ప్రభుత్వం వ్యాపారాలు చేయక పోవడమే మంచిది  

ప్రభుత్వ కంపెనీలు కుదేలవుతున్న ప్రస్తుత తరుణంలో కేంద్ర ప్రభుత్వం వ్యాపారాలను చేయడం గురించి ఆలోచించక పోవడమే మంచిదని  మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ చైర్మన్ ఆర్.సి.భార్గవ సూచించారు. ప్రభుత్వ కంపెనీలు వాటి అభివృద్ధి, విస్తరణకు అవసరమైన నిధులను స్వతహాగా సమకూర్చుకోలేకపోతున్నాయని ఆయన తెలిపారు. 

 ఒకవేళ అవి అభివృద్ధి చెందాలంటే మాత్రం ప్రభుత్వం నుంచి మూలధన పెట్టుబడులను సమకూర్చాల్సిన అవసరం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  

‘‘ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీల పనితీరేం బాగాలేదు. వాటి ఉత్పాదకత కూడా అంతంతే ఉంది. అవి లాభాలను సాధించలేకపోతున్నాయి. స్వతహాగా నిలదొక్కుకోవడానికి అవసరమైన వనరులను అవి సమకూర్చుకోలేకపోతున్నాయి. అందుకే అవి పురోగతిని నమోదు చేయలేకపోతున్నాయి” అని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

ప్రభుత్వం సహకారం అందితేనే అవి అభివృద్ధి పథంలోకి రాగలుగుతాయని చెబుతూ సంపద సృష్టించే వనరుగా కంపెనీలు ఉండాలే తప్ప.. సంపదను హరించే వనరులుగా మారకూడదని మారుతీ భార్గవ స్పష్టం చేశారు. 

‘‘ప్రభుత్వరంగ కంపెనీల నిర్వహణతో ముడిపడిన విధి విధానాలు కూడా వాటి వైఫల్యానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన సమయంలో కంపెనీకి సంబంధించిన చాలా అనుమతుల కోసం పార్లమెంటరీ కమిటీల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది” అని ఆయన గుర్తు చేశారు.

 ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలు కావడమనేది భారత దేశంకే ప్రత్యేకమేం కాదని అంటూ  రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాల్లోనూ జరిగిందిదే అని ఆయన వివరించారు.