నాలుగు రోజుల పాటు తెలంగాణలో తరుణ్ చుగ్ పర్యటన

బీజేపీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పార్టీ వ్యవహారాల  ఇంచార్జ్ తరుణ్ చుగ్ శనివారం నుండి నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా బీజేపీ బలోపేతానికి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలపై ఆయన సమీక్ష చేయనున్నారు. సెప్టెంబరు 17న విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ, ఇతర కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్య నేతలతో ఆయన చర్చించనున్నారు.

శనివారం మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ ఎమ్యెల్యే, మాజీ మంత్రి  ఈటల రాజేందర్ ను తరుణ్ చుగ్ పరామార్శించనున్నారు. ఇటీవల ఆయన తండ్రి మృతి చెందారు. ఆ తర్వాత జనగామలోని రఘునాథపల్లెలో పార్టీ కార్యకర్త ఇంట్లో టీ తాగుతారు. 

అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు చేరుకొని  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమై పార్టీ బలోపేతానికి చేపట్టిన కార్యక్రమాలపై చర్చిస్తారు. ఆదివారం ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి అదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో సమావేశంకానున్నారు. 

సోమవారం ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం సహా హైదరాబాద్ నేతలతో సమీక్ష చేయనున్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో భేటీ కానున్న చుగ్ అదే రోజు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. 

మరోవంక, పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర సహకార, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ  సహాయ మంత్రి బి ఎల్ వర్మ ఈ నెల 4, 5 తేదీలలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రయాణించనున్నారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే మహబూబ్ నగర్ పార్లమెంట్  నియోజకవర్గంలో సెప్టెంబర్ 3, 4 తేదీలలో పర్యటిస్తున్నారు.