త్వరలోనే వేల కోట్ల స్కాంలలో మంత్రి కేటీఆర్ అరెస్ట్!

ప్రస్తుతం ఆదాయపన్ను శాఖ  దాడులు కొనసాగుతున్నాయని చెబుతూ  త్వరలోనే వేల కోట్ల స్కాంలలో మంత్రి కేటీఆర్ ఇరుకుతాడని, తప్పకుండా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. సెప్టెంబర్ 5 న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న క్రమంలో ఏమి చేశారని ఇక్కడ పర్యటిస్తారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నిస్తూ  ‘జనతా కో జవాబ్ దో’ అనే నినాదంతో బీజేపీ భారీ సభను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు అయినా హామీలు అమలు కాలేదని విమర్శించారు. వేరే రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం 3.20 లక్షల ఇల్లు కట్టించారని,  ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వాడుకుంటున్నారని, కానీ ఇక్కడ వాడడం లేదని ధ్వజమెత్తారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జహీరాబాద్ కు వచ్చి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై ఎలాంటి విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు.  కరోనా  సమయంలోను దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడిన గొప్ప మహిళ మంత్రి ఆమె అంటూ కామారెడ్డి కలెక్టర్‌ని రేషన్ వివరాలు అడగడంలో తప్పేముందని ప్రశ్నించారు. కలెక్టర్ వివరాలు చెబితే ఎక్కడ తమ బండారం బయట పడుతుందో అని టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని ధ్వజమెత్తారు. 

మహిళా మంత్రి, తెలంగాణ కోడలు నిర్మల సీతారామన్ మీద పిచ్చి కూతలు కూస్తే ఊరుకోమని అరవింద్ హెచ్చరించారు. పేదలకు ఇచ్చే బియ్యం పంపిణీ విషయంలో కలెక్టర్ ను ప్రశ్నిస్తే  ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించడం సరికాదని హితవు చెప్పారు. బియ్యానికి కేంద్రం రూ. 30 ఇవ్వడం లేదా ? అని ప్రశ్నించారు.

 ఆయుష్మాన్ భారత్ స్కీములో కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే చేరారని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో చేరుంటే రాష్ట్ర ప్రజల ప్రాణాలు పోయేవి కాదన్నారు. మంత్రి హరీష్ రావు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన పదవి కాపాడుకునేందుకు హరిష్ కేంద్రం మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మత్తులో తూగుతున్నారని విమర్శించారు. 

ఇక నిజామాబాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, బీడీ భవన్ , రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి ..? నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఉచిత ఎరువులు, ఎకరంపల్లి ఎయిర్ పోర్టు, పోడు భూములు, కేజీ టు పీజీ విద్య, తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో హామీలు అమలు కావడం లేదని తెలిపారు. 

 ప్రతి మండలానికి నలుగు డాక్టర్లతో పాటు 30 పడకల ఆసుపత్రి, మాధవినగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, లీటర్ పాలకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్’.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు కేసీఆర్ ఇచ్చారని..కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అరవింద్ విమర్శించారు.