కిడ్నాప్‌ కేసు.. శాఖ మార్చిన కాసేపటికే బిహార్‌ మంత్రి రాజీనామా

2014లో జరిగిన అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌జేడీ నేత, బిహార్‌ మంత్రి కార్తీకేయ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖ ను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు బుధవారం రాత్రి పంపగా, ఆయన వెంటనే ఆమోదించి గవర్నర్ కు పంపారు. 

కిడ్నాప్‌ ఆరోపణల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆయన్ను ఎప్పట్నుంచో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. దానితో బిహార్‌ న్యాయ శాఖ మంత్రిగా ఉన్న కార్తీకేయను బుధవారమే చెరుకు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ముఖ్యమంత్రి మార్చారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం, రాజీనామా లేఖను నితీశ్ కుమార్ గవర్నర్‌కు పంపడం చకచకా జరిగిపోయాయి

ఇక బిహార్‌లో బీజేపీ కూటమి నుండి వైదొలిగిన జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రివర్గం ఏర్పాటులో భాగంగా కార్తీకేయకు న్యాయ శాఖను కేటాయించారు. 

 దీంతో ఆయనకు మంత్రి పదవి దక్కడంపై నితీష్‌ కుమార్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. విపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేశాయి. ఈ నిరసనల నేపథ్యంలో కార్తీక్‌ కుమార్‌ను బిహార్‌ సీఎం నితిష్‌ కుమార్‌ న్యాయశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పించి, ఆయనకు తక్కువ ప్రాధాన్యత కలిగిన చెరుకు శాఖను అప్పగించారు.

అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో కొత్త శాఖను కేటాయించిన గంటల వ్యవధిలోనే కార్తీక్‌ కుమార్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కార్తీక్‌ కుమార్‌ రాజీనామాతో రెవెన్యూశాఖ మంత్రి అలోక్‌ కుమార్‌ మెహతాకు చెరుకు శాఖ అదనపు బాధ్యతలు అ‍ప్పగించారు.

కార్తీకేయ సింగ్ రాజీనామా చేసిన వెంటనే బిహార్ బీజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి  సుశీల్ మోదీ స్పందిస్తూ ఫస్ట్ వికెట్ పడిందని, మరిన్ని వికెట్లు పడడం ఖాయమని అంటూ ట్వీట్ చేశారు. ఆర్జేడీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కార్తీక్‌  బిహార్‌లో రాజకీయంగా శక్తివంతమైన భూమిహార్‌ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావడంతో ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌ ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.