మదరసాలను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు

మదరసాలను భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. అయితే, మదరసాలను కూల్చేయడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.  జీహాదీ శక్తులు వాటిని ఉపయోగించుకోకుండా చూడాలనేదే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు.  మదరసా ముసుగులో భారత వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు నిర్దిష్టంగా వెల్లడైతే ఆ భవనాన్ని కూల్చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.
మదరసాలను కూల్చేయాలన్నది మా అభిమతం, ఉద్దేశం కాదు. జిహాదీ శక్తులు వాటిని ఉపయోగిస్తున్నాయా? లేదా? అని పరిశీలించడమే మా పని. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వాటిని ఉపయోగిస్తున్నారని,  సంబంధాలు ఉన్నాయని తేలితే చాలూ.. వాటిని కూల్చివేసి తీరతాం.  ఈ విషయంలో బుల్డోజర్లు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు” అని తెలిపారు.
బొంగైగావ్ జిల్లాలో ఓ మదరసాలో జీహాదీ కార్యకలాపాలు జరుగుతున్నట్లు, ఆ భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమైనట్లు వెల్లడి కావడంతో, ఆ భవనాన్ని బుధవారం కూల్చేశారు.  ఈ మదరసాకు అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్, అన్సరుల్ బంగ్లా టీమ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలుగల ఐదుగురిని ఈ మదరసాలో అరెస్టు చేసినట్లు తెలిపారు.
 
అస్సాంలోని బార్‌పేట జిల్లాలో ఉన్న ఓ మదరసా నాలుగేళ్ళ నుంచి ఇద్దరు బంగ్లాదేశీయులకు అక్రమంగా ఆశ్రయం ఇచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఇద్దరూ అన్సరుల్ బంగ్లా టీమ్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని తెలిపారు. వీరిలో ఒకరిని, ఈ మదరసా ప్రిన్సిపాల్, టీచర్ సహా, మరొకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మదరసాను సోమవారం కూల్చేసినట్లు చెప్పారు. 
నెల రోజుల వ్యవధిలో మూడు మదరసాలను కూల్చివేశారు. మదర్సాలో తనిఖీలు చేపట్టగా.. నిషేధిత రాడికల్ గ్రూపులకు సంబంధించిన ప‌లు పత్రాలు, ప్ర‌చార ప్ర‌తులు దొరికాయి. ఈ నేపథ్యంలో కట్టడానికి అనుమతులు లేవంటూ కూల్చేశారు.  అలాగే.. అల్ ఖైదాతో సంబంధం ఉన్న ఇమామ్‌లు. మదర్సా ఉపాధ్యాయులతో సహా 37 మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ మదర్సా కూల్చివేతకు ముందు.. అందులోని నుంచి విద్యార్థుల‌ను ఖాళీ చేయించి.. ఇతర విద్యాసంస్థలకు పంపిస్తున్నారు. అల్-ఖైదా, బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ అన్సరుల్ బంగ్లా టీమ్ (ఎబిటి) సభ్యులు మదర్సాలలో తలదాచుకుంటున్న ఘటనలు ఇప్పుడు పెరిగిపోతున్నాయ్‌. జిహాదీ కార్యకలాపాలకు అస్సాం హాట్‌బెడ్‌గా మారిందంటూ తాజాగా ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటిదాకా 40 మంది బం‍గ్లాదేశీ ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్ట్‌ చేశారు.