ఉత్తర తెలంగాణాలో జిల్లాల్లో మావోయిస్టు దళాల కలకలం!

ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో  తిరిగి తమ ఉనికి పోవడం కోసం మావోయిస్టు దళాలు ప్రవేశించాయని సమాచారం అందడంతో పోలీస్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. రెండేళ్లు స్తబ్దుగా ఉన్న ఉమ్మడి ఈ జిల్లాల్లో  మావోయిస్టుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

అధికార పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు రెక్కీ నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వాస్తవానికి ఉత్తర తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయని కేంద్ర నిఘా వర్గాలు కొంతకాలంగా హెచ్చరిస్తున్నాయి. 

గతనెల 19న ములుగు జిల్లా తాడ్వాయి మండలం వీరాపూర్‌ అడవుల్లో మావోయిస్టులు భారీ ప్లీనరీ ఏర్పాటు చేయగా, పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో నక్సల్స్‌ తప్పించుకున్పప్పటికీ, కీలక సమాచారం పోలీసులకు చిక్కినట్లు చెబుతున్నారు.

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, ఆయన భార్య కంతి లింగవ్వ అలియాస్ అనితతో పాటు మరో సీనియర్ మావోయిస్టు మంగు, వర్గీస్ తదితరులు  వారం రోజులుగా సంచరిస్తున్నారన్న సమాచారం పోలీసులకు  చేరింది

  మావోయిస్టులు కొత్త దళ సభ్యుల రిక్రూట్ మెంట్ కోసం వచ్చారా లేక షెల్టర్ తీసుకోవడం కోసమా.. లేదా మరేదైనా యాక్షన్ ప్లాన్ తో వచ్చారా అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా తమ ఉనికి చాటుకోవడం కోసం, విరాళాల సేకరణ కోసం  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలను లక్ష్యంగా  చేసుకుని  దాడులకు పాల్పడే అవకాశాలున్నట్లు పోలీస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 

ఇప్పటికే  మావోల జాబితాలో ఉన్న సదరు నేతలను పోలీసులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడా పర్యటించి వద్దని స్పష్టంచేశారు. తమ నెట్‌వర్క్‌ పునరుద్ధరించుకోవాలన్నా, విరాళాలు సేకరించాలన్నా హింసాత్మక దాడులకు పాల్పడటమే మార్గంగా మావోలు  అడుగులు వేస్తున్నట్లు భావిస్తున్నారు.

మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌ సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలోని కొందరు నాయకులకు ముప్పు అధికంగా ఉందని, దీన్ని సున్నిత ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులు, కొత్త వ్యక్తుల సమాచారాన్ని నిరంతరం తెప్పించుకుంటున్నారు. జిల్లా సరిహద్దుల వద్ద సీసీ కెమెరాలు, ఇన్‌ఫార్మర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు.

పొరుగున ఉన్న  ఛత్తీస్‌ఘడ్‌   అడవుల నుండి గోదావరి నది దాటి వీరు పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో గత సోమవారం సీఎం కేసీఆర్ పెద్దపల్లి పర్యటనలో ఆఖరు నిమిషాన రోడ్డు మార్గం వద్దని పోలీసులు ఆకాశమార్గం (హెలీక్యాప్టర్‌) ద్వారా రప్పించారు.

ఇటీవల పెద్దపల్లి జిల్లాలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో వెలుగుచూసిన కుంభకోణంలో మావోయిస్టు కార్యదర్శి వెంకటేశ్‌ పేరుతో విడుదలవుతున్న లేఖలపై పోలీసులు దృష్టి సారించారు. ఆ లేఖల్లో పలువురు నేతల పేర్లు ప్రస్తావించడంతో అవి ఎక్కడ నుంచి వచ్చాయన్న విషయంపై కూపీ లాగుతున్నారు. అదే విధంగా మాజీ మావోలపైనా రహస్యంగా నిఘా కొనసాగిస్తున్నారు. 

 మరో నెల రోజుల్లో మన్యం వీరుడు కుమ్రంభీం వర్ధంతి ఉండడంతో ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా భావించే ఈ ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గతంలో ఐదు రోజులు మకాం వేసి మావోయిస్టుల ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షించారు. 

సెప్టెంబర్ 2020లో కాగజ్ నగర్ మండలం కడంబా అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.ఈ ఘటనలో మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడెల్లు అలియాస్ భాస్కర్ తో పాటు మరికొందరు తప్పించుకున్నారు. 

కొద్దిరోజులుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. జిల్లాస్థాయి పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ మావోయిస్టులకు సహకరించవద్దని సూచనలు ఇస్తున్నారు. పోస్టర్లను రిలీజ్ చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.  జిల్లాలో 10 నుంచి 15 మంది మావోయిస్టులు సంచరిస్తున్నారంటూ వారి పోస్టర్లను ఆసిఫాబాద్   ఎస్పీ సురేష్ కుమార్ విడుదల చేశారు.