రాజాసింగ్ అరెస్ట్ కు నిరసనగా గోషామహల్ నియోజకవర్గం

తమ ఎమ్యెల్యేను గత నెలలో పిడి చట్టం క్రింద అరెస్ట్ చేసినందుకు నిరసనగా శనివారం గోషామహల్ నియోజకవర్గంలో బంద్ పాటించారు. నియోజకవర్గంలోని మహారాజ్ గంజ్, ముక్తార్ గంజ్, కిషన్ గంజ్, ఉస్మాన్ షాహీ, అశోక్ బజార్, గౌలిగూడ, ఫిష్ మార్కెట్, సుల్తాన్ బజార్, బడిచౌడీ తదితర మార్కెట్లోని వ్యాపారులందరూ స్వచ్చందంగా దుకాణాలు మూసివేసి బంద్ కు సంపూర్ణంగా మద్దతు పలికారు. 
 
అన్ని ప్రధాన కూడలిలోని ఎక్కడ చూసినా రోడ్లు అన్ని నిర్మానుష్యంగా మారాయి. ఎలాంటి ఘటలనలు జరుగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై అక్రమంగా పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ శ్రీ రామ్ యువసేన ఆధ్వర్యంలో గోషామహల్ నియోజకవర్గం బంద్ కొనసాగుతోంది. 
 
 గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదు చేసి ఇటీవలే చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా అనుచరులు నిరసనలు చేపడుతున్నారు. ఖైరతాబాదు గణేశ్ మండపం దగ్గర రాజాసింగ్ కు మద్దతుగా ఇటీవలే హిందూ సంఘాలు ఆందోళనలు చేశాయి. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వివిధ పట్టణాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోధన్, ఎల్లారెడ్డి, కరీంనగర్, ముస్తాబాద్ లలో హిందూ సంఘాలు బంద్ నిర్వహించాయి. భవిష్యత్తులో రాజాసింగ్ కు అనుకూలంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. 
 
రాజాసింగ్ కు అనుకూలంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా.. ఇంటిలిజెన్స్ కింది స్థాయి సిబ్బంది నేరుగా పోలీస్ బాస్ లకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.