణ సర్వీసింగ్ సమయంలో కొన్ని రబ్బరు భాగాలు, గాస్కెట్లను మార్చవలసి ఉంటుందని చెప్పారు. కొన్ని రకాల పాత (బీఎస్-3) వాహనాలు ఈ20 పెట్రోల్‌తో నడవాలంటే కొన్ని పార్ట్లు మార్చుకోవాల్సిందే అని స్పష్టం చేశారు.
“వాహన రకం, తయారీ కాలం ఆధారంగా వాహనాల ఇంధన సామర్థ్యం 2 నుంచి 6 శాతం వరకు తగ్గవచ్చు. డైనమోమీటర్పై ఇంజిన్ మన్నిక పరీక్షలు, రోడ్డుపై నిర్వహించిన వాహన పరీక్షలలో ఈ20 ఇంధనం వల్ల ఎటువంటి లోపాలు లేదా వైఫల్యాలు కనిపించలేదు” అని పేర్కొన్నారు. అలాగే ఈ10 ఇంధనంతో పోలిస్తే, ఈ20 ఇంధనం మెరుగైన ఏక్సాలరేషన్, ప్రయాణ అనుభవాన్ని అందించడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను దాదాపు 30 శాతం వరకు తగ్గిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.
ఇథనాల్ కలిసిన పెట్రోల్‌తో పనిచేయాలంటే వాహనాల ఇంజిన్‌కు మోడిఫికేషన్ అవసరం లేదని, అలాగే, వాటి సామర్ధ్యంలో కూడా మార్పు ఉండబోదని గడ్కరీ తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ), డెహ్రడూన్‌తోపాటు ఎస్ఐఏఎం, ఏఆర్ఏఐ సంస్థలతో కలిపి సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ వివరాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు.
బీఎస్-3 వాహనాలు ఏప్రిల్ 1, 2005న అందుబాటులోకి వచ్చాయని, అప్పటినుంచి 2016లోపు తయారైన వాహనాల్లోనే విడిభాగాలు మార్చుకోవాల్సి ఉంటుందని వివరించారు. కొన్ని రబ్బర్ పార్ట్స్, గ్యాస్కెట్లు మారిస్తే సరిపోతుందని చెప్పారు. ఈ కేటగిరికి చెందిన టూవీలర్లు, కార్లలో ఈ20 పెట్రోల్ వినియోగానికి సంబంధించి ఇంజిన్లలో మార్పులు చేయక్కర్లేదని స్పష్టం చేశారు.
ఈ మధ్య కాలంలో పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతోందని, ఇంజన్ల నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని కొందరు వాహనదారులు భావిస్తున్నారు. కానీ దీనిపై గడ్కరీ స్పందిస్తూ కేవలం ఇంధనం ఒక్కటే మైలేజ్‌ను నిర్ణయించదని స్పష్టం చేశారు. వాహనం నడిపే విధానం, సరైన సమయంలో ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్లు మార్చడం, టైర్లలో సరైన గాలి ఒత్తిడి మెయింటెన్ చేయడం, ఏసీ వాడకం వంటి అనేక అంశాలు మైలేజ్‌పై ప్రభావం చూపుతాయని తెలిపారు. కాబట్టి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకుంటే ఈ20 పెట్రోల్‌తో పాత వాహనాలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టమవుతోంది.

More Stories
ప్రొఫెసర్ కామకోటిపై `గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలపై దుమారం
పంజాబ్‌లో పేపర్ లీకేజీలపై ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
రాజ్యసభలో ఖర్గే వ్యాఖ్యలపై దుమారం… `మనుస్మృతి’ వ్యాఖ్యలు తొలగింపు