రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి స్కీంలోనూ కేంద్రం వాటా

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి స్కీంలోనూ కేంద్రం వాటా ఉందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రం వాటా ఇచ్చిన మరుక్షణంలోనే కేంద్రం వాటా రిలీజ్ చేస్తున్నామని ఆమె తెలిపారు. 

అలాంటప్పుడు కేంద్రం వాటా ఉందని చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికున్న అభ్యంతరం ఏంటని ఆమె  ప్రశ్నించారు. కేంద్రం నిధులు వాడుకున్నప్పుడు పేరు ఎందుకు వేయడం లేదని ఆమె నిలదీసేరు.  కేంద్రం వాటా ఉన్న స్కీంకు కేంద్రం పేరు పెట్టాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.

అప్పులు తెచ్చి స్కీంలు అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడానికి తమకెలాంటి సంబంధం లేదని చెప్పాని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.  జనం సమస్యలు తెలుసుకోవడానికి పార్లమెంట్ ప్రవాస్ యోజన ప్రవేశపెట్టామని పేర్కొంటూ రైతు సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కేంద్ర మంత్రి వెల్లడించారు. జిల్లాలో పర్యటించడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నానని ఆమె  చెప్పారు.

కేంద్ర మంత్రిగా తాను అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం చెప్పలేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి విచారం వ్యక్తం చేశారు. పన్ను చెల్లించేవారు కట్టే ప్రతి ఒక్క రూపాయిని కూడా వృధా కానివ్వబోమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాష్ట్రం వాటా ఇచ్చిన మరుక్షణమే కేంద్రం వాటా విడుదల చేస్తున్నామని చెబుతూ  2021 వరకు తెలంగాణ ఆయుష్మాన్‌ భారత్‌లో ఎందుకు చేరలేదు? అని ఆమె ప్రశ్నించారు.

నిధులు పక్కదారి పట్టకుండా డిజిటలైజేషన్‌ తెచ్చామని చెబుతూ  సెస్‌ల పేరుతో వసూలు చేసే నిధులు కూడా రాష్ట్రాలకే వెళ్తాయని ఆమె తెలిపారు. ఏ కారణంతో సెస్‌ వసూలు చేశారో వాటి కోసమే ఆ నిధులు ఖర్చు చేయాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఫైనాన్స్‌ కమిషన్‌ ఇచ్చిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తూనే ఉన్నామని పేర్కొంటూ  ఈ రాష్ట్రానికి తక్కువ, మరో రాష్ట్రానికి ఎక్కువగా నిధులు  ఇవ్వడం అనేది ఉండదని ఆమె స్పష్టం చేశారు.

 మాటలు హరీష్ రావు వక్రీకరించారు 

అయితే తన వ్యాఖ్యలను  రాష్ట్ర మంత్రి హరీశ్ రావు వక్రీకరించారని చెబుతూ మంత్రి స్థాయిలో ఉన్న హరీశ్ రావు ప్రెస్ కాన్ఫరెన్స్ లో తానేం మాట్లాడానో విని మాట్లాడితే బాగుండేదని నిర్మలా సీతారామన్  విమర్శించారు. 

మీడియా సమావేశంలో నేనేం మాట్లాడానో మంత్రి హారీష్‌ రావు పూర్తిగా తెలుసుకోవాలి. హారీష్‌ రావు వ్యంగంగా, వెటకారంగా మాట్లాడటం సరికాదు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలి” అని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆదిలాబాద్‌లో ఉన్న ప్రాజెక్ట్‌కు హైదరాబాద్‌ ఎంపీ ఫొటో పెడతారా? అని ఆమె  ప్రశ్నించారు.

కేంద్రం నిధులు ఇచ్చినా రాష్ట్రం ఇవ్వకపోవడంతో తెలంగాణాలో ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉంటున్నాయని చెబుతూ రాష్ట్ర మంత్రులు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఆమె హితవు చెప్పారు. 60 శాతం నిధులు కేంద్రం ఇస్తే, 40 శాతం రాష్ట్రాలు భరించాలని ఆమె తెలిపారు. హైదరాబాద్‌ నుంచే తెలంగాణకు 55 శాతం ఆదాయం వస్తుందని చెబుతూ  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లాభసాటి కాదని నిపుణులే అంటున్నారని ఆమె గుర్తు చేశారు. అప్పులు తీసుకొచ్చి చేసే పనులు ఆలస్యం అయితే కేంద్రానిది బాధ్యత కాదని నిర్మలా స్పష్టం చేశారు.