భారత నావికా దళంకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ 

భారత నావికా దళం జెండా భారతీయతను నింపుకుని సగర్వంగా ఎగురుతుంది. దీనికి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిగా నిలిచారు. దీనిని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఇప్పటివరకు భారత నావికా దళం జెండా బానిసత్వ చిహ్నాన్ని మోసిందని చెప్పారు. దాని స్థానంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో కొత్త దానిని తీసుకొచ్చినట్లు తెలిపారు. 

భారత నావికా దళం నూతన పతాకంలో వలస పాలన బానిసత్వానికి గుర్తుగా నిలిచిన సెయింట్ జార్జి క్రాస్‌ను తొలగించి, ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో నూతన పతాకాన్ని రూపొందించారు. నూతన పతాకంలో ఎడమవైపు పై భాగంలో జాతీయ పతాకం ఉంది. కుడివైపు అష్ట భుజులు రెండు ఉన్నాయి.

 వాటి మధ్యలో ఓ లంగరుపై భారత జాతీయ చిహ్నం ఉంది. ఈ లంగరు క్రింద ‘సం నో వరుణః’ అనే నినాదం ఉంది. దీనిని వేదాల నుంచి స్వీకరించారు. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునే మాట ఇది. ‘వరుణ దేవా! మా పట్ల దయ చూపించి, మాకు విజయాన్ని ప్రసాదించు’ అని దీని భావం.

జాతీయ చిహ్నం చుట్టూ ఉన్న బంగారు రంగు బోర్డర్‌కు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ మహారాజు రాజముద్ర. ఇది స్థిరత్వాన్ని వెల్లడిస్తుంది. ఎనిమిది దిక్కులను సూచించే విధంగా అష్టభుజిని ఏర్పాటు చేశారు. భారత నావికా దళం బహుళ దిశలకు చేరగలదని, అనేక రకాల కార్యకలాపాలను నిర్వహించే సత్తా దానికి ఉందని ఇది తెలియజేస్తుంది.  అంతకుముందు నావికాదళ పతాకంలో సెయింట్ జార్జి క్రాస్ ఉండేది. దానికన్నా ముందు తెలుపు రంగుపై రెడ్ క్రాస్, యునైటెడ్ కింగ్‌డమ్ యూనియన్ జాక్ ఉండేవి.

చోళుల తర్వాత సముద్ర తీరం ప్రాముఖ్యతను భారతీయ పాలకులు గుర్తించలేకపోయారు. దీంతో పోర్చుగీసు వంటి విదేశీయులు  భారత దేశ సముద్రాలపై నియంత్రణ సాధించారు. దీనిని ఛత్రపతి శివాజీ మహారాజు గమనించారు. 1650వ దశకంలో  భారత నావికా దళానికి బలమైన పునాదులు వేశారు. విదేశీ దండయాత్రల నుంచి తీరప్రాంతాన్ని కాపాడిన తొలి భారతీయ నావికా దళం ఇదే. 

పోర్చుగీసు, డచ్‌వారి నుంచి పాఠాలు నేర్చుకుని నావికా దళాన్ని ఏర్పాటు చేశారు. భారత దేశానికి చెందిన నౌకాశ్రయాలను ఉపయోగించుకోవాలంటే అప్పట్లో పోర్చుగీసు, డచ్‌వారి అనుమతి అవసరమయ్యేది.  శివాజీ వద్ద ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానం ఉండేది, పెద్ద నౌకలను తయారు చేసే విధానాన్ని విదేశీయుల నుంచి తెలుసుకున్నారు. మొత్తం మీద కొంత కాలానికి సముద్ర తీరాలను పరిరక్షించగలిగే దుర్గాలను విజయవంతంగా నిర్మించగలిగారు. ఇవి కొంకణ్ వరకు విస్తరించాయి.

ఆయన 50కి పైగా నౌకలను నిర్మించారు, 10,000 మంది నావికులను నియమించుకున్నారు. 1650వ దశకం చివర్లో ఆయన ఈ నావికా దళం ఏర్పాట్లను ప్రారంభించారు. 1674 నాటికి, అంటే దాదాపు రెండు దశాబ్దాల్లో, భారీ నావికా దళాన్ని ఏర్పాటు చేయగలిగారు. దీంతో మొఘల్ రాజులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పటికే విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న శివాజీ తమ రాజ్యాలపై దండెత్తే అవకాశం ఉందని భయపడేవారు.

భారత నావికా దళం జెండాను ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రూపొందించడం సరికొత్త శకానికి నాందిగా భావిస్తున్నారు. గత కాలపు వలస పాలన అవశేషాలను వదిలించుకున్నట్లయిందని చెప్తున్నారు. కొత్త జెండాలో అష్టభుజి నావికా దళానికి గల బహుముఖ సత్తాను చాటి చెప్తోందని వివరిస్తున్నారు.