ఆప్ నేతలపై లెఫ్టినెంట్ గవర్నర్ చట్టపర చర్యలు!

రూ.1,400 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై చట్టపరమైన చర్యలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సన్నాహాలు చేస్తున్నారు. ఆయన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్  చైర్మన్‌గా పని చేసిన కాలంలో అవినీతికి పాల్పడినట్లు వీరు ఆరోపించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
 తనపై తప్పుడు, గౌరవానికి భంగం కలిగించే విధంగా అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు అతిష్‌, సౌరభ్‌ భరద్వాజ్‌లతో పాటు పలువురు ఆప్‌ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు.ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జాస్మిన్‌ షాపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
 
 ‘ఒకరిపై ఆరోపణలు చేసేందుకు గంతులేస్తూ వచ్చే లక్షణం కేజ్రీవాల్‌ అండ్‌ కోది. ఆప్‌ నేతలు చేసిన తప్పుడు, పరువునష్టం కలిగించే ఆరోపణలపై ఎల్‌జీ ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆప్‌ నేతలు  తప్పించుకోలేరు.’ అని ఎల్‌జీ సక్సేనా కార్యాలయం పేర్కొంది.
 
వీకే సక్సేనా 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో కుంభకోణానికి పాల్పడ్డారని, ఆయనపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. అయితే సీబీఐ ఇప్పటికే కేవీఐసీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి, ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. 
 
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆప్ నేతల ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పరువు నష్టం కలిగించినందుకు, తనపై నిరాధారంగా అవినీతి ఆరోపణలు చేసినందుకు ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, అతిషి, దుర్గేష్ పాఠక్, జాస్మిన్ షా తదితరులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వీకే సక్సేనా నిర్ణయించారు. 
 
భారత ప్రభుత్వం 2016 నవంబరు 8న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసింది. ఆ మర్నాడు కేవీఐసీ జారీ చేసిన సర్క్యులర్‌లో, తమ సేల్స్ ఔట్‌లెట్లు, ఎస్టాబ్లిష్‌మెంట్లలో ఈ నోట్లను స్వీకరించబోమని తెలిపింది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. 
 
రద్దయిన నోట్లను న్యూఢిల్లీలోని ఖాదీ గ్రామోద్యోగ్ భవన్‌ ఖాతాల్లో వేర్వేరు తేదీల్లో జమ చేశారు. దీనిపై దర్యాప్తు జరిపి, చర్యలు తీసుకోవాలని కేవీఐసీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌కు నివేదించారు. ఈ సమాచారం ఆధారంగా సీబీఐ 2017 ఏప్రిల్ 6న ఉమ్మడిగా ఆకస్మిక తనిఖీలు చేసింది. 2017 ఏప్రిల్ 17న చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నలుగురు కేజీబీ అధికారులను సస్పెండ్ చేసి, బదిలీ చేయాలని ఆదేశించారు. 
 
అయితే సీబీఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, ఇద్దరు హెడ్ క్యాషియర్లు సంజీవ్ కుమార్ మాలిక్, ప్రదీప్ యాదవ్ మాత్రమే ఈ నేరానికి పాల్పడినట్లు నిర్థరించింది. వారిపై ఎఫ్ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక)ను నమోదు చేసింది. రద్దయిన కరెన్సీ నోట్ల రూపంలో వీరు కేజీబీ ఖాతాలలో జమ చేసినది కేవలం రూ.17.07 లక్షలు మాత్రమేనని,  చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ చెప్పినట్లుగా రూ.22.17 లక్షలు కాదని వివరించింది. 
 
వీరు జమ చేసిన సొమ్ము మొత్తం రూ.22.17 లక్షలు అని, దీనిలో చట్టపరంగా చెల్లుబాటయ్యే నోట్ల విలువ రూ.5.1 లక్షలు అని వివరించింది. రూ.17.07 లక్షలు రద్దయిన నోట్లు అని తెలిపింది. సంజీవ్, ప్రదీప్‌లపై ఛార్జిషీటు దాఖలు చేసింది. దీనిపై ప్రస్తుతం ఢిల్లీ కోర్టు విచారణ జరుపుతోంది.