భారత నౌకాదళ అమ్ములపొదిలోకి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్

భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరుతోంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్ నౌకాదళంలోకి చేరింది. కేరళ కొచ్చిన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ  ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రారంభించారు. దేశీయంగా తయారుచేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ ఐఎన్ఎస్ విక్రాంత్‌కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇది మరో అడుగు అని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు.  ఇప్పటి వరకు ఇలాంటి విమాన వాహక నౌకలను అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే తయారు చేశాయని, ఈ లీగ్‌లో భాగం కావడం ద్వారా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అడుగులు వేశాయని ప్రధాని మోదీ చెప్పారు.

“ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధ యంత్రం కాదు, భారతదేశపు నైపుణ్యం, ప్రతిభకు నిదర్శనం. ఇది ప్రత్యేకమైనది, విభిన్నమైనది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  మన దేశంలోనే డిజైన్ చేసి, నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను భారత నావికా దళానికి అప్పగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఛత్రపతి శివాజీ మహారాజు స్ఫూర్తితో రూపొందించిన కొత్త నావికా దళ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ తదితరులు పాల్గొన్నారు. విక్రాంత్‌ను ప్రారంభించడంతో, భారతదేశం రెండు కార్యాచరణ విమాన వాహక నౌకలతో దేశపు సముద్ర భద్రతను పెంచుతుంది.

రూ. 20 వేల కోట్లతో నిర్మించిన ఈ నౌకతో పాటు కొచ్చిన్ నౌకాశ్రయంలో ఆటోమేషన్ సౌకర్యాలను ప్రధాని మోదీ ప్రారంభించారు.262 మీటర్ల పొడుగు ఉండే ఈ బాహుబలి ఐఎన్ఎస్ విక్రాంత్  నౌకను కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో తయారుచేశారు. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నిర్మాణంతో విమాన వాహక నౌకలు నిర్మించగల సామర్థ్యం ఉన్న 6వ దేశంగా భారత్‌ నిలిచింది. అమెరికా, బ్రిటన్‌ ,రష్యా, ఫ్రాన్స్‌, చైనా దేశాల పక్కన భారత్‌ నిలిచింది.

భారతీయుడి ఆత్మ నిర్భరతకు, మేథస్సుకు ప్రతీకగా ఐఎన్ఎస్- విక్రాంత్‌ నిలవనుంది. 1971 యుద్ధంలో సేవలు అందించిన దేశ మొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్-విక్రాంత్‌ పేరుతోనే దీనికి నామకరణం చేశారు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక యుద్దనౌక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా భారత అమ్ముల పొదిలోకి ఈరోజు చేరుతుంది.

కాగా, 262 మీటర్ల పొడవు, 62 వెడల్పును కలిగిన ఉన్న ఈ బాహుబలి నౌక, గంటకు గరిష్ఠంగా 28 నాటికల్‌మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 51.8 కిలోమీటర్ల స్పీడుతో సముద్రంలో దూసుకెళ్లనుంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ద్వారా 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తీసుకెళ్లొచ్చు. 

45వేల టన్నుల ఈ యుద్ధ నౌక నుంచి శత్రు దేశాల విమానాలు, క్షిపణులను లక్ష్యంగా చేసుకోవచ్చు. యుద్ధ సమయాల్లో విమానాలు అలా గాల్లోకి ఎగిరి, శత్రువు పని పట్టేసి ఇలా తిరిగి వచ్చేసేలా ఈ యుద్ధ నౌకలో ఏర్పాట్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్‌ యుద్ధనౌకలో 1,700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. 

యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించేందుకు యుద్ధనౌకలో భారీ ఏర్పాట్లు చేశారు. 16 పడకలతో చిన్నపాటి ఆసుపత్రిని నిర్మించారు. అలాగే రెండు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, వార్డులు, ఐసీయూలు, ఒక సీటీ స్కాన్‌మెషీన్ ఉన్నాయి. ఇక్కడ ఐదుగురు వైద్య అధికారులు, 15 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు.