17న కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

తెలంగాణ  ఉద్యమం సందర్భంగా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని రాష్త్ర ప్రభుత్వమే అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ మాటే మాట్లాడక పోవడంతో మజ్లిస్ పార్టీకి భయపడి కేసీఆర్ వెనుకడుగు వేస్తున్నారని బిజెపి విమర్శలు గుప్పిస్తూ వస్తున్నది.

పైగా, బిజెపి ప్రతి ఏడాది జరుపుతున్న ఈ ఉత్సవాలకు కేంద్రంలో రాజనాథ్ సింగ్, అమిత్ షా వంటి సీనియర్ మంత్రులు హాజరవుతున్నారు. అమిత్ షా పలు బహిరంగసభలలో తెలంగాణ ప్రభుత్వాన్ని అధికారికంగా ఈ ఉత్సవాలు జరపరే అంటూ  సవాల్ చేశారు.

బిజెపి అధికారంలోకి వస్తే అధికారికంగా జరుపుతామని ప్రకటిస్తూ వచ్చారు.  ఇటీవల మునుగోడు లో జరిగిన బహిరంగ సభలోనూ అమిత్ షా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.  కానీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకముందే, నేరుగా కేంద్ర ప్రభుత్వమే సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో భారీ కార్యక్రమానికి నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గతంలో నిజాం రాజ్యంలో కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన పలు జిల్లాలు ఉండటంతో.. వారిని కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమై ఈ సెప్టెంబరు 17వ తేదీకి 74 ఏళ్లు పూర్తయి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో  ఏడాదిపాటు వజ్రోత్సవాలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాంస్కృతిక, హోం మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉత్సవాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ చేయడం, నాడు తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాలు, పోరు జరిగిన కేంద్రాలను స్మరణకు తెచ్చుకోవడం, ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు.విమోచన దినోత్సవం సందర్భంగా ఈ నెల 17న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర బలగాలతో పరేడ్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొని గౌరవ వందనం స్వీకరించనున్నారు. 

కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు బసవరాజ్‌ బొమ్మై, ఏక్‌నాథ్‌ షిండే కూడా,  ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొననున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె  చంద్రశేఖరరావును కూడా ఆహ్వానించనున్నారు. 

మరోవైపు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్) కూడా నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల పేరుతో ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. రాజకీయ రంగు లేకుండా నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఆనాటి నియంతృత్వ పాలనను ఎత్తిచూపేలా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తున్నారు. ఏడాదిపాటు వీటి నిర్వహణకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, ఇతర భావసారూప్య శక్తులు, వ్యక్తులతో ఒక సమన్వయ కమిటీ ద్వారా చేపట్టనున్నట్లు సమాచారం.